ఆస్తి పన్ను పెరుగుదల నాలుగోసారి

కొత్త విధానంలో పెరిగిన ఆస్తి పన్ను వివరాలు పట్టణ స్థానిక సంస్థలకు చేరడంతో పన్ను మొత్తం వసూళ్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలాఖరు వరకు పాత బకాయిలతో సహా వసూలు చేసిన సిబ్బంది ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం పన్ను కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారు.

Updated : 12 Apr 2024 06:18 IST

వసూళ్లకు ఒత్తిడి పెంచుతున్న పుర సిబ్బంది

ఈనాడు, అమరావతి: కొత్త విధానంలో పెరిగిన ఆస్తి పన్ను వివరాలు పట్టణ స్థానిక సంస్థలకు చేరడంతో పన్ను మొత్తం వసూళ్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలాఖరు వరకు పాత బకాయిలతో సహా వసూలు చేసిన సిబ్బంది ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం పన్ను కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారు. గత ఏడాది (2023-24) ఆస్తి పన్నుపై 15 శాతం పెంచి 2024-25 సంవత్సరానికి సిద్ధం చేసిన తాఖీదులను పురపాలకశాఖ వెబ్‌సైట్‌లో పెట్టారు. జగన్‌ ప్రభుత్వంలో ఆస్తి పన్ను పెరగడం ఇది నాలుగోసారి. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా వైకాపా సర్కారు 2021-22 నుంచి అమలు చేసింది. అప్పటి నుంచి పాత అసెస్‌మెంట్లపై ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతున్నారు. ఆస్తి పన్ను వసూళ్లపైనా గతంలో ఉన్న విధానానికి ఈ ప్రభుత్వం స్వస్తి పలికింది. దాంతో ప్రజలే.. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ కార్యాలయాలకు, వార్డు సచివాలయాలకు వెళ్లి ఆస్తి పన్ను ఎంత పెరిగిందో తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

వార్షిక అద్దె విలువ ఆధారంగా అయిదేళ్లకోసారి ఆస్తి పన్ను పెంచే పాత విధానం అమల్లో ఉన్నప్పుడు పుర సిబ్బంది ప్రజల ఇళ్లకు వెళ్లి తాఖీదులిచ్చేవారు. పాత పన్ను ఎంత, కొత్తగా ఎంత పెరిగింది? చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఇలా వారికి సమగ్రంగా వివరించేవారు. కానీ కొత్త విధానంలో పెరిగిన పన్నుతో కలిసి అసెస్‌మెంట్లను పురపాలకశాఖ వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలంటే.. ఎన్ని కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది? అవకాశం ఉన్న వారిలో ఎందరు వెబ్‌సైట్‌ చూసి తమ ఇళ్లపై పెంచిన పన్ను వివరాలు తెలుసుకోగలరు? ఇళ్లకు వెళ్లి తాఖీదులిస్తే.. పెంచిన పన్నుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందనే ఉద్దేశంతోనే అసెస్‌మెంట్లు వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఆస్తి పన్ను మొత్తం ఎంత? గతఏడాది డిమాండ్‌పై ఎంత పెరిగింది? వంటి వివరాలు పురపాలకశాఖ గోప్యంగా ఉంచుతోంది. వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలు ఇప్పటివరకు పెట్టలేదు. సంబంధిత అధికారులూ సమాచారం ఇవ్వడం లేదు. వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టడం ద్వారా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతో ఈ గోప్యత పాటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని