కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇదే కేసులో గత నెల 15న ఆమెను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Updated : 12 Apr 2024 16:01 IST

నేడు రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం
రిమాండ్‌ కోరనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ
ఈనాడు - దిల్లీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇదే కేసులో గత నెల 15న ఆమెను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైలులో ఉండగానే సీబీఐ గురువారం ఉదయం అరెస్ట్‌ చేసింది. కోర్టు అనుమతితో ఈ నెల 6న జైలులోనే ఆమెను సీబీఐ బృందం విచారించింది. ఈ కేసులో సహ నిందితుడైన గోరంట్ల బుచ్చిబాబు ఫోన్‌ నుంచి సేకరించిన వాట్సప్‌ సంభాషణలు, ఓ భూ లావాదేవీకి సంబంధించిన పత్రాలు, ఆప్‌ నేతలకు ఇచ్చినట్లు చెబుతున్న రూ.100 కోట్ల లావాదేవీలపై ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఐపీసీ సెక్షన్‌ 120-బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్‌ 477-ఏ (ఖాతాల తారుమారు), అవినీతి నిరోధక(పీసీ) చట్టం సెక్షన్‌ 7 (ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వడం) కింద అరెస్ట్‌ చేసింది. రంజాన్‌ కారణంగా గురువారం సెలవు కావడంతో.. శుక్రవారం రౌజ్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనుంది. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే.. ఆమెను తిహాడ్‌ జైలు నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది.

అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌

ముందస్తు నోటీసు ఇవ్వకుండా కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆమె తరఫు న్యాయవాదులు గురువారం రౌజ్‌ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత తరఫున న్యాయవాదులు నితేశ్‌ రాణా, మోహిత్‌రావు, సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నీల్‌మణి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు తన ముందు దిల్లీ మద్యం కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదు కాబట్టి.. ఈ పిటిషన్‌లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేనని జడ్జి మనోజ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రెగ్యులర్‌ కోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సూచించారు. ‘‘కవితను జైలులో సీబీఐ అరెస్ట్‌ చేసినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పారు. రిమాండ్‌ కోసం గాని, ఇంకో అవసరం కోసం గాని ఈరోజు నిందితులెవర్నీ కోర్టు ముందు హాజరుపర్చడం లేదని కూడా తెలిపారు. ఈ కేసులో సీబీఐ ఎలాంటి దరఖాస్తు దాఖలు చేయడం లేదన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కే తెలియదు. మరోవైపు, కోర్టు ముందు ఎలాంటి పత్రాలు లేవు. అందువల్ల దరఖాస్తుదారులు కోరినట్లు ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఈ దరఖాస్తు ఉంచొచ్చు. దరఖాస్తును తక్షణం ఆ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశిస్తున్నా’’ అని న్యాయమూర్తి మనోజ్‌కుమార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్‌ చేస్తారా?’

సీబీఐ తీరుపై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. కోర్టు విచారణ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, మా వాదనలు వినకుండా కవితను జైలులో సీబీఐ అరెస్ట్‌ చేసింది. జైలులో అరెస్ట్‌ చేయాలంటే వారెంట్‌ ఉండాలి. కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలాంటివేమీ తీసుకోకుండా ఏకపక్షంగా అరెస్ట్‌ చేసింది. తొలిసారి విచారించే సమయంలోనూ నోటీసు ఇవ్వలేదు. దాన్ని ఇప్పటికే కోర్టులో సవాల్‌ చేశాం. దానిపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అది పెండింగ్‌లో ఉండగానే కవితను అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న ఆమెను అరెస్ట్‌ చేయాల్సిన అవసరమేం వచ్చింది. శుక్రవారం కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు