తిరుపతిలో దొంగ ఓట్ల దందా

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందాకు తెరలేపిన అధికార వైకాపా... ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తరహా వ్యవస్థీకృత నేరానికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated : 11 Apr 2024 09:56 IST

జాబితా పరిశీలిస్తే బయటపడుతున్న నకిలీ, డబ్లింగ్‌ ఓట్లు

ఈనాడు-అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందాకు తెరలేపిన అధికార వైకాపా... ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తరహా వ్యవస్థీకృత నేరానికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే నకిలీ, డబ్లింగ్‌ ఓట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరు, తండ్రి పేరు, ఒకే ఇంటి నంబర్‌తో వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో రెండేసి ఓట్లున్నాయి. ఓటరు పేరు, తండ్రి పేరును ఆంగ్ల అక్షరాల్లో కొద్దిగా మార్చేసి రెండేసి చోట్ల ఓటర్లుగా చేర్పించారు. నియోజకవర్గంలో ఇలాంటి ఓట్లు 38,493 ఉన్నట్లు ప్రతిపక్షాలు గుర్తించాయి. ఈ మేరకు జనసేన, భాజపా నాయకులు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా (సీఈవో)కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతిని కేంద్ర బిందువుగా మార్చారు. లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ నాటికి ఈ ఓట్లు జాబితాలో లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని విపక్షాలు చెబుతున్నాయి.

ఒకే పేరు.. ఒకే ఇంటి చిరునామా.. కానీ వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు

  • ఎస్‌.పవన్‌కుమార్‌ అనే పేరుతో 19వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో(రామచంద్ర గుంట కట్ట) సీరియల్‌ నంబర్‌ 329తో ఒక చోట, 139వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో(ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు) సీరియల్‌ నంబర్‌ 329తో మరో చోట ఓటు ఉంది. ఈ రెండు చోట్ల తండ్రి పేరు ఎస్‌.జయకుమార్‌ అనే ఉంది. ఇంటి నంబర్‌ కూడా 19-42-ఎస్‌8-451గా ఉంది. ఒకే ఇంటి నంబర్‌ రెండు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండటం ఎలా సాధ్యమవుతుంది?
  •  ఎన్‌.నాగరాణి పేరుతో 177వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 741తో, 180వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 913తో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల భర్త పేరు, ఇంటి నంబర్‌ ఒకటే ఉంది.
  •  సుబ్రహ్మణ్యం సందీప్‌ అనే పేరుతో 246, 247 నంబర్‌ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓట్లున్నాయి. అయితే రెండు చోట్ల తండ్రి పేరు, ఇంటి నంబర్‌ ఒకటే ఉంది. సుబ్రమణ్యం రెడ్డి పేరుతో 133, 134 నంబర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లున్నాయి. ఈ ఓట్లకు కూడా ఇంటి నంబర్‌ ఒకటే ఉంది.

అక్షరాల మధ్య స్పేస్‌ ఇచ్చి.. బురిడీ కొట్టించి

  • ఏ.బాలచంద్రన్‌ అనే పేరుతో 41వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 148తో, 43వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 153తో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల తండ్రి పేరు, ఇంటి నంబర్‌ ఒకటే ఉంది. ఒక చోట ‘‘బాలచంద్రన్‌ ఏ’’ అని ఉండగా.. మరో చోట ‘‘బాల చంద్రన్‌ ఏ’’ అని పొందుపరిచారు. బాల, చంద్రన్‌ మధ్యలో కొంత స్పేస్‌ ఇచ్చి డబుల్‌ ఎంట్రీ ఓట్ల బండారం బయటపడకుండా చేశారు.

క్యాపిటల్‌ లెటర్స్‌.. స్మాల్‌ లెటర్స్‌తో మాయ చేసి

  •  ఆర్‌.మోహన్‌సాయి అనే పేరుతో 57వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 13తో, 55వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 994తో ఓట్లున్నాయి. ఒక చోట ఆంగ్లంలో క్యాపిటల్‌ లెటర్స్‌తో పేరు ఉండగా.. మరో చోట స్మాల్‌ లెటర్స్‌తో పేరు పెట్టారు. ఈ రెండు చోట్ల ఇంటి నంబర్‌ ఒకటే ఉంది. అయితే అది ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇంటి నంబర్‌ చివర్లో ఆంగ్ల అక్షరం ‘‘బీ’’ని ఒక చోట క్యాపిటల్‌ లెటర్స్‌లో, మరో చోట స్మాల్‌ లెటర్స్‌లో పెట్టారు.
  • జి.దేవ పేరుతో 133వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 1,502తో, 134వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 1,264తో ఓట్లున్నాయి. ఆంగ్లంలో క్యాపిటల్‌ లెటర్స్‌తో ‘‘దేవగ్‌’’ అని ఒక చోట... స్మాల్‌ లెటర్స్‌తో ‘‘దేవ జి’’ అని మరో చోట పేరు చేర్చారు.

ఒక చోట తండ్రిగా పేరు.. మరో చోట భర్తగా పేరు

  • 124వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 272లో ఒక చోట, 122వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సీరియల్‌ నంబర్‌ 710లో మరోచోట సి.అనురాధ పేరుతో రెండు వేర్వేరు ఓట్లున్నాయి. సి.చిరంజీవి అనే పేరును ఒక చోట తండ్రిగా, మరో చోట భర్తగా పేర్కొన్నారు.
  •  132, 223వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో లలిత అగరం పేరుతో రెండు ఓట్లున్నాయి. సాయికుమార్‌ అగరం పేరును ఆమెకు ఒక చోట తండ్రిగా, మరో చోట భర్తగా చూపించారు.
  • నీ 244, 245వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సీరియల్‌ నంబర్‌ 716, 737ల్లో ఎన్‌.అమృత పేరుతో రెండు ఓట్లున్నాయి. ఎన్‌.హరిబాబును ఆమెకు ఒక చోట భర్తగా, మరొక చోట తల్లిగా చూపించారు.

అసలు కుతంత్రమిదేనా?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో అధికార వైకాపా నాయకులు.. ఈఆర్‌వో లాగిన్‌, పాస్‌వర్డ్‌ను తీసుకుని ఆబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన 32 వేలకు పైగా ఎపిక్‌ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్‌ చేశారు. వాటిపై ఫొటోలు మార్చేసి వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించారు. దీనికోసం ఇతర ప్రాంతాలకు చెందిన వేల మందిని బస్సుల్లో తిరుపతికి తరలించారు. దొంగ ఓట్లేయడానికి వరుసలో నిలబడిన వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు మీ పేరేంటి? తండ్రి పేరేంటి? చిరునామా ఏంటి అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. గట్టిగా నిలదీసేసరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దొంగ ఓట్లు వేయించే పన్నాగంలో భాగంగానే.. భారీగా దొంగ ఓటర్లను చేర్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని