ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌.. 55 హైస్కూలు ప్లస్‌లలో ‘సున్నా ఫలితాలు’..

జగన్‌ సర్కారు ఆడిన వింత ఆటలో పేద విద్యార్థుల జీవితాలు ఆగమై పోయాయి. ఇంటర్‌ ఫలితాల్లో హైస్కూల్‌ ప్లస్‌, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) డొల్లతనం బయటపడింది.

Updated : 13 Apr 2024 07:31 IST

ఫస్టియర్‌లో 27.69%, సెకండియర్‌లో 34.11% ఉత్తీర్ణత
16 కేజీబీవీల్లోనూ సున్నా ఫలితాలే
మండలానికో బాలికల కళాశాలంటూ ప్రచారమే తప్ప చదువు చెప్పిందే లేదు

ఈనాడు, అమరావతి: జగన్‌ సర్కారు ఆడిన వింత ఆటలో పేద విద్యార్థుల జీవితాలు ఆగమై పోయాయి. ఇంటర్‌ ఫలితాల్లో హైస్కూల్‌ ప్లస్‌, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) డొల్లతనం బయటపడింది. హైస్కూల్‌ ప్లస్‌ విద్యాసంస్థల్లో మొదటి సంవత్సరంలో 27, రెండో సంవత్సరంలో 28 చోట్ల ఒక్కరూ పాస్‌ కాలేదు. కేజీబీవీల్లోనూ ఫస్టియర్‌లో 10 చోట్ల, సెకండియర్‌లో ఆరు చోట్ల అందరూ ఫెయిలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫలితాల్లో బాలికల హవా కొనసాగగా, ప్రభుత్వ బాలికల కళాశాలల్లో ఇంతటి ఘోర ఫలితాలు వచ్చాయి. కేజీబీవీలు, హైస్కూల్‌ ప్లస్‌లలో చదివే వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద బాలికలే. వీరికి కనీసం పాఠ్యపుస్తకాలు ఇచ్చేందుకూ జగన్‌కు చేతులు రాలేదు. కమీషన్లు భారీగా వచ్చే ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌, స్మార్ట్‌ టీవీలు, ట్యాబ్‌లు, ఫర్నిచర్‌ వంటి ఉపకరణాల కొనుగోళ్లకే ప్రాధాన్యమిచ్చారు. వీటిపై ఎంత ఎక్కువ ఖర్చుచేస్తే అంత ఎక్కువ కమీషన్‌ వస్తుందన్న ఆరోపణలున్నాయి. హైస్కూల్‌ ప్లస్‌లలో సరిపడా అధ్యాపకులను నియమించకుండా, ప్రయోగశాలలు ఏర్పాటు చేయకుండా పేద పిల్లల జీవితాలను బలి చేశారు.

72% మంది బాలికలు ఫెయిల్‌..

హైస్కూల్‌ ప్లస్‌లలో ఇంటర్‌ చదువుకున్న వారిలో మొదటి ఏడాదిలో 72.31%, రెండో ఏడాదిలో 65.89% మంది ఫెయిలయ్యారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 249 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ కోర్సును ప్రారంభించారు. పాఠాలు చెప్పేవారు లేకపోవడంతో గతేడాది ఫస్టియర్‌లో కేవలం 12% ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా ఫలితాల మెరుగుకు చర్యలు తీసుకోలేదు. స్కూల్‌ అసిస్టెంట్లకే ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి, వారితోనే ఇంటర్‌ పాఠాలు చెప్పించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఫస్టియర్‌లో 57.47%, సెకండియర్‌లో 69.89% మంది ఉత్తీర్ణులయ్యారు. మండలానికో బాలికల జూనియర్‌ కళాశాల ఉండాలంటూ సీఎం జగన్‌ ఆదేశించడం, ముందూ వెనుకా ఆలోచించకుండా అధికారులు ప్రారంభించేయడం.. పర్యవసానమే ఈ ఫలితాలు. సీఎం ఆదేశాలతో 131 కేజీబీవీల్లో ఇంటర్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. అధ్యాపకుల సర్దుబాటు పేరుతో కొన్ని సబ్జెక్టులకు లెక్చరర్లను తొలగించారు. 9, 10 తరగతులకు బోధించే వారితోనే ఇంటర్‌ సబ్జెక్టులు చెప్పించారు. ఫలితంగా గతేడాది 34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు రాగా, ఈసారి 16 చోట్ల అదే ఫలితం పునరావృతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని