భూమి వదులుకోకపోతే.. కాల్చిపారేస్తాం

‘భూమి వదులుకోకపోతే కాల్చి పారేస్తాం’ అంటూ.. ఒక విశ్రాంత డీఎస్పీ, ఇద్దరు ఉపాధ్యాయులు, వారితోపాటు వచ్చినవారు ఒక తుపాకీ చూపించి రైతుల్ని బెదిరించడం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.

Published : 11 Apr 2024 04:42 IST

తుపాకీతో రైతులకు బెదిరింపులు
నిందితుల్లో మాజీ డీఎస్పీ, ఇద్దరు టీచర్లు 
కర్నూలు జిల్లాలో కలకలం

ఈనాడు, కర్నూలు, పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ‘భూమి వదులుకోకపోతే కాల్చి పారేస్తాం’ అంటూ.. ఒక విశ్రాంత డీఎస్పీ, ఇద్దరు ఉపాధ్యాయులు, వారితోపాటు వచ్చినవారు ఒక తుపాకీ చూపించి రైతుల్ని బెదిరించడం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన అప్పల నాగరాజు, అప్పల ఉరుకుందులకు పెద్దకడబూరు మండలంలోని హులికన్విలో 4.77 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో 33 సెంట్ల భూమిని తగ్గించి చూపారు. ఆ భూమిని పక్క పొలం యజమానికి కలిపారని గుర్తించారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బాధిత రైతులకు న్యాయం చేయాలని ఆదేశించింది. రెవెన్యూ సిబ్బంది నాలుగు నెలల కిందట వారికి హద్దులు చూపే ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పక్క పొలానికి చెందిన మహదేవ, చిన్నఈరన్నలు అడ్డుకోగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరూ ఉపాధ్యాయలు. అనంతరం గత నెల 31న వారు ఓ విశ్రాంత డీఎస్పీతోపాటు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి వచ్చి పంచాయితీకి రమ్మని పొలంలో కొంత భాగం కోల్పోయిన రైతులను కోరారు. దీంతో వారు పొలం వద్దకెళ్లగా.. అవతలి వ్యక్తుల్లో ఒకరు తుపాకీ బయటకు తీసి పట్టుకున్నారు. అయినప్పటికీ బాధిత రైతులు భయపడకుండా ఆ భూమి తమదని వాదించారు. దానిని వదులుకోకపోతే కాల్చి పారేస్తామని విశ్రాంత డీఎస్పీతోపాటు వచ్చిన వ్యక్తుల్లో ఒకతను బెదిరించారు. దీంతో బాధితులు మళ్లీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తుపాకీతో బెదిరించిన ఉదంతాన్ని పోలీసులు గట్టుగా ఉంచారు. బెదిరింపులకు పాల్పడ్డ వారిలో కొందరిని అసలు నిందితులుగానే చూపలేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పెద్దకడబూరు ఎస్సై మహేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. విశ్రాంత డీఎస్పీ రఘునాథాచారి, ఉపాధ్యాయులు మహదేవ (బల్లేకల్‌ గ్రామ ఉపాధ్యాయుడు), చిన్న ఈరన్న (పెద్దతుంబళం ఉపాధ్యాయుడు)తోపాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులు దొరకలేదని, వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం తుపాకీ గురించి తెలుసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని