ఎన్ని మొట్టికాయలు వేయాలి జగన్‌?

రాయలసీమ రైతులకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. దీని ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని 6.38 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది లక్ష్యం.

Updated : 13 Apr 2024 06:07 IST

వైకాపా పాలనలో పడకేసిన హంద్రీనీవా పనులు
చాలినన్ని నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి
ఉరవకొండలో ఇచ్చిన హామీలు హుష్‌కాకి
డిస్ట్రిబ్యూటరీల పనులకూ దిక్కులేదు
జగన్‌ జమానాలో రాయలసీమ విఫలగాథ!
ఈనాడు, అమరావతి

నాడు ప్రతిపక్ష నేత హోదాలో...
పాదయాత్రలో మాయమాటలు చెప్పారు...  
రాయలసీమ రైతులకు ఆశలు కల్పించారు...
లోగిళ్లలోకి కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు...
పిల్ల కాలువలను పూర్తి చేస్తామన్నారు...
ఎంతగానో నమ్మి అధికారం అప్పగిస్తే...
వారికి జగన్‌ నమ్మకద్రోహం చేశారు....
కీలక ప్రాజెక్టునూ ఓ విఫలగాథగా మిగిల్చారు!


హంద్రీనీవాను పూర్తి చేయకుంటే రైతులు, దేవుడు మొట్టికాయలు వేస్తారు.

ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోతే మా పోరాటం ఆపేది లేదు. మన ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల సమయం ఇవ్వండి. హంద్రీనీవాను నిర్మించి  ఆయకట్టుకు నీరిస్తాం. ప్రాజెక్టు తొలిదశలో మిగిలి పోయిన డిస్ట్రిబ్యూటరీల  పనులను పూర్తి చేసి, ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తాం.

 అనంతపురం జిల్లా ఉరవకొండలో 2017 ఫిబ్రవరి 6న నిర్వహించిన మహాధర్నాలో జగన్‌ హామీ


రాయలసీమ రైతులకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. దీని ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని 6.38 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది లక్ష్యం. శ్రీశైలం జలాశయంలోని నీటిని వివిధ దశల్లో ఎత్తిపోసి మొత్తం 40 టీఎంసీలను వినియోగించాలనేది ప్రణాళిక. తొలిదశలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలకు, రెండో దశలో ఉమ్మడి అనంతపురంలో 2,27,000 ఎకరాలకు, కడపలో 37,500 ఎకరాలకు, చిత్తూరులో 1,40,000 ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలి. ఈ పథకానికి ఎన్టీఆర్‌ హయాంలో రూపకల్పన చేయగా రాష్ట్ర విభజన తర్వాత... చంద్రబాబు హయాంలో 2019 నాటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌ తన అయిదేళ్ల పరిపాలనా కాలంలో మిగిలిన కొద్దిపాటి పనులను చేయలేక చేతులెత్తేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై పదేపదే మాట్లాడిన వ్యక్తే... అధికారంలోకి వచ్చాక వదిలేశారు. పైగా కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను ఇచ్చినట్లుగా సినిమా సెట్టింగు వేసి హడావుడి చేశారు. అక్కడికి నీళ్లు తరలించేందుకు అనంతపురం జిల్లాకు సాగునీటిని అందించకుండా పంటలను  ఎండబెట్టారు. హంద్రీనీవాను నిర్మించకుంటే రైతులు మొట్టికాయలు వేస్తారని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్‌ స్వయంగా హెచ్చరించారు. అందుకే ఈ ఎన్నికల్లో అదే సమాధానం చెప్పేందుకు సీమ ప్రజలు సిద్ధమవుతున్నారు.

కేవలం లక్ష ఎకరాలకు తగ్గ పనులే!

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.... చంద్రబాబు హయాంలో తొలిదశలో ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారో ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల ముందు ఉరవకొండలో ధర్నా చేస్తూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రిబ్యూటరీలను నిర్మించేసి, ఆయకట్టుకు నీళ్లు ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే, అధికారిక లెక్కల ప్రకారం చూసినా... నాలుగు జిల్లాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా మాత్రమే పనులయ్యాయి. పైగా వాటిలో సింహభాగం 2019 నాటికే పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో 42,982 ఎకరాలు, అనంతపురంలో 20,000 ఎకరాలు, చిత్తూరులో 16,952 ఎకరాలు, కడప జిల్లాలో 25,649 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా వ్యవస్థ సిద్ధమైందని పేర్కొంటున్నారు. ఈ ఆయకట్టుకూ పూర్తిస్థాయిలో నీరందించే పరిస్థితులు లేవు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2020 జులైలో కొన్ని పనుల ప్యాకేజీలను రద్దు చేశారు. వాటికి మళ్లీ అంచనాలు పెంచి తన వాళ్లకు పనులు అప్పగించే ప్రయత్నాలు సాగించారు.

తొలిదశ డిస్ట్రిబ్యూటరీలకే దిక్కు లేదు

తొలిదశలో కృష్ణగిరి జలాశయంలో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216 టీఎంసీలు, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీలు నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80 వేల   ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. ఈ ఆయకట్టు కోసం 14 టీఎంసీల వరకు నీటిని వినియోగించాలి. జగన్‌ వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. శ్రీశైలం జలాశయంలో నిండుగా నీళ్లున్నా  ఆయకట్టుకు అందించలేని విఫల సర్కారుగా మిగిలిపోయింది. ఉప, పిల్ల కాలువల్లో కంప చెట్లు పెరిగిపోయాయి. మట్టి పూడుకుపోయింది. తట్టెడు మట్టి ఎత్తిపోసింది లేదు. దాంతో రైతులు... తమ సొంత ఖర్చులతో ప్రధాన కాలువల వద్ద మోటార్లు పెట్టుకుని, వాటి నుంచి పైపులు వేసుకుని, దూరంగా ఉన్న తమ పొలాలకు నీటిని పంపింగ్‌ చేసుకుంటున్నారు.


ఇచ్చిన నిధులూ ఖర్చు చేయలేదు..

జగన్‌ వచ్చాక... ప్రతి ఏటా బడ్జెట్‌లో కావాల్సినన్ని నిధులు కేటాయించలేదు. ఇచ్చిన వాటినీ పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. 2019-20లో రూ.232.66 కోట్లు, 2020-21లో రూ.240.50 కోట్లు, 2021-22లో రూ.31.31 కోట్లు, 2022-23లో రూ.542.87 కోట్లు, 2023-24 డిసెంబరు వరకు రూ.172 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జీతాలు, నిర్వహణ ఖర్చులు, పాత బిల్లుల చెల్లింపులూ కలిసి ఉన్నాయి.  


రూ.75 కోట్లనూ ఇవ్వలేని దుస్థితి

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కాలువను 553 కిలోమీటర్ల పొడవున తవ్వారు. ఈ కాలువ మీద ఉన్న శ్రీనివాసపురం, అడివిపల్లి జలాశయాల ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాలి. మేజర్‌ పనులు ఎప్పుడో పూర్తయినా జగన్‌ హయాంలో చిన్నచిన్న పనులనూ చేయకపోవడంతో చిత్తూరు జిల్లాలోని చివరి జలాశయానికి నీళ్లు చేరడం లేదు. ఈ జిల్లాలో పెండింగు పనుల పూర్తికి రూ.75 కోట్లు విడుదల చేయాలని అధికారులు కోరినా ప్రభుత్వం ఇవ్వని కారణంగానే ఈ దుస్థితి నెలకొంది.


కుప్పానికి నీళ్లు ఇవ్వడంలో నాటకీయత

పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో 2019 నాటికే ఈ పనుల్లో సింహభాగం కొలిక్కి వచ్చాయి. మిగిలినవి పూర్తి చేసి నీళ్లు అందించడం సులభమే. మధ్యలో ఉన్న కొన్ని పనులు సరిగా చేయలేదు. శ్రీశైలంలో నీళ్లున్న రోజుల్లోనూ వాటిని ఆయకట్టుకు అందించలేకపోయారు. కుప్పం కాలువకు నీళ్లు    ఇస్తున్నట్లు... ముఖ్యమంత్రి జగన్‌ వచ్చి సినిమా సెట్టింగులా ఏర్పాటు చేసి నీళ్లు వదిలి వెళ్లారు. ఆ తర్వాత నుంచి కాలువలో నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. మదనపల్లె వద్ద కాలువల్లో   లీకేజీలు అరికట్టాల్సి ఉంది. పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువలకు ఎక్కువ నీటిని వదిలితే గండ్లు పడతాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు