పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి

ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపైనే వైకాపా నేత అనుచరులు దాడికి పాల్పడ్డారు.

Published : 13 Apr 2024 04:09 IST

సీఎం సభ సాక్షిగా ఘటన

గుంటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపైనే వైకాపా నేత అనుచరులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం గుంటూరు ఏటుకూరురోడ్డు సమీపంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్‌, స్థానిక పోలీసు అధికారులు సీఎం భద్రతా చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో అన్ని రకాలుగా నిఘా పెడుతుంటారు. సీఎం వచ్చే మార్గాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగరవేసి అక్కడి పరిస్థితులను నిశితంగా పరీక్షిస్తుంటారు. ఆయా వీడియోలను ఎప్పుటికప్పుడు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తుంటారు. అందులో భాగంలో శుక్రవారం సాయంత్రం సీఎం కాన్వాయ్‌ రావడానికి కొద్ది గంటల ముందు పోలీసులు ఏటుకూరురోడ్డు సభ ప్రాంగణం సమీపంలో డ్రోన్లు ఎగరవేసి, పరిస్థితులు గమనిస్తున్నారు. కాసేపటి తర్వాత దానిలో ఛార్జింగ్‌ ఎంత ఉన్నదో పరిశీలించడానికి కిందకు దించుతుండగా.. నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు, అధికార పార్టీ విద్యార్థి విభాగం నేత తమ పార్టీ కార్యకర్తలతో కలిసి డ్రోన్‌ ఎగరవేస్తున్న పోలీసు సిబ్బందిపై దాడికి దిగారు. ఎవర్రా మీరు అంటూ దుర్భాషలాడి, కొట్టారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా మూకుమ్మడిగా పిడిగుద్దులు కురిపించారు. వారి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఒకరికి గట్టిదెబ్బలు తగిలాయి. సీఎం సభలో జనం లేరని చిత్రీకరించడానికి డ్రోన్‌ ఎగరవేస్తున్నారు.. మాకు తెలుసని దురుసుగా మాట్లాడి వారి నుంచి డ్రోన్‌ లాక్కుని పగలకొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని