మిస్టర్‌ 5%

రాష్ట్ర క్యాబినెట్‌లో ఓ కీలక మంత్రి... వ్యవహారం సత్తెకాలం సత్తెయ్యలా ఉంటుంది... చేతల్లో మాత్రం కలికాలం మహిమ కనిపిస్తుంది... అధికారులు ఆయనకు పెట్టుకున్న పేరు మిస్టర్‌ 5% ఎందుకంటే... ఎన్నికల ఫలితాలపై భయంతో అందినకాడికి దండుకోవాలని స్కెచ్‌ వేశారు.

Updated : 12 Apr 2024 12:13 IST

ఎన్నికలు వస్తున్నాయని ఎడాపెడా దోపిడీ
ఉపాధ్యాయుల అక్రమ బదిలీల్లో రూ.50 కోట్ల దందా
పాత గుత్తేదారులకే విద్యా ‘కానుక’
టెండర్లు లేకుండానే చిక్కీల బాధ్యత అప్పగింత
పాఠ్యపుస్తకాల ముద్రణనూ వదలని కీలక మంత్రి
ఈనాడు, అమరావతి

రాష్ట్ర క్యాబినెట్‌లో ఓ కీలక మంత్రి...
వ్యవహారం సత్తెకాలం సత్తెయ్యలా ఉంటుంది...
చేతల్లో మాత్రం కలికాలం మహిమ కనిపిస్తుంది...
అధికారులు ఆయనకు పెట్టుకున్న పేరు మిస్టర్‌ 5%  
ఎందుకంటే... ఎన్నికల ఫలితాలపై భయంతో అందినకాడికి దండుకోవాలని స్కెచ్‌ వేశారు...
పనులన్నీ టెండర్లు లేకుండానే అప్పగించేశారు...  
దీనికాయన తీసుకున్న కమీషన్‌ 5%...
ఈ దందాలో రూ.కోట్లను పోగేశారు!
అన్నీ తెలిసిన సీఎం... తనలాంటి మనిషే కదా అనుకుని మిన్నకున్నట్లున్నారు!

జగనన్న మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి... దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత పదవిలో ఉంటామో.. ఊడతామోననే భయంతో రూ.కోట్ల విలువైన పనులను అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పిల్లలకిచ్చే చిక్కీలు, విద్యాకానుక, పుస్తకాల ముద్రణ, ట్యాబ్‌ల సరఫరా ఇలా అన్నింట్లోనూ సొమ్ములు లాగేశారు. మంత్రి చెబితే చాలు... ముందూ వెనకా ఆలోచించకుండా ఉత్తర్వులు ఇవ్వడంలో ఓ ముఖ్య అధికారి ముందుంటారు. మంత్రికి ఈయన ‘ఏటీఎం’ లాంటివారని పిలుస్తారు.

ఏకంగా 2,600 పైరవీ బదిలీలు

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఉపాధ్యాయులకు ‘పైరవీ బదిలీలు’ నిర్వహించారు. కౌన్సెలింగ్‌ బదిలీలు ముగిశాక డిప్యుటేషన్లు, బదిలీలు చేయాలంటే గతంలో ఆయా దస్త్రాలను సీఎం కార్యాలయానికి పంపించేవారు. మంత్రి, ముఖ్య అధికారి ఈ నిబంధనకు చరమగీతం పాడారు. ముఖ్య అధికారి, మంత్రి పేషీలోని ఓ పీఏ... కలిసి 2,600 మంది ఉపాధ్యాయుల సిఫార్సు బదిలీలను  ప్రతిపాదించారు. ఒక్కో బదిలీకి రూ.3-4 లక్షలు తీసుకుని... ఒక పద్ధతి ప్రకారం రూ.50 కోట్లకుపైగా దోచేశారనే ఆరోపణలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్దుబాటు కాకపోవడంతో కొందరికి పోస్టింగులు లభించలేదు. ఈ బదిలీల్లో కోరుకున్న ప్రాంతాలు, హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల కోడ్‌కు ఒక్కరోజు ముందు ఇంటర్‌ బోర్డులో 190 మందికి పదోన్నతులు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి  రూ.50 వేల చొప్పున వసూలు చేశారని, ఈ తతంగమంతా మంత్రి ఇంటి కేంద్రంగా జరిగినట్లు ఆరోపణలున్నాయి.

బ్యాగుల్లో నాణ్యత లేకపోయినా ‘సర్దేశారు’

‘విద్యాకానుక’తోనే మంత్రి 5శాతం కమీషన్‌ విధానానికి తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యాకానుక-3లో నాణ్యతలేని బ్యాగులు సరఫరా చేశారు. అయ్యగారికి అందాల్సినవి అందడంతో గుత్తేదార్లు, అధికారులపై చర్యల్లేకుండా అన్నీ సర్దుబాటు చేసేశారు. దాదాపు సంచులన్నీ రెండు నెలల్లోపే చినిగిపోయాయి. కానీ, ఆరు లక్షలే కొత్తవిచ్చి, మిగతా వాటిని గాలికి వదిలేశారు. విజిలెన్స్‌ తనిఖీల్లోనూ ఇది బయటపడినా, కీలక మంత్రి కావడంతో సీఎంఓ సైతం మౌనం వహించింది.


వీసీల నియామకాల రూటే వేరు

వర్సిటీలకు వీసీల నియామకాల్లోనూ ఈ మంత్రి చక్రం తిప్పారు. ఆయన సతీమణి పీహెచ్‌డీకి గైడ్లుగా వ్యవహరించిన ఇద్దరికి వీసీలుగా పోస్టింగ్‌ ఇప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడంతో సీఎంవో సైతం ఆయన పైరవీలకు సరేనంది. దాంతో మరో ఇద్దరికి తన కోటాలోనే పోస్టులను ఇప్పించారు.


ప్రైవేటు వర్సిటీలకు అనుమతుల్లోనూ...

ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడంలోనూ ఈ మంత్రి భారీగానే పిండుకున్నారు. ఇటీవల మూడు ఇంజినీరింగ్‌ కళాశాలలకు వర్సిటీలుగా అనుమతిచ్చారు. ఇందులో ఓ కళాశాల యజమాని వర్సిటీ కోసం మంత్రికి భారీగా సమర్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


పాఠ్య పుస్తకాల్లో ‘అవినీతి’ పుటలు

పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్‌లో విక్రయించే వాటినీ వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి ముద్రణ సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు. ప్రైవేటు బడుల కోసం మార్కెట్‌లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం ఒక పేజీకి 44 పైసలుగా నిర్ణయించి, 16 సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది. అయితే, మూడు సంస్థలే బినామీ పేర్లతో ముద్రణ బాధ్యతలను రెండేళ్ల కాలానికి దక్కించుకున్నాయి. ఈ ప్రక్రియలో మంత్రి, సలహాదారు భారీగా లబ్ధి పొందారు. ఈ ఏడాది ఉచితంగా ఇచ్చే రూ.245 కోట్ల విలువైన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ టెండర్లలో మార్పు చేశారు. పేపర్‌తో సహా పుస్తకాలు ముద్రించేలా టెండరు పిలిచారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ ఎల్‌1గా నిలవగా... దీనికి 33% పని అప్పగించారు. మరో సంస్థకు ఆరో తరగతి పుస్తకాల ముద్రణ ఇచ్చారు. 1-7 తరగతుల ఉచిత పుస్తకాల ముద్రణను బయట మార్కెట్‌లో అమ్మే పుస్తకాలను ముద్రిస్తున్న సంస్థలకే అప్పగించేశారు. ఇలా ఉచిత, మార్కెట్‌లో అమ్మే పుస్తకాలను కొన్ని సంస్థలకే కట్టబెట్టారు. ఇందులో భారీగా డబ్బులు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.


‘చిక్కీ’ల పేరిట మేత

మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు వారానికి 3రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు. 2022 డిసెంబరుతో గడువు ముగుస్తున్నా... టెండర్లు పిలవలేదు. రూ.156 కోట్ల విలువైన కొత్త టెండర్లు పిలవడానికి సమయం చాలదంటూ మొదట 2023 ఫిబ్రవరి వరకు, తర్వాత 2024 జనవరి వరకు గడువు పొడిగించారు. ఇప్పుడూ పాతవారికే మరోసారి పొడిగించేశారు. ఇతర పథకాలకు చిక్కీ కిలో రూ.135కే ఇస్తుండగా.. పాఠశాలలకు కిలో రూ.149కి ఇస్తుండటం గమనార్హం.


బిల్లులు చెల్లించి.. కావాల్సినంత వాటా

గతేడాది ఇచ్చిన విద్యా కానుక-4లోనూ 5% కమిషన్‌ విధానాన్ని కొనసాగించినట్లు విమర్శలున్నాయి. కమీషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికిపైగా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు కండిషన్‌ పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇటీవల సమగ్ర శిక్షా  అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నుంచి రూ.500 కోట్లను విడుదల చేయించి... గుత్తేదార్లకు 50 శాతానికి పైగా బిల్లులు చెల్లించి, తన వాటాను సర్దుబాటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మంత్రికి సహకరించినందుకు ఎస్‌ఎస్‌ఏలోని ఇద్దరు కీలక   అధికారులు భారీగా లబ్ధి పొందినట్లు ప్రచారం సాగుతోంది.

వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాకానుక-5 అందించేందుకు టెండర్లు పిలవాల్సి ఉండగా... దస్త్రాన్ని నాలుగు నెలలపాటు తొక్కిపెట్టారు. ఎన్నికల ముందు ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే రూ.772 కోట్ల పని కట్టబెట్టారు. పాత ధరలకే బ్యాగులు, బూట్లు, యూనిఫాంలు, రెండు జతల సాక్సులు, బెల్టుల సరఫరా బాధ్యతను అప్పగించేశారు. నిబంధనల ప్రకారం న్యాయసమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించి, టెండరు విలువ తగ్గిపోయేలా చేశారు.


కోడిగుడ్ల రవాణాలో గుటకాయ స్వాహా

మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టు గడువు 2023 ఆగస్టుతో ముగియగా 2024 జులై వరకు పొడిగించేశారు. నెక్‌ ధరతోపాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా నిరుడు టెండర్లు నిర్వహించారు. సరాసరిన కిలోమీటరుకు 40-50 పైసల వరకు ఇస్తున్నారు. అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు. ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ధి పొందారు.


రూ.750 కోట్ల ట్యాబ్‌ల టెండరులోనూ ‘పాత వాసన’

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్‌ల టెండర్లను పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు. గతేడాది డిసెంబరులో ఇచ్చిన ట్యాబ్‌లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు దస్త్రాన్ని పంపిస్తే రెండు నెలలు తొక్కిపెట్టారు. పాత గుత్తేదారుకే అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందు రూ.750 కోట్ల టెండర్‌ను పాతవారికి ఇవ్వకూడదని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపగా కొత్తగా టెండర్లు పిలిచారు. అయినా... పాత గుత్తేదారుకే దాదాపు 3.50 లక్షల ట్యాబ్‌ల సరఫరా టెండర్‌ దక్కింది. సరఫరా చేసిన నెల రోజుల్లోనే బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు నుంచి తీసుకునేలా గ్యారంటీ కూడా ఇప్పించారు.


పేషీ నిర్వహణ పేరిటా

మంత్రి పేషీ నిర్వహణ పేరిట సమగ్ర శిక్షా అభియాన్‌, ఉన్నత విద్యా మండలి, ఇంటర్‌ బోర్డుల నుంచి నిధులు లాగేస్తున్నారు. పేషీలో పనిచేసే ఓఎస్డీ ఒకరు మంత్రికి సమీప బంధువు. ఆయన పదవీ విరమణ చేశాక తన కార్యాలయంలో ఓఎస్డీగా నియమించుకున్నారు. ఈయన ఖర్చులకు ఉన్నత విద్యా మండలి నుంచే ప్రతి నెల రూ.మూడు లక్షలకుపైగా తీసుకుంటుండటం గమనార్హం.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని