రూ.100 కోట్ల విలువగల నగదు, వస్తువులు స్వాధీనం: సీఈవో

ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటినుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

Published : 12 Apr 2024 04:24 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి, మద్దిపాడు, న్యూస్‌టుడే: ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటినుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువుల రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టామని గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. గత 24 గంటల్లోనే రూ.1.97 కోట్ల విలువగల వస్తువులను జప్తు చేశామని పేర్కొన్నారు. ‘మొత్తం స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.25.03కోట్ల నగదు, రూ.12.49 కోట్ల విలువ గల 6,14,837 లీటర్ల మద్యం, రూ.2 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు, రూ.62కోట్ల విలువ చేసే ఇతర వస్తువులు ఉన్నాయి’ అని సీఈఓ మీనా వెల్లడించారు.

15లోగా జీపీఎస్‌ అనుసంధానం పూర్తి చేయాలి

వెబ్‌ క్యాస్టింగ్‌, జీపీఎస్‌ ద్వారా మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించాలని సీఈఓ మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు (మద్యం తయారీ సంస్థలు), మద్యం గోదాముల వద్ద, నిల్వ చేసే స్థలాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా సంస్థలు గోదాముల నుంచి మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం చేసే ప్రక్రియ ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

గుండ్లాపల్లి చెక్‌పోస్టును పరిశీలించిన సీఈవో

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సీఈఓ పరిశీలించారు. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నామని ఆసమయంలో వీడియో రికార్డింగ్‌ చేయిస్తున్నట్లు చెప్పారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని, తగిన ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదు ఉంటే స్వాధీనం చేసుకుని ట్రెజరీకి అప్పగించాలని అధికారులకు సూచించారు.


పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఓటు హక్కు ఆవశ్యకత, వినియోగాన్ని తెలిపేలా రూపొందించిన మస్కట్‌ను ఆవిష్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని