కల్పతరువును కాలదన్నారు..!

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్‌ ఐటీ నూతన విధానాన్ని గొప్పగా ఆవిష్కరించారు. దాన్ని చూసిన యువకులు, వారి తల్లిదండ్రులు.. ఐటీ రంగంలో తక్కువ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతామని సంబరపడిపోయారు.

Published : 11 Apr 2024 06:11 IST

జగన్‌ ఐటీ పాలసీ తుస్‌
నైరాశ్యంలో ఆంధ్రా యువత
కాన్సెప్ట్‌ సిటీలు, రీసెర్చ్‌ వర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఊసే లేదు
దేశ ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2 శాతమే
అదే సమయంలో తెలంగాణ నుంచి రూ.2 లక్షల కోట్ల ఎగుమతులు


తెలంగాణలో..

ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నిపుణుల లభ్యత, మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ అధికం. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో మా గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(జీడీసీ) ఏర్పాటు చేస్తున్నాం.’’

 హైదరాబాద్‌లో ఇలాంటి ప్రకటనలు చేసే కంపెనీలు కనీసం నెలకు రెండు, మూడు అయినా ఉంటాయి. ఆయా కంపెనీలు తమ జీడీసీలను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి.    


ఆంధ్రప్రదేశ్‌లో..

ఇలా కేంద్రాలను స్థాపించే ఐటీ సంస్థలు మచ్చుకైనా కనిపించటం లేదు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై నగరాలు దేశంలోని టాప్‌-5 ఐటీ నగరాలుగా వెలుగొందుతున్నాయి. ఆకర్షణీయ ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించి ఈ మూడు నగరాల్లోని ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించొచ్చు. ప్రభుత్వం చొరవ చూపి వాటిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తన ఐదేళ్ల పాలనలో జగన్‌ ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలే లేవు. ఇక ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తాయి? నిరుద్యోగులకు ఉపాధి ఎలా లభిస్తుంది? రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా పరుగులు తీస్తుంది?


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్‌ ఐటీ నూతన విధానాన్ని గొప్పగా ఆవిష్కరించారు. దాన్ని చూసిన యువకులు, వారి తల్లిదండ్రులు.. ఐటీ రంగంలో తక్కువ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతామని సంబరపడిపోయారు. కానీ వాస్తవంగా  జరిగింది మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. సీఎం జగన్‌ ప్రభుత్వం 2021 జూన్‌లో ఆవిష్కరించిన ‘ఏపీ ఐటీ పాలసీ 2021-24’ యువతలో భారీ ఆశలు కల్పించింది. ఈ పాలసీ గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిపోయింది. దాన్ని ఆవిష్కరించిన సమయంలో చెప్పిన వాటిలో ఒక్క అంశాన్ని కూడా ఆచరణలో చూపలేకపోయింది వైకాపా సర్కారు. ఈ పాలసీని పూర్తిగా విస్మరించి నిరుద్యోగ యువతను నయవంచనకు గురిచేసింది.

మూతబడే దాకా శాంతించలేదు..

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐటీ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించాలనే తపనతో అప్పట్లో ఎంతో మంది ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కొన్ని ఐటీ కేంద్రాలు, బ్యాక్‌ ఆఫీస్‌లు నెలకొల్పారు. కేవలం విజయవాడ పరిసరాల్లోనే ఇలాంటివి 100కు పైగా కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ భిన్న వ్యాపార రంగాలకు సంబంధించి డేటాను ప్రాసెస్‌ చేసే ‘బ్యాక్‌ ఆఫీస్‌’లను కూడా ఎక్కువ సంఖ్యలోనే ప్రారంభించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీతభత్యాలు తక్కువే అయినా.. ఖర్చులు తక్కువగా ఉండటం, సొంత ఊరికి దగ్గరగా ఉంటూ పని చేసుకోవచ్చనే భావనతో యువత ఈ కేంద్రాల్లో ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపారు. క్రమేణా రాష్ట్రంలో ఐటీ రంగం వేగం పుంజుకుంటుందని యువకులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు సంబరపడుతున్న తరుణంలోనే 2019 ఎన్నికలు వచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు.. కొత్త ఐటీ సంస్థల ఏర్పాటు, అప్పటికే కొనసాగుతున్న ఐటీ కంపెనీల గురించి పట్టించుకోకపోవడంతో వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. యువతకు మెరుగైన ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్‌.. కొత్త కంపెనీలను ఆకర్షించి ఐటీ రంగం విస్తరణకు దోహదపడకపోగా అప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సంస్థలు మూతబడే దాకా శాంతించలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటయ్యాయన్న ఒకేఒక్క కారణంతో.. జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఐటీ రంగం కుదేలై ఉనికి కోల్పోయే ప్రమాదమేర్పడింది.

ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2 శాతమే..

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖల మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ గతేడాది ఏప్రిల్‌లో రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2021-22లో  ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు అని, మనదేశం నమోదు చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో ఇది 0.14 శాతం మాత్రమేనని వెల్లడించారు. అంతేగాకుండా అయిదేళ్లలో మనదేశం నమోదు చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో ఏపీ ఎగుమతులు 0.2 శాతం కంటే తక్కువేనని స్పష్టం చేశారు. కర్ణాటక నుంచి రూ.3 లక్షల కోట్లకు పైగా, తెలంగాణ నుంచి సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు నమోదవడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఐటీ రంగం లేనట్లేననే భావన  కలగకమానదు.


ఐటీతో ఏపీకి ఎంతో మేలు..

గత రెండున్నర దశాబ్దాల కాలంలో మనదేశంలో ఐటీ రంగం బహుముఖంగా విస్తరించింది. ఈ రంగం దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుండగా.. పరోక్షంగా దీనికి నాలుగు రెట్లు అధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి ఐటీ ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబం మొత్తం ఆర్థిక స్థిరత్వం సాధించే వీలుకలుగుతుంది. ఐటీ రంగాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఏపీ రాష్ట్రానికి ఎంతో అవకాశముంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కూడా ఈ రంగం కల్పతరువు లాంటిది. పైగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా అధిక ఆదాయం వస్తుంది.


‘కాన్సెప్ట్‌ సిటీ’లు కానరావేమీ..?

‘ఏపీ ఐటీ పాలసీ 2021-24’ హామీల్లో.. ‘కాన్సెప్ట్‌ సిటీ అభివృద్ధి’ ఒకటి. అన్ని రకాలైన సౌకర్యాలు, మౌలిక    సదుపాయాలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు నెలకొల్పి వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని  పేర్కొన్నారు. మానవ వనరుల లభ్యతకు, నివాస ప్రాంతాల ప్రగతికి చర్యలు  తీసుకుంటామని అందులో వివరించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. మూడు ప్రాంతాల్లో కాదు కదా.. కనీసం ఒక్క చోట అయినా ఐటీ కాన్సెప్ట్‌ సిటీని ప్రారంభించలేకపోయింది జగన్‌ ప్రభుత్వం.

విశ్వవిద్యాలయం రాలేదు

 ‘ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు కూడా ఈ విధానంలో పేర్కొన్న మరో ముఖ్యాంశం. విశాఖపట్నంలో ఈ వర్సిటీని ఆవిష్కరిస్తామని గొప్పగా  చెప్పుకొంది. అత్యాధునిక ఐటీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను ఈ యూనివర్సిటీ అందిస్తుందని, యువతను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించటం దీని లక్ష్యమని   వివరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని విషయాన్నే మరిచిపోయింది.

టెక్నాలజీ పార్కు..?

 ఇంక్యుబేషన్‌ కేంద్రాలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, ల్యాబ్స్‌,   కో-వర్కింగ్‌ స్పేసెస్‌, డిజిటల్‌ లైబ్రెరీ తదితర ఐటీ సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కును సైతం ఆవిష్కరిస్తామని ఐటీ పాలసీలో పేర్కొన్నారు. అతీగతీ లేని ఐటీ హామీల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోయింది.

ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌..?

 అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి యాక్సెలరేట్‌ స్టార్టప్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏఎస్‌ఏపీ) పథకానికి రూపకల్పన, రూ.100 కోట్లతో ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ ఏర్పాటు, వర్సిటీలు, కాలేజీల  భాగస్వామ్యంతో ‘హ్యాకథాన్స్‌’ నిర్వహణ, ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలు... తదితర అంశాలను ఐటీ పాలసీలో పొందుపరిచారు. ఇందులో ఒక్క అంశాన్ని కూడా అమలుచేయలేక ఘోరంగా చతికిలబడ్డారు జగన్‌.- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని