అక్రమాలపై కొరడా ఝుళిపించండి

‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) క్రియాశీలంగా వ్యవహరించాలి.

Published : 13 Apr 2024 04:23 IST

విచక్షణాధికారాలతో సీఈవో క్రియాశీలంగా వ్యవహరించాలి
మేలో పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలి
రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా అనుమతించొద్దు
విశాఖలో కేంద్ర ఎన్నికల పరిశీలకుడికి సీఎఫ్‌డీ విన్నపం

ఈనాడు, విశాఖపట్నం: ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) క్రియాశీలంగా వ్యవహరించాలి. తన విచక్షణాధికారాలను ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని సమయం, సందర్భాన్ని బట్టి కఠినంగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సూచించారు. ఎన్నికల్లో అక్రమాలపై కొరడా ఝుళిపించాలన్నారు. ‘ప్రభుత్వ సలహాదారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని సీఈవో దృష్టికి తీసుకెళితే వివరణ కోరామని ఆయన తెలిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామంటే కుదరదు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’ అని నిమ్మగడ్డ గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్‌ మిశ్రాతో మాజీ సీఎస్‌, సీఎఫ్‌డీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విశాఖలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు, క్షేత్రస్థాయి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

‘పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చాక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు అష్టకష్టాలు పడ్డారు. ఏప్రిల్‌లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మే 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ సజావుగా అయ్యేలా ఏర్పాట్లు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మార్గదర్శకాలివ్వాలి’ అని కేంద్ర ఎన్నికల పరిశీలకుడిని కోరినట్లు నిమ్మగడ్డ వివరించారు. ‘ఎన్నికల సమయంలో ఎవరి ఆదేశాల కోసమో నిరీక్షించకుండా పాలన సక్రమంగా జరిగేలా సీఎస్‌ చూడాలి. మొన్న పింఛన్ల పంపిణీలో చేదు సంఘటనలు చోటు చేసుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. 300 మంది చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే జరిగితే వారందరికీ పరిహారమివ్వాలి. సీఎఫ్‌డీ ఎన్నడూ వాలంటీర్లను తప్పుపట్టలేదు. రాజకీయ ప్రయోజనాలకు పనిచేయొద్దని మాత్రమే చెప్పింది. వాలంటీర్ల గురించి అధికార, ప్రతిపక్షాల ప్రకటనలను సమర్థించడం లేదు’ అని ఆయన చెప్పారు. 

ప్రభావితం చేస్తారు?

‘వాలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనాలని రెవెన్యూ మంత్రి అన్నారు. ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం వాలంటీర్ల నియామకంపైనేనని జగన్‌ చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేసి వైకాపా తరఫున పోలింగు ఏజెంట్లుగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారు కేంద్రాల్లో కూర్చుంటే పింఛనుదారులను ప్రభావితం చేసే అవకాశముంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లను పోలింగు ఏజెంట్లుగా అనుమతించవద్దని కోరాం’ అని రమేశ్‌కుమార్‌ వివరించారు. ‘వైకాపా ప్రభుత్వం కొందరికి దొడ్డిదారిలో ప్రభుత్వ సలహాదారులుగా కేబినెట్‌ హోదా కల్పించింది. వారు ప్రభుత్వ వేతనం పొందుతూ అధికార పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఎన్నికల నియమావళికి విరుద్ధం. వారు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు విఘాతం కల్పిస్తారని కేంద్ర ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేశాం’ అని రమేశ్‌కుమార్‌ తెలిపారు. 

సీఎస్‌దే బాధ్యత

‘ఎన్నికల సమయంలో యంత్రాంగాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించకూడదంటే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. సీఎం ఆదేశాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే అది చట్టరీత్యా సమర్థనీయం కాదు. పింఛన్ల పంపిణీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉండడంతోనే సీఎఫ్‌డీ మాట్లాడింది. వృద్ధులు, మహిళలకు పింఛన్లు ఇవ్వొద్దని చెప్పలేదు’ అని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని