పుత్రోత్పాతం

రైతుల మెడపై కత్తి పెట్టి భూములు కౌలుకిచ్చినట్లు రాయించుకునేదొకరు... కబ్జాలు, సెటిల్‌మెంట్లతో బెదిరిస్తూ, కాదంటే కాళ్లు విరిచేస్తానంటూ భయపెట్టేదొకరు... మాట వినలేదని పోలీసులపైనే చిందులేసేది ఇంకొకరు... కమీషన్‌ ఇవ్వకుంటే కాంట్రాక్టర్లను కొట్టేది మరొకరు... ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి లేఅవుట్‌ వేసేదొకరు.... ఇవన్నీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొందరు వైకాపా ప్రజాప్రతినిధుల పుత్రరత్నాల అరాచకాలు.

Updated : 12 Apr 2024 05:56 IST

వైకాపా ప్రజాప్రతినిధుల కుమారుల బరితెగింపు
పోలీసుల సహకారంతో కబ్జాలు, సెటిల్‌మెంట్లు
అధికారం అండగా అరాచకాల్లో ఆరితేరిన వైనం
గెలిపించిన ప్రజల నెత్తినే సవారీ
ఎన్నికల వేళ ఊసరవెల్లుల్లా జనాన్ని నమ్మించే యత్నం
ఈనాడు, అమరావతి


ఏ తండ్రికైనా... కుమారుడు వృద్ధిలోకి వస్తే...
పదుగురికి మేలు చేస్తే... మంచి బాటలో పయనిస్తే

పుత్రోత్సాహం....

కొందరు వైకాపా నేతలకు మాత్రం... తమ పుత్రుడు ప్రజల్ని వేధిస్తే...
వారి భూముల్ని కబ్జా చేస్తే...
అభాగ్యులపై కేసులు బనాయిస్తే...
అమాయకులపై దాడులు చేయిస్తే...
దోపిడీలు, దౌర్జన్యాల్లో దిట్టలుగా ఎదిగితే...
ఎంత తిన్నా కరగనంతగా ఆస్తులను పెంచితే... తమను మించి, అపఖ్యాతిని మూటగట్టుకుంటే...

ఎనలేని పుత్రోత్సాహం!


రైతుల మెడపై కత్తి పెట్టి భూములు కౌలుకిచ్చినట్లు రాయించుకునేదొకరు... కబ్జాలు, సెటిల్‌మెంట్లతో బెదిరిస్తూ, కాదంటే కాళ్లు విరిచేస్తానంటూ భయపెట్టేదొకరు... మాట వినలేదని పోలీసులపైనే చిందులేసేది ఇంకొకరు... కమీషన్‌ ఇవ్వకుంటే కాంట్రాక్టర్లను కొట్టేది మరొకరు... ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి లేఅవుట్‌ వేసేదొకరు.... ఇవన్నీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొందరు వైకాపా ప్రజాప్రతినిధుల పుత్రరత్నాల అరాచకాలు. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని... ప్రజల నెత్తికెక్కి సవారీ చేశారు. ప్రతి పనికీ రేటు పెట్టి దోచుకున్నారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి  వరకు... పోస్టింగులు, బదిలీలు, భూమార్పిడి తదితరాలేమైనా వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. కాదంటే వివాదాలు సృష్టించి, పోలీసుల సాయంతో కేసులు పెట్టించి... కటకటాల్లోకి పంపించారు. నిన్న మొన్నటి వరకు జనాల్ని పురుగుల్లా చూసిన వీరే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఊసరవెల్లుల్లా రూపం మార్చుకున్నారు. ఓట్లేసి తమ నాన్ననే గెలిపించాలంటూ మళ్లీ అదే జనం చెంతకు చేతులు కట్టుకుని వస్తున్నారు.


మంత్రి కొడుకులా మజాకా!

‘‘మొన్న ఒక కాలు విరిగింది కదా... ఈసారి రెండు కాళ్లూ విరిచేస్తా. పిచ్చి డ్రామాలాడకు...’ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎంపీటీసీ సభ్యుడికి మంత్రి కుమారుడు చేసిన హెచ్చరికలివి. ఆయన ఇద్దరు కొడుకులూ కబ్జాలు, దోపిడీలు, వేధింపుల్లో పీహెచ్‌డీలు చేశారు. ఒకరు రౌడీషీటర్లను వెనకేసుకుని తిరుగుతుంటారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ అల్లర్ల కేసులో ఎవరిపై కేసులు పెట్టాలో వీరే నిర్దేశించారంటే...  అధికారాన్ని ఎంతగా ఉపయోగించారో అర్థమవుతోంది. కక్షకట్టి తమను అల్లర్ల కేసులో ఇరికించారని, తమ ఇంటిపై దాడి చేయించారని వైకాపా నాయకుడే వాపోయే దుస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. ఎక్కడైనా భూవివాదం ఉందంటే రౌడీషీటర్లను అక్కడకు పంపిస్తారు. పరిష్కరిస్తామని పంచాయితీ పెట్టి ఎకరానికి రూ.5లక్షలపైగా వసూలు చేస్తారు. తమ తీర్పును పట్టించుకోని వారిపైకి అధికారులను ఉసిగొల్పుతారు. మరో కుమారుడైతే తానే ఎమ్మెల్యే అన్నట్లు పెత్తనం చెలాయిస్తారు. సమస్యలు పరిష్కరిస్తానంటూ ప్రజలకు హామీలిస్తుంటారు. గతంలో నడిరోడ్డుపై పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఘనుడు. సైలెన్సర్లు తీసేసి అతివేగంతో వెళ్తున్న నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోగా... ఈ పుత్రరత్నం డీఎస్పీపైనే తిరగబడ్డారు. తర్వాత తండ్రి కూడా కుమారుడ్నే వెనకేసుకొచ్చి... పట్టుకున్న బైక్‌లతోపాటు మరికొన్నింటిని ఎత్తుకెళ్లారు. ఇక భూముల కబ్జాలు, సెటిల్‌మెంట్లకు లెక్కే లేదు.


కైకలూరులో మూల‘స్తంభం’ కొడుకుదే రాజ్యం!

కైకలూరులో 64 మంది రైతులు తమ వందెకరాల పొలాల్ని చేపల చెరువులుగా మార్చేసి లీజుకిస్తున్నారు. దానిపై మూల‘స్తంభం’ కుమారుడి కన్నుపడింది. కౌలుదారుడ్ని బెదిరించి తరిమేశారు. చేపల్ని పట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.  అంతేకాదు... ఇకపై చెరువుల్లో తామే పంట వేస్తామని, ఇచ్చినంత తీసుకోండని హుకుం జారీ చేశారు. బాధిత రైతులు పోలీసుల్ని  ఆశ్రయిస్తే... వారు ఫిర్యాదు తీసుకోలేదు సరికదా? ఎంతోకొంతకు సెటిల్‌ చేసుకోండని ఒత్తిడి తెచ్చారు. బక్కజీవులైన రైతులంతా చివరికి తమ భూముల్ని లీజుకిస్తున్నట్లు స్టాంపు పత్రాలపై సంతకాలు పెట్టాల్సి వచ్చింది. తమపై ఎవరి ఒత్తిడి లేదంటూ వారితోనే చెప్పించి, వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో పెట్టించారు. ఇలా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని, తమకు ఎదురుతిరిగిన వారిని వేధించడం, అక్రమ కేసులు పెట్టించడమే ఈ నేత కుమారుడి నైజం. పేదల ఇళ్లస్థలాల సేకరణ ప్రక్రియలో ఎకరాకు  రూ.7-15 లక్షల వరకు కమీషన్లు తీసుకుని... రూ.25 కోట్ల వరకు కొట్టేశారు.

కైకలూరు-ఏలూరు రోడ్డులో 100 ఎకరాల లేఅవుట్లలోని మూడు వేల పట్టాల్లో.. అధికశాతం తమ వారికే కట్టబెట్టారు. చెరువు శిఖం, ప్రభుత్వ భూములను బినామీల పేరిట రాయించారు. మండలానికి ఒకర్ని పెట్టి... నాలుగు మండలాల్లో మట్టి మాఫియాను నడిపిస్తున్నారు. మాట వినని వారిని బెదిరించేందుకు రౌడీగ్యాంగ్‌ను నడిపిస్తున్నారు. వీరి ద్వారా సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై దాడులు చేయిస్తున్నారు. ఓ ఎస్సై అండతో పోలీస్‌స్టేషన్‌నే దందాలకు నిలయంగా మార్చేశారు. చెప్పింది చేయకుంటే పార్టీ నేతలపైనా కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేస్తారు. వివిధ శాఖల అధికారులతోపాటు సీఐ, ఎస్సై స్థాయి వారు కూడా తమ వద్దకు వచ్చే వారిని ముందుగా.. ముఖ్యనేత కుమారుడి దగ్గరకే పంపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని నాలుగు  మండలాల్లో తెదేపా తరపున ఎవరూ నిలబడకూడదని హుకుం జారీ చేశారు. పోటీలో ఉన్న వారిని ప్రలోభపెట్టారు. బెదిరించి దారికి తెచ్చుకున్నారు. కాదంటే అక్రమ కేసులు పెట్టారు.


ఉరవకొండలో అనకొండ

ఉరవకొండ నియోజకవర్గంలో వైకాపా నేత కుమారుడు... రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యారు. తండ్రికి ఎలాంటి పదవీ లేదు. అయినా అధికారాన్ని చెలాయిస్తున్నారు. పోలీసులు, వాలంటీర్లతో సమావేశాలు పెట్టి పనులను పురమాయిస్తుంటారు. కూడేరు, ఉరవకొండ మండలాల్లో వందల అనధికార లేఅవుట్లు ఈయన పుణ్యమే. ఎకరాకు రూ.2-5 లక్షల వరకు కప్పం కట్టించుకుంటారు. నిత్యం భూముల సెటిల్‌మెంట్లలో మునిగితేలే ఆయన... అన్నింటా కమీషన్లు దండుకుంటారు. బినామీలను ముందుపెట్టి స్థిరాస్తి వ్యాపారం సాగిస్తున్నారు. ఎసైన్డ్‌ భూముల్లో లేఅవుట్లు వేసి అమ్ముతున్నా అడిగే నాథుడే లేరు. కూడేరులో ఓ మహిళకు చెందిన 12 ఎకరాల భూమిని నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి కాజేశారు. ఉరవకొండలోని వీరభద్రస్వామి ఆలయ మాన్యం భూమిలోని నాలుగు ఎకరాలను అమ్ముకున్నారు. పేకాట శిబిరం నిర్వహించేది, పెన్నా నది నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా చేసేదీ వీరే. అంగన్‌వాడీ పోస్టులకు రేటు కట్టి రూ.5 లక్షల చొప్పున అమ్మేశారు. గుట్టలను కొల్లగొట్టి ఎర్రమట్టిని ప్రైవేటు లేఅవుట్లకు విక్రయించడం ద్వారా రూ.లక్షల్లో దోచుకుంటున్నారు.


రైల్వే గుత్తేదారుల్ని బెదిరించి.. యంత్రాల్ని అపహరించి...

కర్నూలు జిల్లాలో ఒక మహిళా ప్రజాప్రతినిధి కుమారుడైతే... ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల్లో పట్టా పుచ్చుకున్నారు. రైల్వే గుత్తేదారులనూ వదలకుండా వసూళ్లకు దిగారు. అడిగినంత ఇవ్వకపోవడంతో అక్కడ పనిచేసే కూలీలు, గుత్తేదారులపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. యంత్రాలను తీసుకెళ్లిపోయారు. పోలీసు కేసు నమోదు కావడంతో తిరిగిచ్చేశారు. నీటిపారుదల శాఖ పరిధిలో పనులు చేసేందుకు పిలిచిన టెండర్లను రద్దు చేయించి తమ అనుచరులకు ఇప్పించి కమీషన్లు దండుకున్నారు.


స్థిరాస్తి వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలంటే.. ఒక ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడి కుమారులకు ఎకరానికి రూ.6లక్షల చొప్పున కప్పం కట్టాల్సిందే. ఖాళీ స్థలాల్లో దుకాణాలు పెట్టాలంటే నెలకు రూ.3వేలు సమర్పించుకోవాల్సిందే. సోమేశ్వరకూడలి, అయ్యప్పస్వామి గుడి సమీపంలో 64 సెంట్ల విషయంలో పంచాయితీలు చేసి... భారీగా దండుకున్నారు. గుండేకల్లు సమీపంలో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు కోసం సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇప్పించేందుకు ఎకరానికి పదిసెంట్ల చొప్పున కమీషన్‌ దండుకున్నారు.


శ్రీకాకుళం జిల్లాలోనూ అదే తోవ

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ప్రజాప్రతినిధుల కుమారులూ దోపిడీ దారిని ఎంచుకున్నారు. స్టోన్‌క్రషర్లు, ఇసుక ర్యాంపులన్నీ వీరి కనుసన్నల్లోనే నడుస్తాయి. అన్న  కుమారుడు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించి లేఅవుట్‌ వేస్తున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్ల కోసం ప్రభుత్వ భూమిని కొందరు రైతుల పేర్లతో రాయించి... వాటిని ప్రభుత్వానికి విక్రయించిన ఘనత ఆయనది. అందుకు రైతుల నుంచి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారు. తమ్ముడి కుమారులేమో... ఉద్యోగుల బదిలీలు, భూకబ్జాల్లో పండిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని