కేసుల వివరాలివ్వడానికి ఎంత సమయం కావాలి?

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

Published : 13 Apr 2024 06:21 IST

పిటిషనర్లు కోరి నెల రోజులైంది
ఇంతకాలం ఏం చేస్తున్నారు?
ఒక్కరోజులో ఇవ్వొచ్చు
ప్రత్యేక అధికారులను నియమించండి.. 16 లోపు అందించండి
తెదేపా అధినేత చంద్రబాబు తదితరుల పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తుచేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో అందించవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రెండుమూడు గంటల్లోనే వాటిని అందించవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. ఈ మార్గదర్శకాలను పాటించి ఉంటే ఇప్పటికే సమాచారాన్ని తెప్పించి ఉండేవారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నామినేషన్ల సమయంలో కేసుల గురించి ప్రస్తావించకపోతే అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని గుర్తుచేసింది.

పిటిషనర్లకు తెలియకుండా వారిపై కేసులు నమోదయి ఉండొచ్చని, వాటిలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసు ఇచ్చి ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో వారికి కేసుల సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని తేల్చిచెప్పింది. ఈనెల 16లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని డీజీపీ, పోలీసులను మౌఖికంగా ఆదేశించింది. విచారణను 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో (ఏసీబీ, సీఐడీ సహా) తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.

శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాదులు వీవీ లక్ష్మీనారాయణ, వీవీ సతీష్‌, పీవీజీ ఉమేశ్‌చంద్ర తదితరులు వాదనలు వినిపించారు. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని గుర్తుచేశారు. పిటిషనర్లు తమపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్‌ దాఖలు సమయంలో సమర్పించకపోతే అనర్హత వేటు పడే ప్రమాదం ఉందన్నారు. వాటి కోసం డీజీపీకి వినతి సమర్పించినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.

ఎస్పీల నుంచి సమాచారం తెప్పించాలి: ఎస్‌జీపీ

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎస్పీలను వివరాలు కోరకుండా నేరుగా డీజీపీకి వినతి ఇచ్చారని, అందుకే వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని