తాగించారు.. తూగించారు

రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తానని డప్పుకొట్టిన జగన్‌.. మద్యంతాగి మరణించిన వారి ఇళ్ల ముందరే ‘డప్పు’ కొట్టించారు! మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు.

Updated : 13 Apr 2024 13:51 IST

అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్‌
రూ.1.54 లక్షల కోట్లు పిండేశారు
‘జే బ్రాండ్ల’తో ప్రజల ఇళ్లూ ఒళ్లూ గుల్ల
గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు
65 శాతం అదనంగా దండుకున్న వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తానని డప్పుకొట్టిన జగన్‌.. మద్యంతాగి మరణించిన వారి ఇళ్ల ముందరే ‘డప్పు’ కొట్టించారు! మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు. కానీ అందుకు విరుద్ధంగా పేద, సామాన్యుల ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసి గల్లాపెట్టె నింపుకొన్నారు. డొక్కలెండిన బక్కజీవుల జేబులకు చిల్లుపెట్టి.. వారి గొంతుల్లో ‘జె బ్రాండ్‌’ విషాన్ని నింపి.. బడుగుల కుటుంబాల్లో చిచ్చు రా‘జే’శారు! ఆ అభాగ్యులవి ‘మద్యం’తర బతుకులు చేసేశారు.

దాయం వస్తుందని తెలిస్తే చాలు.. నిబంధనలకు రాం‘రం’ అనడం, గేట్లను ‘బార్‌’లా తెరవడం జగన్‌కు ‘జిన్ను’తో పెట్టిన విద్య. జనం సొమ్మును దోచడమే కానీ.. జనం కోసం దాచడం అస్సలే తెలియని ఆయన.. మద్యం అమ్మకాలతో ప్రజలను దోచుకున్న తీరును చూస్తే ఎంతటివారైనా విస్తుపోవాల్సిందే! కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలోకి ‘జె బ్రాండ్లు’ తీసుకొచ్చిన జగన్‌.. బీదాబిక్కీ జనాన్ని పీల్చిపిప్పి చేసి వారి ప్రాణాలను బలిగొనేదాకా విశ్రమించలేదు. ‘జె బ్రాండ్ల’ రూపంలో ప్రజలపై విషం ఎగజిమ్మి.. వారి కుటుంబాల్లో విషాదం నింపిన ఆ ‘విషాల’ హృదయుడు గడిచిన అయిదేళ్లలో మద్యం విక్రయాలతో పిండుకున్న మొత్తం రూ.1,54,333 కోట్లు!

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం తిరోగమిస్తుంటే మద్యం విక్రయాల్లో అప్రతిహతంగా పురోగమిస్తోంది! మందుబాబుల తాగుడు బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.కోట్లను కొల్లగొట్టారు సీఎం జగన్‌. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుద్దులు చెప్పిన ఆయన అధికారం చేపట్టగానే అబద్ధాలతో అంటకాగారు. పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ తన గల్లాపెట్టెను నింపేసుకున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాం(2014-19)తో పోల్చితే ఐదేళ్ల వైకాపా సర్కారు హయాంలో మద్యం విక్రయాల విలువ ఏకంగా 65.14 శాతం మేరకు పెరిగాయంటే జగన్‌ జనానికి ఎంతటి స్థాయిలో మత్తుకు బానిస చేశారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి.. మద్యం విక్రయాల్లో రాష్ట్రాన్ని జగన్‌ మొదటిస్థానంలో నిలిపి రికార్డు సృష్టించారు!

అన్నీ వైకాపా నేతల చేతుల్లోనే..

  • ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 మధ్య ఐదేళ్ల వ్యవధిలో అధికారిక లెక్కల ప్రకారం రూ.1,24,333.29 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. వైకాపా నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులు తమ చేతుల్లో ఉన్న బెల్ట్‌షాపులు, బార్లలో అదనపు ధరలకు విక్రయించి అనధికారికంగా వసూలు చేసింది రూ.30 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
  • రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు ఉన్నాయి. వైకాపా నాయకుల యాజమాన్యం చేతుల్లో ఉన్న ఈ బార్లలో లూజ్‌ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ తరహా విక్రయాల ద్వారా అదనంగా 30 నుంచి 50 శాతం మేరకు బాదేశారు. ఇలా ఏడాదికి రూ.3 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వరకు పీల్చారు.
  • రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దాదాపు రెండు, మూడు బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. ఆబ్కారీ శాఖ నుంచి వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులే ఎక్కువగా వీటిని అక్రమంగా నిర్వహిస్తున్నారు. వీటిలో క్వార్టర్‌ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేశారు. ఇలా ఏడాదికి కనీసం రూ.3 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వరకు దోచేశారు.

విక్రయాల పెంపునకు కొత్తదారులు

దశల వారీగా మద్యనిషేధం అంటే రాష్ట్రంలో వీలైనంత వరకూ మద్యం అందుబాటులో లేకుండా చూడాలి. క్రమక్రమంగా మద్యం అమ్మకాలను నిలిపేయాలి. కానీ.. జగన్‌ తన మాట మీద తాను నిలబడే వ్యక్తి కాదు కదా..! ప్రజలతో తాగించారు.. వారిని తూగించారు.. వారి నుంచి గుంజినంత గుంజి గల్లా పెట్టె నింపుకొన్నారు. మద్యం విక్రయాలను పెంచేందుకు జగన్‌ అనేక కొత్తదారులు కనిపెట్టారు. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానన్న ఆయన గతంలో ఉన్న బార్ల సంఖ్యను తగ్గించలేదు సరికదా.. మరింతగా పెంచారు. అంతకు ముందు వరకూ బార్లు లేని కొత్త పురపాలికలు, నగరపంచాయతీల్లో నూతనంగా బార్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మద్యం వాక్‌-ఇన్‌ స్టోర్లు తెరిచారు. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లు, వాక్‌-ఇన్‌ షాపులు ప్రారంభించారు.


ఎన్ని తాళిబొట్లు తెంచారో..

జగన్‌ అధికారం చేపట్టాక తొలి ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.20,928.61 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.30,078 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. అంటే జగన్‌ జమానాలో తొలి ఏడాది (2019-20)తో పోలిస్తే చివరి ఏడాది(2023-24) నాటికి మద్యం విక్రయాల విలువ ఏకంగా 43.72 శాతం పెరిగింది. అయిదేళ్లలో అదనంగా రూ.9,149.76 కోట్ల విలువైన మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ లెక్కన అయిదేళ్ల వ్యవధిలో ఎన్ని లక్షల మందికి తాగించారు? ఎన్ని వేల కుటుంబాలను వీధిపాలుజేశారు? ఎంతమంది తాళిబొట్లు తెంచారు? ఎంత మందిని అనారోగ్యానికి గురిచేశారు? అని ఊహించడం కష్టమేమీ కాదు..!


గత ప్రభుత్వానికి ఈ సర్కారుకు ఇంత తేడా..

  • రాష్ట్రంలో గత తెదేపా ప్రభుత్వ హయాంతో పోల్చితే వైకాపా సర్కారు హయాంలో 65.14 శాతం మేర మద్యం విక్రయాలు పెరిగాయి.
  • గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి మాసాంతం వరకు రూ.75,285.97 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే వైకాపా హయాంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో రూ.1,24,333.29 కోట్ల విలువైన మద్యం అమ్మారు. దీని ప్రకారం.. గత ప్రభుత్వంతో పోల్చితే వైకాపా సర్కారు పాలనాకాలంలో మొత్తం రూ.49,047.32 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా విక్రయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని