వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవు

వైకాపా పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 04:22 IST

గంజాయి మత్తులో అఘాయిత్యాలు
‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి ధ్వజం

తిరువూరు, విస్సన్నపేట, బొల్లాపల్లి, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లో కూడా దొరుకుతున్న గంజాయి మత్తులో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, వీటిని కట్టడి చేయడంలో విఫలమైన సీఎం జగన్‌ను ఇంటికి పంపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ, ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల, పోలిశెట్టిపాడు, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లల్లో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులను అందించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొండపర్వ ప్రధాన కూడలి వద్ద, రేమిడిపల్లిల్లో జరిగిన కార్యక్రమాల్లో భువనేశ్వరి మాట్లాడారు. వైకాపా పాలనలో మహిళలు బయటకు వెళితే తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో పెరిగిన ఆడపిల్లల ఆత్మహత్యలు తమ గొప్పేనని వైకాపా నేతలు ప్రచారం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే మహిళలకు రక్షణ ఉంటుందని తెలిపారు. ప్రజల రాజ్యం రావాలనే ఆకాంక్షతోనే తెదేపా, జనసేన, భాజపా పొత్తు పెట్టుకున్నాయని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాడు ప్రాంతానికి తాగునీరు అందిస్తారని, పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో తెదేపా పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులు కేశినేని శివనాథ్‌ (చిన్ని), కె.శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు తిరువూరులో ‘నిజం గెలవాలి’ ముగింపు సభ

నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ ముగింపు సభ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో శనివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. పట్టణంలోని దారా పూర్ణయ్య టౌన్‌షిప్‌లో సభావేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుగాను భువనేశ్వరి శుక్రవారం రాత్రి తిరువూరులోనే బస చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని