మమ్మల్నే ప్రశ్నిస్తారా.. మీ కథ చూస్తా

‘మమ్మల్నే ప్రశ్నిస్తారా.. మీ కథ చూస్తా’నంటూ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి ముస్లిం నాయకులపై జులుం ప్రదర్శించారు.

Published : 12 Apr 2024 04:27 IST

ముస్లింలపై వైకాపా చిత్తూరు అభ్యర్థి విజయానందరెడ్డి జులుం
ఈద్గా వేదికగా నగదు పంపిణీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ‘మమ్మల్నే ప్రశ్నిస్తారా.. మీ కథ చూస్తా’నంటూ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి ముస్లిం నాయకులపై జులుం ప్రదర్శించారు. రంజాన్‌ సందర్భంగా చిత్తూరులోని గిరింపేట ఈద్గాలో గురువారం ఉదయం ముస్లింలు ప్రార్థనలు చేశారు. వారిలో ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా వర్గీయులు ఉండటంతో.. ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు విజయానందరెడ్డి, గురజాల జగన్మోహన్‌ను ఆహ్వానించారు. వారిద్దరితో పాటు మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బాలాజీ తమ అనుచరులతో కలిసి ఒకే సమయంలో ఈద్గాకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ముందుగా ముస్లింలను ఉద్దేశించి విజయానందరెడ్డి మాట్లాడారు. వెంటనే అక్కడున్న మైకులను వైకాపా వర్గీయులు తొలగించారు. అలా ఎందుకు చేశారని, ఈద్గాలో రాజకీయాలు ఎందుకని తెదేపా అనుకూల ముస్లిం నాయకులు ప్రశ్నించారు. దీంతో విజయానందరెడ్డి వారినుద్దేశించి ‘మీ కథ చూస్తా’నని బెదిరింపు ధోరణిలో హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు వాదనకు దిగారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. ఈద్గాలో ఉన్నవారికి విజయానందరెడ్డి నగదు పంచారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఈద్గాలో బెదిరింపులకు పాల్పడటం, నగదు పంచడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెదేపా నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని