ఈయన మామూలు ఈఆర్వో కాదు!

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్వో) సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Updated : 12 Apr 2024 13:43 IST

రాప్తాడులో దొంగ ఓట్ల నమోదుకు కుట్ర
బీఎల్వో, ఏఈఆర్వో తిరస్కరించిన ఫాం-6 దరఖాస్తులకు ఆమోదం
అనంతపురం గ్రామీణ మండలంలో వేల సంఖ్యలో బోగస్‌ ఓట్ల నమోదు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్వో) సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్‌కార్డులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైకాపా నాయకులు ఇస్తున్న ఫాం-6 దరఖాస్తులకు కళ్లు మూసుకుని ఆమోదం తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, ఏఈఆర్వో (తహసీల్దార్‌) తిరస్కరించిన ఫాం-6 దరఖాస్తులను సైతం ఈఆర్వో ఆమోదించారు. కొన్ని దరఖాస్తులను బీఎల్వోలకు ఎసైన్‌ చేయకుండానే ఈఆర్వో కార్యాలయంలోనే తతంగం పూర్తిచేస్తున్నారు. ఈఆర్వో వసంతబాబు తన లాగిన్‌ను వైకాపా అనుకూల అధికారులకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లాగిన్‌ వివరాలు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో ఓ ప్రత్యేక కార్యాలయంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటివరకు రాప్తాడు నియోజకవర్గం పరిధి అనంతపురం గ్రామీణ మండలంలో వేల బోగస్‌ ఓట్లు నమోదు చేశారు. వీటిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా.. అలా జరగడానికి వీలు లేదంటూ ఈఆర్వో బుకాయిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఆమోదించిన దరఖాస్తులను వెనక్కి తీసుకుంటామని తాపీగా చెబుతున్నారు.

నిమిషాల వ్యవధిలో ఆమోదం

ఎవరైనా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు  చేస్తే ముందుగా నియోజకవర్గ ఈఆర్వో లాగిన్‌కు వెళ్తుంది. ఈఆర్వో ఆ దరఖాస్తును సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారికి (బీఎల్వో) ఎసైన్‌ చేస్తారు. బీఎల్వో క్షేత్రస్థాయిలో విచారించి వివరాలు నిజమైతే.. తన లాగిన్‌ ద్వారా ఆమోదం తెలిపి ఏఈఆర్వోకు పంపుతారు. అక్కడ మరోసారి పరిశీలించిన తర్వాత తుది ఆమోదం కోసం ఈఆర్వో లాగిన్‌లోకి వెళ్తుంది. క్షేత్ర స్థాయిలో బీఎల్వోలు తిరస్కరించిన దరఖాస్తులను ఈఆర్వో ఆమోదించకూడదు. అయితే రాప్తాడు ఈఆర్వో మాత్రం బీఎల్వోలు, ఏఈఆర్వో తిరస్కరించిన వేల దరఖాస్తులను ఆమోదించినట్లు సమాచారం. కొన్ని దరఖాస్తులకు 2, 3 నిమిషాల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసినట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. అంటే కొన్ని ఫారం-6లను బీఎల్వోలకు ఎసైన్‌ చేయకుండానే చేసినట్లుగా చూపి దొంగ ఓట్లు చేరుస్తున్నారని అర్థమవుతోంది.

ఎమ్మెల్యే కార్యాలయ కనుసన్నల్లో..

రాప్తాడు ఎమ్మెల్యే కార్యాలయం నుంచే దొంగ ఓట్ల నమోదుకు కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌- బెంగళూరు హైవేకు ఆనుకుని ఎమ్మెల్యే అనుచరులు ఓ ప్రైవేటు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని నకిలీ ఆధార్‌ కార్డులు తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్‌ కార్డులను ఎడిట్‌ చేసి 18 ఏళ్లు నిండని వారి పుట్టిన తేదీని, చిరునామాలను మార్చి వీటితో ఫాం-6లు సమర్పిస్తున్నారు.  ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకే ఫోన్‌ నంబరుతో (8522005934) వందల ఫాం-6 దరఖాస్తులు సమర్పించారు. సదరు నంబరు ట్రూ కాలర్‌లో ‘రాప్తాడు ఎమ్మెల్యే కార్యాలయం’ అని చూపిస్తోంది. రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరుతో 87 ఫాం-6 దరఖాస్తులు ఇచ్చారు. వైకాపా నాయకులు చేస్తున్న ఈ అక్రమాలపై మాజీ మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేసినా ఈఆర్వో ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు