‘పూట గడవడమే కష్టంగా ఉంది.. జీతాలు ఎప్పుడొస్తాయమ్మా?’

‘ఏమమ్మా.. మనకు జీతాలు ఎప్పుడొస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు.

Published : 12 Apr 2024 06:11 IST

సంఘ నాయకురాలితో అంగన్‌వాడీ కార్యకర్త ఆవేదన
వైరల్‌ అయిన ఆడియో కాల్‌

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ‘ఏమమ్మా.. మనకు జీతాలు ఎప్పుడొస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు. మార్చి నెలదీ రాలేదు. నా జీతమే మా కుటుంబానికి ఆధారం. చాలా కష్టాలు పడుతున్నాం’. ఇదీ ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్‌ కాల్‌లో విలపించిన తీరు. అనంతపురం జిల్లా శింగనమల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి బుక్కరాయసముద్రానికి చెందిన కార్యకర్త.. అంగన్‌వాడీల సంఘం నాయకురాలితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ అంగన్‌వాడీల వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతోంది. ఆ ఫోన్‌కాల్‌లో ఆమె తన బాధను చెప్పుకొన్న తీరు వినేవారికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. వైకాపా ప్రభుత్వ నిరంకుశ చర్యలకు అద్దం పడుతోంది. అంగన్‌వాడీ సిబ్బంది ఇటీవల 42 రోజుల పాటు సమ్మె చేసినా కనికరించని ప్రభుత్వం.. ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక హామీలిచ్చి, చివరకు మాటతప్పింది. నెలవారీ వేతనమూ ఇవ్వకుండా సతాయిస్తోంది.

ఈ ఫోన్‌ కాల్‌లో ఆ కార్యకర్త అవే విషయాలు చెబుతూ ‘జీతాలు ఎప్పుడొస్తాయో పైవారిని అడిగి కనుక్కోండమ్మా. ఇంటి బాడుగ, కరెంటు బిల్లు కట్టలేదు. సమ్మె జీతాలు ఇస్తున్నట్లు మార్చి 12న జీవో వచ్చింది. ఇదిగో అదిగో అంటూ నాన్చుతున్నారు. ఇప్పటికే నెల దాటింది. జీతమే కాదమ్మా, టీఏ, డీఏలు, ఈవెంట్లు, కూరగాయల డబ్బులు, గ్యాస్‌ బిల్లు.. ఏదీ పడలేదు. అన్నీ మా చేతి నుంచే పెట్టుకున్నాం. ఇంట్లోనే మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇక కేంద్రానికి ఖర్చు పెట్టాలంటే ఎట్లాగమ్మా? మీకు మొక్కుతానమ్మా. మన బాధను పైకి చెప్పండమ్మా’ అంటూ గద్గదస్వరంతో వాపోయారు. ఈ ఆవేదన ఆమె ఒక్కరిదే కాదని, రాష్ట్రంలోని వేల మందిదీ అదే పరిస్థితని అంగన్‌వాడీ సిబ్బంది చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని