పోలీసులపైనా పైశాచికం

అధికారానికి అరాచకం తోడైతే రాక్షసత్వం జడలు విప్పుకొంటుంది. పాలనలో అహంకారం మితిమీరిపోతే విశృంఖలత్వమే రాజ్యమేలుతుంది. జగన్‌ అయిదేళ్ల పాలనలో అచ్చం జరిగింది ఇదే.. పేద, సామాన్య జనంపై తమ ప్రతాపం చూపిన మంత్రులు, వైకాపా మూకలు.. ఉద్యోగులు, పోలీసులనూ వదల్లేదు.

Updated : 12 Apr 2024 13:46 IST

ఖాకీలపై జగన్‌ అనుచరగణం దాష్టీకాలు
ఉద్యోగులపై వైకాపా మూకల ప్రతాపం
అయిదేళ్లుగా దాడులు, దౌర్జన్యాలతో బెంబేలు
యమభటుల్లా రెచ్చిపోయిన నేతలు, కార్యకర్తలు
అయినా నోరువిప్పని ముఖ్యమంత్రి జగన్‌
మా టలకు పరిమితమైన ‘ఫ్రెండ్లీ ఎంప్లాయీ’ ప్రభుత్వం
ఈనాడు - అమరావతి

అధికారానికి అరాచకం తోడైతే రాక్షసత్వం జడలు విప్పుకొంటుంది. పాలనలో అహంకారం మితిమీరిపోతే విశృంఖలత్వమే రాజ్యమేలుతుంది. జగన్‌ అయిదేళ్ల పాలనలో అచ్చం జరిగింది ఇదే.. పేద, సామాన్య జనంపై తమ ప్రతాపం చూపిన మంత్రులు, వైకాపా మూకలు.. ఉద్యోగులు, పోలీసులనూ వదల్లేదు. వారిని ఓ పూచికపుల్లలుగా జమకట్టి ఎక్కడికక్కడ విరుచుకుపడ్డాయి. తమది ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొన్న జగన్‌.. పోలీసులు, ఉద్యోగులపై తన అనుచరగణంతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఎదురుతిరిగిన వారిపై పగబట్టారు.


పోలీసోడైతే ఏంటీ? ఎవడైతే నాకేంటీ? వాణ్ని లాగిపడేయండ్రా? వాడి తల పగలగొట్టండి.. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా.
కడపలో గతేడాది ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌పై కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా అనుచరుడు కారపురెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు మరికొందరు దాడి చేస్తూ దుర్భాషలాడిన తీరు.


ఎస్పీకి కాదు.. వాళ్ల అమ్మ మొగుడికి చెప్పినా నేను ఇలాంటి కేసులు పెడితే ఊరుకోను.

ఎస్సై అలీబేగ్‌పై జనవరి 11న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం. తర్వాత ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా.. ‘అమ్మ మొగుడు’ అన్న పదం కడప ప్రాంతంలో బూతు కాదంటూ సమర్థించుకున్నారు.


ఏయ్‌ బాబూ ఏయ్‌! తమాషా చేస్తున్నావా? చొక్కాపట్టుకుని లాగేస్తా.. ఎలా కనిపిస్తున్నా..?

విశాఖపట్నంలో 2022 ఫిబ్రవరిలో పోలీసులపై పశు సంవర్ధక శాఖ మంత్రి చిందులు.


‘మేం చెప్పింది చేయాలి.. మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి.. మేం తిట్టినా పడుండాలి.. కాదంటే దాడులకు దిగుతాం. దౌర్జన్యాలు చేస్తాం’’ రాష్ట్రంలోని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఈ అయిదేళ్లలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు ఇది. తమ ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తామని గత ఎన్నికల ముందు పేర్కొన్న జగన్‌ అధికారంలోకి రాగానే రివర్స్‌ పాలన సాగించారు. తమది ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వమని పదేపదే వల్లెవేసిన జగన్‌ తన అయిదేళ్ల పాలనలో వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపారు. ప్రధానంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే భద్రత కరవైంది. మొదటి నుంచి వైకాపా నాయకులను వెనకేసుకొచ్చిన పోలీసులే వారి బాధితులుగా మారడం దురదృష్టకరం. వారిపై వైకాపా పరివారం చేసిన దాష్టీకాలకు సంబంధించి కొన్ని ఘటనలే వెలుగులోకి రాగా.. వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి. ఉద్యోగులు, పోలీసులపై వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసినా.. వాటిని ఏనాడూ ఖండించిన పాపానపోలేదు సీఎం జగన్‌.

ఆది నుంచీ  అదే బుద్ధి..

2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన జగన్‌ అదే సంవత్సరం నవంబరు నుంచి ఉద్యోగులపై తన ప్రతాపం చూపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి మార్కెట్‌ కమిటీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నంతో ప్రారంభమైన వేధింపుల పర్వం.. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేంతవరకు కొనసాగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులతోపాటు జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు సైతం ఉద్యోగులు, పోలీసులపై దాడులకు పాల్పడటం విడ్డూరం. ఓ రకంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని ఉద్యోగులు, పోలీసుల పట్ల వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు యమభటుల్లా రెచ్చిపోయారు. బూతుపురాణం విప్పడం, తలలు పగలగొట్టడం, కాలర్లు పట్టి బెదిరించడమే కాదు.. ప్రాణాలు తీసిన ఘటనలూ ఉన్నాయి. మాట వినని అధికారులను అప్రాధాన్య పోస్టులోకి మార్చడం, చెప్పినట్లు తల ఆడించేవారిని ప్రాధాన్య పోస్టుల్లో కూర్చోబెట్టడం, ఎదురుతిరిగిన అధికారులు, ఉద్యోగులపై దాడులు చేసి, వారిపైనే కేసులు పెట్టించడం.. జగన్‌ జమానాలో సాగిన అరాచకం.

పోలీసులకే రక్షణ లేదు..

ఎక్కడైనా పోలీసులను చూసి నేరగాళ్లు భయపడతారు. కానీ, ఆంధ్రావనిలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. జగన్‌ జమానాలో వైకాపా నాయకుల అరాచకాలను చూసి పోలీసులే భయపడిపోయారు. పోలీసులపైనే ఎదురుకేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేయడం జగన్‌ జమానాలో పరిపాటిగా మారిపోయింది.

  • కడపలోని ఓ వీధిలో అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని ప్రశ్నించినందుకు ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా అనుచరులు 20 మందికిపైగా ఒక్కటై ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌పై దాడి చేశారు. వీపుపై వాతలు తేలేలా, కాలివేలు విరిగేలా తీవ్రంగా కొట్టారు. దాడికి పాల్పడినవారిలో వారిలో మంత్రి ప్రధాన అనుచరుడు, మయూరా గార్డెన్‌ రెస్టారెంట్‌ యజమాని కారపురెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. తన భర్తను కర్రలతో తీవ్రంగా కొట్టారని. తాను అక్కడి వెళ్లి నిలువరించకపోతే ఆయన్ని చంపేసేవారని సీఐ భార్య కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఈ ఘటనలో చివరికి సీఐపైనే ఎదురు కేసు పెడతామని అంజద్‌బాషా అనుచరులు బెదిరించారు.
  • అనంతపురం నగరంలోని నవోదయ కాలనీకి చెందిన గుజ్జల సురేశ్‌ అక్రమంగా మద్యం విక్రయిస్తుండడంతో సెబ్‌ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులు, నగరంలోని కార్పొరేటర్లు(వైకాపా) సాకే చంద్రశేఖర్‌, కమల్‌ భూషణ్‌ సుమారు పాతిక మందితో కలిసి 2023 ఆగస్టు 9న గుల్జార్‌పేటలోని సెబ్‌ పోలీస్‌స్టేషన్‌పై దండెత్తారు. తామంతా ఎమ్మెల్యే మనుషులం, కార్పొరేటర్లం అంటూ హల్‌చల్‌ చేశారు. ఎస్సై మునిస్వామిపై చేయిచేసుకున్నారు. కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ ఏకంగా ఎస్సై కుర్చీలో కూర్చున్నారు. మద్యం విక్రేత సురేష్‌ తండ్రి ఓ మహిళా కానిస్టేబుల్‌ దుస్తులు లాగాడు.
  • తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు, వైకాపా నాయకుడు కళత్తూరు సునీల్‌రెడ్డిపై రౌడీషీట్‌ ఉంది. అతడిని కౌన్సెలింగ్‌కు పిలిపించడంతో పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. దళిత ఎస్సై రవిబాబుపై దాడి చేశాడు.
  • కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం జువ్వపాలెం చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లిన కానిస్టేబుల్‌ బాలకృష్ణపై వైకాపా నాయకులు కర్రలతో దాడి చేశారు. 2022 జూన్‌ 9న జరిగిన ఈ దాడిలో బాలకృష్ణ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది.
  • కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. తనిఖీ చేసి సరఫరాదారులను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్సై వేణుగోపాల్‌పై వైకాపా కార్యకర్తలు 2022 అక్టోబరు 29న కత్తితో దాడి చేశారు.
  • గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల గ్రామంలోని నీటిపారుదల శాఖ చెరువులో మట్టిని తరలిస్తున్న వైకాపా కార్యకర్తలను అడ్డుకున్న ఎస్సై కొటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించారు.

కాలర్‌ పట్టుకొని.. అందరి ముందు..

  • కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద అధికారులంతా చూస్తుండగానే ఉప్పాడ-3 సచివాలయం మత్స్య శాఖ సహాయకుడు చాగంటి పరశురామ్‌ను వైకాపా రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు గత జనవరి 29న కాలర్‌ పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ‘‘సెల్‌లో వేయ్‌ ఈ కొడుకుని.. కొట్టండి..’’ అని సూచించడంతో అతని అనుచరులు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. చివరికి అధికారి పరుగెత్తుకుంటూ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి రక్షణ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. రావు చిన్నారావు కుటుంబీకుల పేరిట శ్రీరాంపురం పరిధిలో 14 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటికి విద్యుత్తు రాయితీ రాదు. రాయితీ రాకుండా పరశురామ్‌ అడ్డుపడుతున్నారనే అనుమానంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు.
  • ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి గతేడాది సెప్టెంబరులో దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
  • అన్నమయ్య జిల్లా పీలేరు తహసీల్దారు కార్యాలయంలో పని చేసే సర్వేయరు రెడ్డెప్పపై, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సచివాలయ ఉద్యోగిపై,  శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం సచివాలయ ఉద్యోగిపై, కర్నూలు జిల్లా ఆదోని, అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు సచివాలయం సంక్షేమ సహాయకులు లక్ష్మీనారాయణ, సతీష్‌పై, అనంతపురంలో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శి రమేష్‌పై వైకాపా నాయకులు, అనుచరులు దాడులకు పాల్పడ్డారు. కొందరు ఉద్యోగులపై  చెయ్యికూడా చేసుకున్నారు.  మరికొన్ని మండలాల్లోనూ అధికారులు, ఉద్యోగులపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని