ఈటీవీ పేరుతో ఫేక్‌ వీడియోల వ్యాప్తి

తెలుగునాట విశ్వసనీయమైన వార్తలకు పెట్టింది పేరు ఈటీవీ. ఈ సంస్థకున్న విశ్వసనీయతను అడ్డుపెట్టుకుని కొందరు తప్పుడు వీడియోలు, వార్తలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వ్యాప్తిచేస్తున్నారు.

Published : 12 Apr 2024 04:27 IST

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు

హైదరాబాద్‌: తెలుగునాట విశ్వసనీయమైన వార్తలకు పెట్టింది పేరు ఈటీవీ. ఈ సంస్థకున్న విశ్వసనీయతను అడ్డుపెట్టుకుని కొందరు తప్పుడు వీడియోలు, వార్తలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వ్యాప్తిచేస్తున్నారు. ఏపీలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ఇచ్చిందంటూ ఈటీవీ స్క్రీన్‌ను పోలిన ఒక వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారు. అలాగే తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టో రద్దు అని ఒకటి, చంద్రబాబు తీరుపై జనసేన ఆగ్రహం అంటూ మరొక వీడియోను ఈటీవీ ఛానల్‌ తాజా సమాచారం ప్రసారం చేసే పద్ధతిలో నకిలీ క్లిప్పింగ్‌ తయారుచేసి అదే మ్యూజిక్‌తో సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛానల్‌ పేరును దుర్వినియోగం చేయటం, నకిలీ వార్తలను వ్యాప్తి చేయటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈటీవీ యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేసింది. తప్పుడు వార్తలు వ్యాప్తిచేసిన వారి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలు, ఐపీ అడ్రస్‌లు పోలీసులకు అందజేసింది.

నకిలీ వార్తలపై పోలీసుల దృష్టి

ఈటీవీ ఫిర్యాదు మేరకు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. తప్పుడు వార్తలు, వీడియోలను ఎవరు రూపొందించారు? ఎక్కడి నుంచి పోస్టు చేశారు? ఎవరు వ్యాప్తిలోకి తెచ్చారు? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ అకౌంట్స్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాలకు కూడా సమాచారం పంపినట్టు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని