రూ.988 కోట్ల పంచాయతీ నిధుల మళ్లింపు?

పంచాయతీల నిధుల్ని దారి మళ్లించేందుకు అలవాటుపడ్డ జగన్‌ ప్రభుత్వం... ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోలేదు.

Published : 13 Apr 2024 06:21 IST

ఆర్థిక సంఘం డబ్బుని తొక్కిపెట్టిన జగన్‌ సర్కారు
కోడ్‌ అమల్లోకి వచ్చినా కేంద్ర నిధులపై పెత్తనం
తీవ్రంగా మండిపడుతున్న సర్పంచులు

ఈనాడు, అమరావతి: పంచాయతీల నిధుల్ని దారి మళ్లించేందుకు అలవాటుపడ్డ జగన్‌ ప్రభుత్వం... ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోలేదు. 2023-24 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రెండో విడతగా విడుదల చేసిన రూ.988 కోట్ల నిధుల్ని ఇంకా పంచాయతీలకు విడుదల చేయలేదు. ఆ నిధులనూ ప్రభుత్వం దారి మళ్లించేసిందన్న అనుమానాలు సర్పంచులలో వ్యక్తమవుతున్నాయి. ఆ నిధుల్లో ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందు సుమారు రూ.600 కోట్లు రాగా, మిగతా మొత్తాన్ని కోడ్‌ అమల్లోకి వచ్చాక కేంద్రం విడుదల చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా గత మూడేళ్లలో దాదాపు రూ.1,850 కోట్లు విద్యుత్తు బకాయిల పేరుతో జగన్‌ ప్రభుత్వం మళ్లించింది. సర్పంచుల ఫిర్యాదుతో పంచాయతీల తరఫున బ్యాంకుఖాతాలు తెరిపించిన కేంద్రం... ఇకనుంచి ఆర్థికసంఘం నిధులను వాటికే జమచేయాలని ఏడాది క్రితమే రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయినా కేంద్రం తాజాగా ఇచ్చిన నిధులనూ రాష్ట్ర ఆర్థికశాఖ తన దగ్గరే పెట్టుకుంది.

వెలుగులోకి వచ్చిందిలా..

కేంద్రం రాష్ట్రానికి ఆర్థికసంఘం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిన అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కన్నబాబును శుక్రవారం కలిశారు. 20రోజుల క్రితం నిధులిచ్చినా పంచాయతీలకు ఇంకా కేటాయించకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధులు త్వరలోనే పంచాయతీలకు జమచేస్తామని కమిషనర్‌ చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు. గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారని, పంచాయతీల్లో పాడైన తాగునీటి మోటార్లకు నిధుల కొరతతో సకాలంలో మరమ్మతులు చేయించలేని పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణమని వీరాంజనేయులు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని