ఇదీ.. ‘నిధి’ వంచన..!

రాజధానికి మూడు చుక్కలు, ఆరు చందమామలు పేర్చి అమరావతిని సింగారిస్తానని నమ్మబలికిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక అసలు రంగును బయటపెట్టారు.

Published : 13 Apr 2024 06:21 IST

అమరావతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పీకనొక్కిన వైకాపా సర్కారు
కొత్త రాజధాని అభివృద్ధిపై వక్రబుద్ధి
నిధులు మళ్లించి తీరని ద్రోహం
గత ప్రభుత్వంపై అక్కసుతో పనుల నిలిపివేత
ఈనాడు, అమరావతి

నోరెత్తితే అభివృద్ధి వికేంద్రీకరణ అనడం.. కళ్లముందున్న అభివృద్ధినేమో కాలరాయటం... ఒక్కసారి అవకాశం అంటూ వచ్చిన జగన్‌ ఈ ఐదేళ్లలో చేసిన ఘనకార్యమిదే! అందుకు ప్రత్యక్ష నిదర్శనం అమరావతి స్మార్ట్‌ సిటీ! పసిగుడ్డులాంటి రాజధానికి గ్రహణంలా పట్టుకున్న జగన్‌... కేంద్రమిచ్చిన స్మార్ట్‌సిటీనీ పగబట్టి నాశనం చేశారు. అమరావతి అభివృద్ధికి హారతిపళ్లెంలో పెట్టి ఇచ్చిన కేంద్ర నిధులనూ పక్కదారి పట్టించారు.
చేపట్టిన రూ. కోట్ల విలువైన పనులనూ కక్షపూరితంగా అటకెక్కించి వృథా చేశారు. రాజధాని అభివృద్ధి నిరోధకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.. జగన్‌!


అందరూ మెచ్చే రాజధానిని కడతా.. అన్ని హంగులతో అద్భుత భవంతులు నిర్మిస్తా.. సకల సౌకర్యాలతో దాని రూపురేఖలు మార్చేస్తా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తా..

 ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌


రాజధానికి మూడు చుక్కలు, ఆరు చందమామలు పేర్చి అమరావతిని సింగారిస్తానని నమ్మబలికిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక అసలు రంగును బయటపెట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ‘తూచ్‌’ అని తుంగలో తొక్కారు. వక్రబుద్ధితో ఐదేళ్లలో అభివృద్ధిని గాలికొదిలేశారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు రూపంలో అమరావతిని సుందరంగా తీర్చిదిద్దడానికి లభించిన అరుదైన సువర్ణావకాశాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు. ప్రాజెక్టును మార్చారు.. పనుల పరిధిని కుదించారు.. పురోగతిలో ఉన్న పనులను రద్దు పరిచారు. రాజధాని ప్రగతిని నట్టేట ముంచారు. రాష్ట్ర వాటాగా నిధుల విడుదల సంగతి దేవుడెరుగు.. ప్రాజెక్టు డబ్బును ఇతర అవసరాలకు దారి మళ్లించారు. వెరసి.. అమరావతికి తీరని ద్రోహం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టు నిధులను సద్వినియోగం చేసుకుని ఇతర రాష్ట్రాల్లోని ఇండౌర్‌, కొచ్చి, భువనేశ్వర్‌ వంటి నగరాలు పురోగమించాయి. అమరావతికి సంబంధించిన ప్రాజెక్టును మాత్రం గత ప్రభుత్వంపై కక్ష గట్టి నిట్టనిలువునా పాతరేశారు జగన్‌.


వెంకయ్యనాయుడు, చంద్రబాబు చొరవతో..

దేశంలోని వంద నగరాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి ప్రజలకు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ‘స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌’కు శ్రీకారం చుట్టింది. అప్పుడే పురుడు పోసుకుని కొత్త     నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి కూడా కేంద్రం ఈ మిషన్‌లో చోటుకల్పించింది. అందుకు అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు చాలా కృషి చేశారు. కొత్త రాజధానిగా అవతరించిన అమరావతిని అభివృద్ధిలో పరుగులెత్తించాలన్న తపనతో అప్పట్లో రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడం, ఆ ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడటం చకచకా సాగిపోయాయి. మొత్తానికి 2017 జూన్‌లో అమరావతికి.. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కింది.


రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టు..

స్మార్ట్‌ సిటీ కింద ఎంపికైన ఒక్కో నగరానికి రూ.1,000 కోట్ల చొప్పున నిధులు అందుతాయి. అందులో రూ.500 కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌, రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌. ఈ నిధులతో నగరాల అవసరాలకు తగిన ప్రాజెక్టులు రూపొందించుకుని నిర్వహించుకునే సౌలభ్యాన్ని కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. అదనంగా పీపీపీ పద్ధతిలో గానీ, రుణాలు, ఇతర మార్గాల ద్వారా గానీనీ నిధులు సమీకరించుకుని ప్రాజెక్టును విస్తరించుకునే వెసులుబాటును కూడా కేంద్రం ఇచ్చింది. ప్రాజెక్టు అమలులో భాగంగా అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టైనెబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌) పేరుతో ఎస్పీవీ(స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)ను ఏర్పాటుచేశారు. మిషన్‌ కింద ఇచ్చే నిధులతో పాటు అదనంగా ఇతర వనరుల ద్వారా రూ.2,046 కోట్లు సేకరించి, ఆ నిధులతో చేపట్టాల్సిన 20 పనులకు కూడా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాజధాని నిర్మాణం, స్మార్ట్‌ సిటీ పనుల మధ్య సమన్వయానికి సీఆర్డీఏ, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు మధ్య అవగాహన కుదిరింది. దీని ప్రకారం.. ప్రాజెక్టు కింద చేసే పనుల బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించారు. పనులకు వెచ్చించాల్సిన మొత్తాన్ని ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌.. సీఆర్డీఏకు బదిలీ చేస్తుంది. పనుల కోసం కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.500 కోట్లలో రూ.488 కోట్లను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మ్యాచింగ్‌ గ్రాంట్‌ వాటాగా రూ.488 కోట్లు కేటాయించింది. ఇలా మొత్తం రూ.976 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి.


జగన్‌ సర్కారు రాకతో గ్రహణం..

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులు గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే పట్టాలెక్కాయి. అవి పరుగులు తీస్తున్న తరుణంలోనే జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అమరావతి స్మార్ట్‌ సిటీకి గ్రహణం పట్టింది. అప్పటికే విడుదలైన రూ.976 కోట్లలో రూ.936 కోట్లను గ్రీన్‌ ఛానల్‌ పీడీ ఖాతాలో జమ చేశారు. ఖజానా శాఖ ఆంక్షలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌ పీడీ ఖాతా నుంచి నేరుగా బిల్లులు మంజూరవుతుంటాయి. దీంతో ఈ ఖాతాలోని రూ. కోట్ల నిధులు జగన్‌ ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్లాయి. ఫలితంగా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది. తమ నిధులను తమకు అందుబాటులో ఉంచాలని సీఆర్డీఏ, ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌, కేంద్ర ప్రభుత్వ విన్నపాలకు జగన్‌ సర్కారు స్పందించలేదు. చివరికి స్మార్ట్‌ సిటీ పనులు ఆగిపోయాయి.


గొంతు నులిమి.. ప్రాజెక్టును చంపేసి...

చంద్రబాబు హయాంలో అమరావతి స్మార్ట్‌ సిటీ కోసం రూ.2,046 కోట్లతో రూపొందించిన 20 పనుల్లో పదింటిని అర్ధంతరంగా రద్దు చేశారు. మిగిలిన 10 పనుల పరిధిని కూడా వైకాపా ప్రభుత్వం భారీగా కుదించింది. వాటిని కూడా పూర్తిచేయలేకపోయింది. తెదేపా హయాంలో ప్రారంభమైన 10 పనులను జగన్‌ అర్ధంతరంగా నిలిపివేశారు.

అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో గత తెదేపా ప్రభుత్వం రూ.350 కోట్లతో చేపట్టిన సెంట్రల్‌ పార్కు నిర్మాణ పనులను అర్ధంతరంగా నిలిపేశారు. రాజధానిలో దాదాపు 700 కి.మీ నిడివితో భూగర్భంలో విద్యుత్తు, ఇంటర్నెట్‌ అవసరాల కోసం రూ.270 కోట్లతో చేపట్టిన డక్ట్‌ పనులను కూడా రద్దు చేశారు. ఈ రెండింటిపై ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా వెచ్చించారు. పనుల రద్దుతో ఆ మొత్తం నిధులను గంగలో పోసినట్లయింది!


దళిత, గిరిజన వాడల పనులకు మంగళం

దళిత, గిరిజన వాడల్లో నివసించే ప్రజల మెరుగైన జీవనం కోసం ఉద్దేశించిన పనులకు కూడా జగన్‌ మంగళం పాడారు. ఆ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ‘స్మార్ట్‌ వార్డ్స్‌’ ప్రాజెక్టును కుదించి.. ఆ తర్వాత నిలిపివేశారు. వీరి కోసం తలపెట్టిన పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేశారు. దీని స్థానంలో సెంటు పట్టాలు పంపిణీ చేసి.. డిజిటల్‌ లైబ్రెరీలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర పనులను ప్రతిపాదించారు. కోర్టులో చుక్కెదురు కావడంతో ప్రభుత్వం ఆ పనులను నిలిపేసింది.


జగన్‌ వైఖరితో నిబంధనల మార్పు

జగన్‌ సర్కారు తీరును గ్రహించిన కేంద్రం.. చివరకు నిబంధనలనే మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు స్మార్ట్‌ మిషన్‌ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఉద్దేశంతో నిధుల విడుదల, వినియోగానికి సంబంధించిన నియమావళిని మార్చింది. అప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ ఛానల్‌ పీడీ ఖాతా స్థానాన్ని మరో ఖాతాకు మార్చింది. కేంద్రం పర్యవేక్షణలోని ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతా తెరిచి.. వినియోగించని నిధులను ఆ ఖాతాలోకి బదిలీ చేయాలని ఆదేశించింది.

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి సీఆర్డీఏకు రూ.560 కోట్లను బదిలీ చేసే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. గ్రీన్‌ ఛానల్‌ పీడీ ఖాతాలోని నిధులను తమకు చెల్లించాలని సీఆర్డీఏ అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఆ డబ్బుతో అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీవో, ఎన్జీవోల హౌసింగ్‌ ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని సీఆర్డీఏ అధికారులు పలుమార్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు విన్నవించినా పెడచెవిన పెట్టింది. కేంద్రం ఎస్‌ఎన్‌ఏ ఖాతాపై విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలతో చేసేదేమీ లేక హడావుడిగా 2022 మార్చిలో అమరావతి స్మార్ట్‌ సిటీ గ్రీన్‌ ఛానల్‌ పీడీ ఖాతా నుంచి సీఆర్డీఏ పీడీ ఖాతాకు రూ.560 కోట్లు జమ చేసింది. తర్వాత వెంటనే ఆ మొత్తాన్ని జగన్‌ సర్కారు వేరే పథకాలకు మళ్లించింది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని