వలస పక్షులు తగ్గి.. వైకాపా భక్షకులు పెరిగి..!

సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయలేదు.. అంతర్జాతీయ ప్రాముఖ్యమన్నా పట్టింపులేదు.. అటవీశాఖ అధికారులున్నా అసలు భయమన్నదే లేదు..ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులో.. వేల ఎకరాలను దర్జాగా కబ్జా చేశారు.

Updated : 12 Apr 2024 05:54 IST

ఐదేళ్లలో కొల్లేరు కొంప ముంచారు
ముగ్గురు అధికారపార్టీ ఎమ్మెల్యేల కబ్జాకాండ
జగన్‌ వచ్చాక సరస్సులో వేల ఎకరాల ఆక్రమణ
చేష్టలుడిగిన అటవీ, వన్యప్రాణి విభాగాలు
ఎన్నికల వేళ మరింత జోరుగా తవ్వకాలు
ఈనాడు, అమరావతి

సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయలేదు..
అంతర్జాతీయ ప్రాముఖ్యమన్నా పట్టింపులేదు..
అటవీశాఖ అధికారులున్నా అసలు భయమన్నదే లేదు..
ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులో.. వేల ఎకరాలను దర్జాగా కబ్జా చేశారు..
రొయ్యల చెరువులతో కాలుష్య కాసారంగా మార్చేశారు..
ఆ కబ్జాకోరులూ, అక్రమార్కులూ మరెవరో కాదు..
అధికార పార్టీకి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు..
ఎన్నికల వేళ ఆక్రమణల్ని మరింత పెంచారు.
ఇంత జరుగుతున్నా.. ఏమీ ఎరగనట్టే మిన్నకుంది జగన్‌ ప్రభుత్వం!

రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొల్లేరు సరస్సును తమ సొంత సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. సొంత పట్టా భూముల్లో చెరువులు తవ్వుకున్నట్లు ఈ అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న సరస్సులోను యధేచ్ఛగా వందల ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. ‘ఆలసించిన ఆశాభంగం’ అన్నట్లు, ఎన్నికల కోడ్‌ రాకముందే ప్రత్యేక ప్రణాళికతో పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించారు. జగన్‌ ప్రభుత్వంలో ఇన్నాళ్ల ఆక్రమణలు ఒక ఎత్తు, ఎన్నికల ముందు సాగించిన అరాచకాలు, ఆక్రమణలు మరో ఎత్తు. వైకాపా పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. చెరువులను ఆక్రమించేశారు. వాగులూ, వంకల్ని తమ ఆస్తుల్లో కలిపేసుకున్నారు. నదీ తీరాల్ని నంజుకు తినేశారు. వారి కబ్జాల పర్వంలో కొల్లేరు సరస్సునీ చేర్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే కొల్లేరులో వేల ఎకరాలకు పైగా చెరువులు తవ్వేసి ప్రజాప్రతినిధులు పంచేసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, వారి అనుచరులది ఈ కబ్జాకాండలో క్రియాశీల పాత్ర. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికీ ఇందులో ప్రమేయం ఉంది. అక్కణ్నుంచే మౌఖికంగా అధికారులతో  మాట్లాడించుకుని వారిని క్రియాశూన్యంగా మలిచేసి.. కొల్లేరులో వీరు ఆడింది ఆట- పాడింది పాటగా మార్చేశారు.

అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్నా...

కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 76,243 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1975లోనే ‘ప్లస్‌ 5’ కాంటూరు పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. 1995లోనే కొల్లేరు అభయారణ్యంపై నోటిఫికేషన్‌ వెలువడింది. 2005-2006 మధ్య చేపట్టిన ‘కొల్లేరు ఆపరేషన్‌’ తర్వాత సర్వే చేస్తే ప్లస్‌ 5 కాంటూరు పరిధిలో 83,982 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు తేల్చారు. అదంతా కొల్లేరు అభయారణ్యమే. ఆ తర్వాత కాలక్రమేణా కొల్లేరులో ఆక్వాకల్చర్‌ విస్తరించడం, పెద్ద ఎత్తున కబ్జాలు చోటు చేసుకోవడంతో పర్యావరణవేత్తలు పోరాటం సాగించారు. ఆక్రమణల అంశం సుప్రీంకోర్టుకు చేరగా.. 2006 మార్చి నెలలో సాధికార కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కొల్లేరు కబ్జాలు తొలగించాలని ఆదేశించింది. 2006 జూన్‌ నాటికి కొల్లేరులో వేల ఎకరాల్లో ఉన్న చేపల చెరువులను, ఆక్రమణలను తొలగించి సరస్సును పునరుద్ధరించి దీని రక్షణ బాధ్యతలు అటవీశాఖకు అప్పగించింది రెవెన్యూశాఖ.

కొల్లేరు సాదాసీదా జలవనరు కాదు. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న చిత్తడి నేలల సరస్సు. 1975లో ఇరాన్‌లోని ‘రామ్‌సార్‌’ వేదికగా నిర్వహించిన చిత్తడి నేలల సంరక్షణ ఒప్పందంలో కొల్లేరునూ చేర్చారు. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక దృష్టి సారించి కొల్లేరు ఆపరేషన్‌కు 2005లో ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రాంతంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు, డి.ఫాం. భూముల్లోను చేపల చెరువులు తవ్వకూడదు. కొల్లేరు సరస్సును పునరుద్ధరించి 2006 నాటికి కేవలం 3.03 ఎకరాల్లోనే చెరువుల ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వం తేల్చింది. ఆ భూమిని అటవీ సంరక్షణశాఖకు రెవెన్యూ అధికారులు అప్పగించేశారు. అక్కడ ఎలాంటి అక్రమ చెరువుల తవ్వకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి అప్పగించారు. అలాంటిది ప్రస్తుతం జగన్‌ సర్కారు పదవీకాలం పూర్తయ్యేసరికి కొల్లేరు ఏకంగా 20 వేల ఎకరాల మేర కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ భూమిలోనే దాదాపు 16 వేల ఎకరాల్లో సరస్సును ఆక్రమించేసి చెరువులతో యథేచ్ఛగా  చేపల సాగుచేస్తూ ఏటా రూ.వేల కోట్లు సంపాదించుకుంటున్నారు.


ఏమిటీ ఎమ్మెల్యేల పాత్ర?

కొల్లేరు సరస్సును ఆనుకుని చుట్టుపక్కల అయిదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కొల్లేరుపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలోను, ఒక ఎమ్మెల్యే పాక్షికంగా ఈ సరస్సు ఆక్రమణల్లో పాత్ర పోషిస్తున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే అనుచరులు కొల్లేరు ఆక్రమణల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా హయాంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు సొంతంగా చెరువులు తవ్వుకున్నారు. కొల్లేరులో కొత్త రహదారులు నిర్మించకూడదు, ఉన్న రహదారులు విస్తరించకూడదు, పొక్లయిన్లు తిప్పకూడదు, ఆక్వా సాగు చేయకూడదు.. ఈ నియమాలన్నింటినీ యథేచ్ఛగా ఉల్లంఘించారీ ఘనులు. కొల్లేరు సహజ ప్రవాహాలకు పెద్ద ఎత్తున ఇవి ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాల సమయంలో కొల్లేరును ముంపులో ముంచెత్తుతున్నాయి.

కొత్తగా చెరువులు తవ్వుకుని స్వయంగా ఆక్రమించుకోవడం ఒక ఎత్తయితే... ప్రైవేటు వ్యక్తులు తవ్వుకునేందుకు వీలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో వసూలుచేసుకోవడం మరో ఎత్తు. ఎన్నికల ప్రచార ఖర్చులు ఆయా గ్రామాల్లో చెరువులు లీజుకు తీసుకున్న వారి నెత్తినే వేసి ఆ విధంగాను ఎమ్మెల్యేలు లబ్ధిపొందుతున్నారు. ఇక్కడ అటవీ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు నామమాత్రమయ్యారు. అంతే కాదు- స్థానికంగా ఎప్పట్నుంచో ఇక్కడే పని చేస్తున్న అటవీ అధికారులు ఈ ఆక్రమణల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే స్వయంగా చెరువులు తవ్వుకునే వారిని ఎమ్మెల్యేల వద్దకు పంపుతున్నారు. వారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత తవ్వకాలను చూడకుండా వదిలేస్తున్నారు. ఆనక విషయం బయటపడితే వచ్చే టాస్క్‌ఫోర్సు అధికారుల దాడులూ ఉత్తుత్తిగానే సాగుతున్నాయి. తమ మాట వినడం లేదని ఒక డీఎఫ్‌ఓను ఇక్కడి ప్రజాప్రతినిధులు బదిలీ చేయించారు.


అన్నీ అక్రమాలే!

నిజానికి ఆక్రమణదారుల చేతులు కట్టేసే అవకాశం జగన్‌ సర్కారుకు ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న చెక్‌పోస్టులను యంత్రాంగం సరిగా నిర్వహించి ఉంటే కొల్లేరు ఆక్రమణల చెరువుల్లో చేపల సాగు వీలయ్యేది కాదు. ఆ చెరువులను ధ్వంసం చేసే అవకాశమూ ఉండేది. అవేవీ చేయకపోవడంతో.. ఎలాంటి శషబిషలు లేకుండా సీడ్‌ రవాణా చేస్తున్నారు. రోజూ వేల టన్నుల ఫీడ్‌ కొల్లేరులోకి సరఫరా అవుతోంది. ఈ సరస్సును కాలుష్యంతో నింపేస్తున్నారు. ఏటా ఆ ఆక్రమిత చెరువులను పొక్లయిన్లతో బాగు చేసుకుంటున్నా అడిగేవారే లేరు. ప్లస్‌ 5 కాంటూరులోపు ఉన్న ప్రాంతాన్ని మట్టితో రెండేళ్లుగా ఎత్తు చేస్తూ అది అభయారణ్యం కాదంటూ చెప్పేందుకూ అధికారులు సాహసిస్తున్నారు. కొల్లేరులో డ్రెయిన్లను ఆక్రమిస్తున్నారు. జగన్‌ సర్కారు చేజేతులా ఆక్రమణలకు ఊతమిచ్చింది. కొత్త తవ్వకాలకు అనధికారికంగా అనుమతులూ ఇచ్చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని