సంక్షిప్తవార్తలు(5)

రాష్ట్ర వ్యాప్తంగా 13,104 పాఠశాలల్లో నిర్వహించిన టోఫెల్‌ పరీక్షకు.. మూడు నుంచి అయిదో తరగతి చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు.

Updated : 11 Apr 2024 06:32 IST

టోఫెల్‌ పరీక్షకు 4,53,265 మంది హాజరు
విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 13,104 పాఠశాలల్లో నిర్వహించిన టోఫెల్‌ పరీక్షకు.. మూడు నుంచి అయిదో తరగతి చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులకు శుక్రవారం పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ నుంచి సర్టిఫికేట్‌ అందిస్తామన్నారు.


ఫలితాల విడుదలకు అనుమతివ్వండి
ఈసీని కోరిన ఇంటర్‌ విద్యామండలి

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ఫలితాల విడుదలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోసం ఇంటర్మీడియట్‌ విద్యామండలి లేఖ రాసింది. ఈనెల 12న ఫలితాలు విడుదల చేస్తామని అందులో పేర్కొంది. ఇందుకు ఈసీ నుంచి గురువారం అనుమతి వస్తే.. శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9,99,698మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 75మందిపై మాల్‌ప్రాక్టీస్‌ కింద కేసులు నమోదయ్యాయి.


కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల దరఖాస్తు స్వీకరణకు ఈ నెల 20 వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు(ఎస్పీడీ) శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు 11వ తరగతిలో ప్రవేశాలకు 29,621 దరఖాస్తులు, ఆరో తరగతికి 45,621 దరఖాస్తులు వచ్చినట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారానే స్వీకరిస్తున్నాం. ఆసక్తి గల విద్యార్థులు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 18004258599 నంబరును సంప్రందించాలి’ అని సూచించారు.


గురుకుల ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి: ఎస్‌టీయూ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 190 బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల సిబ్బందికి రెండు నెలలుగా జీతం చెల్లించడం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్‌, రఘునాథరెడ్డి మండిపడ్డారు. దాదాపు 3 వేల మంది సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు ఎదర్కొంటున్నారని బుధవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘శాఖాధిపతులు సమయానికి వేతనాలు తీసుకుంటూ.. కిందిస్థాయి సిబ్బందిని విస్మరించడం సరికాదు. ఇంటి అద్దె భత్యాన్ని కూడా చెల్లించడం లేదు. పెండింగులో ఉన్న పీఆర్సీని కూడా చెల్లించాలి’ అని డిమాండు చేశారు.


ఎన్‌ఈపీకి అనుగుణంగానే ఒక సబ్జెక్టు మేజర్‌ విధానం
కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ వివరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జాతీయ నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ) మార్గదర్శకాలకు అనుగుణంగానే మూడు సబ్జెక్టులు చదివే పద్ధతి నుంచి ఒక సబ్జెక్టు మేజర్‌గా, మరొకటి మైనర్‌గా చదివే విధానాన్ని ప్రవేశపెట్టామని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ‘డిగ్రీ విద్యలో మేజర్‌ సబ్జెక్టు కల్లోలం’ అనే శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఈ విధానం సత్ఫలితాలిస్తున్నందునే ఇక్కడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని