మంగళగిరి ఐటీపై జగన్‌ వేటు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామం. హైటెక్‌ సిటీ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతం సింగపూర్‌ను తలపించేలా తయారైంది.

Updated : 12 Apr 2024 06:49 IST

వైకాపా ప్రభుత్వ నిర్ణయాలతో తరలిపోయిన కంపెనీలు
ఉద్యోగాలు కోల్పోయిన యువత
ఉపాధి కోసం వేల మంది వలస
నిరుపయోగంగా బహుళ అంతస్తుల భవనాలు

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామం. హైటెక్‌ సిటీ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతం సింగపూర్‌ను తలపించేలా తయారైంది. ఐటీ కంపెనీల ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు తెదేపా ప్రభుత్వం కృషి చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మంగళగిరి కూడా మరో మాదాపూర్‌లా మారేది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ అవకాశాన్ని కాలదన్నారు. అయిదేళ్లలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న వాటినీ వెళ్లగొట్టారు. వేల మంది ఉద్యోగులను వలస వెళ్లేలా చేశారు.

జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు ఐటీ కంపెనీలకు శాపంగా మారాయి. రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపేసి, ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీలు వెళ్లిపోయాయి. దీంతో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ప్రాంతంపై కక్ష గట్టి విధ్వంసం చేసిన జగన్‌ ఏముఖం పెట్టుకుని ఓటు వేయాలని అడగడానికి వస్తున్నారని గుంటూరు జిల్లా వాసులు నిలదీస్తున్నారు.

గత ప్రభుత్వ ప్రోత్సాహంతో..

రాష్ట్ర విభజన తర్వాత ఐటీ రంగం అభివృద్ధిని సవాల్‌గా తీసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతితో పాటు పరిసర ప్రాంతాలైన మంగళగిరి, తాడేపల్లిలో ఐటీకి పునాదులు వేశారు. ఏపీఎన్‌ఆర్‌టీ వంటి సంస్థల సహకారంతో కంపెనీల ఏర్పాటుకు కృషి చేశారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించారు. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలతో పదేపదే సంప్రదింపులు జరిపారు. రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతోపాటు డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్స్‌ పాలసీ, ఇంటిగ్రేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ, సైబర్‌ సెక్యూరిటీ పాలసీ, గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్‌ పాలసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్లౌడ్‌ హబ్‌ పాలసీ అమలు చేశారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ఐటీ పరిశ్రమలకు బాటలు వేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక వీటన్నింటికీ మంగళం పాడడంతో ఐటీ రంగం కుదేలైంది.

అనుకూల వాతావరణంతోనే..

కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఐటీ రంగానికి అనువైన పరిస్థితులు ఉండడంతో పెద్దఎత్తున బహుళ అంతస్తుల భవనాలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి ఏర్పాటుతో మంగళగిరి పరిసరాల్లో ఐటీ పరిశ్రమకు ఊతం ఏర్పడింది. గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి పరిసరాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం, రాజధాని ప్రాంతానికి సమీపంలోనే ఉండడం, ఇటు విజయవాడ, అటు గుంటూరు నగరాల మధ్య ఉండడంతో పలు కంపెనీలు ఇక్కడ శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని ఆటోనగర్‌లో ఐటీ టెక్‌ పార్కు భవనం అందుబాటులోకి రావడంతో అక్కడ 8 కంపెనీలు కొలువుదీరి వందల మందికి ఉద్యోగాలు కల్పించాయి. పరిసరాల్లో మరో 26 కంపెనీలు రావడంతో ఈ ప్రాంతం ఐటీ జోన్‌గా అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని ప్రోత్సహించకపోవడం, వేధింపుల వల్ల కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నవి ఒక్కొక్కటిగా తరలిపోయాయి. ప్రస్తుతం వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కంపెనీలు వెళ్లిపోవడం వల్ల వేల మంది యువత ఉపాధి కోల్పోయి వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.


నిరర్థకంగా బహుళ అంతస్తుల భవనాలు

ఐటీ కంపెనీలు పెద్దఎత్తున మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటవుతాయని అంచనా వేసిన స్థిరాస్తి వ్యాపారులు జాతీయ రహదారికి రెండు వైపులా ఐటీ కార్యాలయాలతో పాటు ఉద్యోగుల నివాస అవసరాలను దృష్టిలో ఉంచుకుని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. స్థిరాస్తి వ్యాపారంలో పేరుపొందిన పలు సంస్థలు ఇక్కడ భూములు కొనుగోలు చేసి టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని చేపట్టాయి. ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లా అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు.అయితే వైకాపా వచ్చిన తర్వాత ఐటీతో పాటు ఇతర రంగాలు కుదేలు కావడంతో భవన నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. అప్పటికే నిర్మాణాలు పూర్తయి ప్రారంభించిన భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. నివాసాల కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలకు డిమాండ్‌ లేక నిరుపయోగంగా ఉన్నాయి. అన్ని వసతులతో నిర్మాణాలు పూర్తయిన భారీ భవంతుల్లోకి సైతం ఎవరూ రాకపోవడంతో అవన్నీ నిరర్థకంగా మారాయి. స్థిరాస్తి వ్యాపారం ఒక్కసారిగా పతనం కావడంతో పెట్టుబడులు పెట్టినవారు తీవ్రంగా నష్టపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని