చొక్కా పట్టి.. దుర్భాషలాడి

ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది.

Updated : 13 Apr 2024 07:05 IST

స్టేషన్‌లోనే సీఐపై బాలినేని దౌర్జన్యం
వైకాపా వారిని అరెస్టు చేశారంటూ ఆగ్రహం
మూడు గంటలకుపైగా స్టేషన్‌లోనే తిష్ఠ

ఒంగోలు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది. తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి ఒంగోలు జీజీహెచ్‌లో ఆయన ధ్వంసరచన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లోనూ శుక్రవారం ఉదయం అలాగే దౌర్జన్యకాండ కొనసాగించారు. తమ కార్యకర్తలను అరెస్టు చేశారంటూ ఏకంగా పోలీసుస్టేషన్‌పైనే దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న సీఐ లక్ష్మణ్‌ను దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. దాదాపు మూడు గంటలపాటు స్టేషన్‌లోనే మకాం వేసి రభస చేశారు. అరెస్టు చేసిన తమ అనుచరులను న్యాయస్థానంలో హాజరుపరచకుండా స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు జీజీహెచ్‌లో బుధవారం రాత్రి వైకాపా శ్రేణులే తెదేపా కార్యకర్తలపై దాడి చేసి విధ్వంసం సృష్టించినప్పటికీ పోలీసులు మాత్రం రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామునుంచి అరెస్టులకు శ్రీకారం చుట్టారు. వైకాపాకు చెందిన ఇద్దరిని ఒకటో పట్టణ స్టేషన్‌లో, తెదేపాకు చెందిన నలుగురిని రెండో పట్టణ స్టేషన్‌లో నిర్బంధంలో ఉంచారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. వైకాపా కార్యకర్తల నిర్బంధం గురించి తెలుసుకున్న మాజీ మంత్రి బాలినేని ఆగ్రహంతో ఊగిపోయారు. రాత్రివేళ తమ పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారంటూ తన అనుచరులతో వెళ్లి సీఐ ఎం.లక్ష్మణ్‌ను ఆయన ఛాంబర్‌లో దుర్భాషలాడారు. పోస్టింగు కోసం తన చుట్టూ తిరిగి ఇప్పుడు తమ వారినే అరెస్టు చేయడమేంటంటూ సీఐ చొక్కా పట్టుకుని నెట్టేశారు. అదే సమయంలో బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు స్టేషన్‌ వద్ద మోహరించాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే అదనపు ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, డీఎస్పీ ఎం.కిషోర్‌బాబు చేరుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహించాయి.

గంటలపాటు పోలీసులపై ఒత్తిడి

ఒంగోలు సమతానగర్‌, జీజీహెచ్‌ సంఘటనల నేపథ్యంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఆయా సంఘటనల  నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలన్న పోలీసుల నిర్ణయం బాలినేనికి కంటగింపుగా మారింది. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు పోలీసులు దిగి రావాల్సి వచ్చింది. ఈ కేసులో ఉన్న వైకాపా వర్గీయులను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేసేందుకు అంగీకరించి పంపారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఉన్న తెదేపా వారికీ నోటీసులిచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో బాలినేని తన అనుచరులతో స్టేషన్‌నుంచి వెళ్లిపోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అనంతరం బాలినేని మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు అధికార వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని