తిరుపతి ‘ఎపిక్‌ కార్డుల’ బాధ్యుల్ని వదలం: సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా 35 వేల ఎపిక్‌ గుర్తింపు కార్డులను అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేసిన వ్యవహారంలో క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు.

Updated : 13 Apr 2024 08:21 IST

ఈనాడు, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా 35 వేల ఎపిక్‌ గుర్తింపు కార్డులను అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేసిన వ్యవహారంలో క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే ఐఏఎస్‌ అధికారితోపాటు డిప్యూటీ కమిషనర్‌, పోలీసులు, రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చేశామన్నారు. కొందరి నుంచి ఎస్పీ స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని, రికార్డులను ఫోరెన్సికల్‌ ల్యాబ్‌కు పంపించారని పేర్కొన్నారు. పోలీస్‌ విచారణ త్వరలోనే పూర్తవుతుందని, బాధ్యులు ఎవరో తేలాక ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ అంశాన్ని ఈసీ నేరుగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. తితిదే ఈవో ధర్మారెడ్డిపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు చేసిన అంశంపై సంజాయిషీ ఇవ్వాలని ఈవోను అడిగినట్లు తెలిపారు.

అది వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శుక్రవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమంలో పాల్గొని స్ట్రాంగ్‌రూంలను తనిఖీ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ‘ఏడాది నుంచి దొంగ, డూప్లికేట్‌ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. జనవరి 22న తుది జాబితా విడుదల చేసే నాటికి మృతులు, డూప్లికేట్‌ ఓట్లపై 16 లక్షల ఫిర్యాదులు అందగా, ఆరు లక్షల ఓట్లు తొలగించాం. ఇంకా డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్‌కు వారం ముందు ఓటర్‌ స్లిప్పులు పంచిన తర్వాత ఆబ్సెన్టీ, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన, డూప్లికేట్‌ ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలు, పోలింగ్‌ ఏజెంట్లకు అందజేస్తాం. అలాంటి ఓట్లు వేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

క్రమశిక్షణ చర్యలు తప్పవు..: ‘వాలంటీర్లు, ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 900 మంది వాలంటీర్లు, 150 మంది ఒప్పంద ఉద్యోగులను తొలగించాం. 120 మంది ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోగా, 51 మందిని సస్పెండ్‌ చేశాం. ఈసీఐ ప్రత్యేక పరిశీలకులు తిరుగుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఘటనపైనా పరిశీలించి వివరాలు తీసుకున్నారు. ఎన్నికల నిబంధనల అతిక్రమణపై ఫిర్యాదు వస్తే 24 గంటల్లో పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ఇందుకు జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీలదే బాధ్యత. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులకు సైతం నోటీసులు ఇచ్చాం. వాలంటీర్లు రాజీనామా చేయాలని నేతలు పిలుపునివ్వడం అతిక్రమణ కిందకు రాదు’ అని ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో గత ఎన్నికల్లో 79.8 శాతం ఓటింగ్‌ ఉంది. ఈ ఎన్నికల్లో 82 శాతం పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని