పిల్లల కోడిగుడ్డు లాగేసిన జగన్‌ మామ

జగనన్న గోరుముద్దకు ఏడాదికి రూ.1,824కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలు ఏం తింటున్నారని ఓ ముఖ్యమంత్రి ఆలోచించిన పరిస్థితి గతంలో లేదు. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్ద చేపట్టాం.

Updated : 12 Apr 2024 05:48 IST

వారం రోజులుగా నిలిచిన సరఫరా
బడుల్లో ఉన్న వాటినే సర్దుబాటు చేస్తున్న ఉపాధ్యాయులు
గుడ్ల బకాయిలు రూ.163కోట్లు, చిక్కీలకు రూ.62కోట్లు పెండింగ్‌


గొప్పలు..

జగనన్న గోరుముద్దకు ఏడాదికి రూ.1,824కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలు ఏం తింటున్నారని ఓ ముఖ్యమంత్రి ఆలోచించిన పరిస్థితి గతంలో లేదు. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్ద చేపట్టాం.

సీఎం జగన్‌ తరచూ చెప్పే మాటలివి


వాస్తవం

పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం పేరును జగనన్న గోరుముద్దగా మార్చేసి.. మొదటిసారి కొత్తగా దీన్ని చేపట్టినట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. పిల్లలు ఏం తింటున్నారో అని పదేపదే ఆలోచిస్తున్నానని చెప్పే సీఎం.. గత అక్టోబరు నుంచి కోడిగుడ్లు, చిక్కీలకు బిల్లులు నిలిపివేశారు. కానీ తన అనుచరవర్గానికి, కమీషన్లు వచ్చే బిల్లులను మాత్రం ఇటీవలే పెద్దఎత్తున చెల్లించేశారు. ఇది ఒక్కటి చాలు.. సీఎం జగన్‌కు మధ్యాహ్న భోజనంపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో చేప్పేందుకు. బకాయిలు పేరుకుపోవడంతో ఈ నెల ఒకటి నుంచి గుత్తేదార్లు బడులకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేశారు. మేనమామను అంటూ గొప్పలు చేప్పే జగన్‌ పిల్లల నోటికాడి గుడ్డును లాగేశారు.


ఈనాడు, అమరావతి: అబద్ధాన్ని ఎలాంటి జంకు లేకుండా చెప్పేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు ఉండరేమో.! ప్రజలకు ఏమి తెలియదు.. ఏం చెప్పినా నమ్ముతారనుకుంటారో ఏమో.. అవాస్తవాలను అలవోకగా చెప్పేస్తారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. తెదేపా హయాంలోనే వారానికి ఐదు కోడిగుడ్లు ఇవ్వడం ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ప్రచార యావతో పథకం పేరు జగనన్న గోరుముద్దగా మార్చి, దీన్ని ఏదో కొత్తగా చేపట్టినట్లు ప్రచారానికి తెరతీశారు. పిల్లలకు మేనమామగా ఉంటానంటూ గొప్పలు చెప్పే సీఎం జగన్‌ చిన్నారుల నోటికాడి కోడిగుడ్డు, చిక్కీలను లాగేశారు. చిన్నారులకు పోషకాహారం అందకుండా చేసిన ఆయనే గొప్పలు చెప్పుకోవడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,121 పాఠశాలల్లో సుమారు 34లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు, మూడు రోజులు చిక్కీలు ఇస్తున్నారు. వీటిని సరఫరా చేసే గుత్తేదార్లకు గతేడాది అక్టోబరు నుంచి బిల్లులు చెల్లించడం లేదు. ఈ బిల్లులను గ్రీన్‌ఛానల్‌లో చెల్లిస్తామని చెప్పిన జగన్‌ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ఆ తర్వాత తనకు కావాల్సిన గుత్తేదార్లకు ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించేసిన సీఎం జగన్‌.. కోడిగుడ్లు, చిక్కీలకు మాత్రం బిల్లులు విడుదల చేయలేదు. కోడిగుడ్లకు రూ.163.88కోట్లు, చిక్కీలకు రూ.62.93 కోట్ల బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలని కొన్ని నెలలుగా గుత్తేదార్లు కోరుతున్నారు. బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించినా ప్రభుత్వంలో చలనం లేకుండాపోయింది.

వారం రోజులుగా సరఫరా లేదు..

కోడిగుడ్లు, చిక్కీల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గుత్తేదార్లు ఈనెల ఒకటో తేదీ నుంచి సరఫరా నిలిపివేశారు. వారానికోసారి కోడిగుడ్లను బడులకు సరఫరా చేస్తారు. ఈ వారం నిలిపివేశారు. పాఠశాలల్లో ఉన్న వాటినే ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తున్నారు. సోమవారం నాటికి దాదాపుగా అన్ని బడుల్లోనూ కోడిగుడ్ల నిల్వలు అయిపోతాయి. రాయలసీమలోని కొన్ని జిల్లాలకు అక్కడి గుత్తేదార్లు అందిస్తున్నారు. మొదట్లో ఎక్కువ ఇండెంట్‌ పెట్టిన బడుల్లోనే చిక్కీలు ఉన్నాయి. మిగతా వాటిల్లో రెండు, మూడు రోజుల్లో ఖాళీ కానున్నాయి.

  • కొన్నిచోట్ల కోడిగుడ్లు తక్కువగా.. విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో..ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని పంపిణీ నిలిపివేశారు.
  • కొన్ని బడులకు రాగిపిండి సరఫరా కాలేదు. బియ్యంతోపాటు రాగిపిండి పంపించాల్సి ఉండగా రాలేదు. ఇలాంటి చోట విద్యార్థులకు రాగిజావ సరఫరా నిలిచిపోనుంది.

ప్రచారం రావడం లేదనా?

ప్రచారం కోసం మధ్యాహ్న భోజనం పథకాన్నీ జగన్‌ వదల లేదు. జగనన్న గోరుముద్ద పథకంగా పేరు మార్చేశారు. చిక్కీల కవర్లపై జగన్‌ బొమ్మలు వేసుకున్నారు. కోడిగుడ్లపైన స్టాంపింగ్‌ వేశారు. రాగిజావ అందించే స్టీల్‌ గ్లాసులపైనా పేరు రాయించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత వీటన్నింటిపైనా అభ్యంతరాలు రావడంతో కోడిగుడ్లపై స్టాంపింగ్‌ నిలిపివేయించారు. చిక్కీల కవర్లను ముందుగానే చింపేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇస్తున్నారు. ప్రచారానికి అడ్డుకట్ట పడటంతో..చివరికి పిల్లలకు వాటిని అందకుండా చేశారేమోననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని