తెలంగాణకు 8.5.. ఏపీకి 5.5 టీఎంసీలు

తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి తెలంగాణ  8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది.

Updated : 13 Apr 2024 06:51 IST

కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం
నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వాదనలు
తాగునీటి పేరుతో ఏపీ సాగుకు ఉపయోగిస్తోంది: తెలంగాణ
కేటాయింపులకు మించి తెలంగాణ తీసుకుంటోంది: ఏపీ

ఈనాడు, హైదరాబాద్‌: తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి తెలంగాణ  8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ మేరకు కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వాస్తవంగా ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని డిమాండ్‌ చేయగా కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్‌ సెక్రటరీ డీఎం రాయిపురే, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది అక్టోబరులో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో శ్రీశైలం, సాగర్‌ల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు కేటాయించిన నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.

తెలంగాణ అదనంగా తీసుకుందని ఏపీ ఆరోపణ

అక్టోబరులో తెలంగాణకు కేటాయించిన కోటా కన్నా 11 టీఎంసీలు ఎక్కువగా ఆ రాష్ట్రం వినియోగించుకుందని ఏపీ ఆరోపించింది. ఇప్పుడు అదనంగా 10 టీఎంసీలు అడగడం సబబు కాదని పేర్కొంది. తాము కేటాయింపులకన్నా తక్కువే వినియోగించుకున్నామని, ఇంకా ఐదు టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేసింది. తెలంగాణ స్పందిస్తూ..‘‘రాష్ట్ర పరిధిలో కృష్ణా పరీవాహకంలో ఎక్కువ జనాభా ఉంది. హైదరాబాద్‌ మహానగరంతోపాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు బేసిన్‌ పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు ముడిపడి ఉన్నాయి. ఏపీలో బేసిన్‌ పరిధిలోని 17 లక్షల జనాభాకే తాగునీరు అందాల్సి ఉందని’’ పేర్కొంది. సాగర్‌ జలాలను తాము తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నామని తెలిపింది.

చెరువుల్లోకి ఎత్తిపోయడంపై అభ్యంతరం

ఏపీలో చెరువులన్నీ ఎండిపోయాయని, రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, ఈ కారణంగా పంటలకు విరామం ప్రకటించామని ఆ రాష్ట్రం పేర్కొంది. పులిచింతల కింద ఇబ్బందులు ఉన్నాయని, ఆ జలాశయానికి నీటిని విడుదల చేయాలని కోరింది. సాగర్‌ నుంచి విడుదల చేసిన నీటిని కాలువలపై మోటార్లు పెట్టి చెరువుల్లోకి ఎత్తిపోసుకుంటున్నామని, ఆ నీటినీ తాగు అవసరాలకే వినియోగించుకున్నామంది. తెలంగాణ స్పందిస్తూ.. సాగర్‌ నుంచి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేసిన సందర్భంలో కాలువ పొడవునా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామని, మోటార్లతో తోడటం..చెరువులు నింపడం వంటివి జరక్కుండా చూశామని స్పష్టంచేసింది. ఏపీ మాత్రం కాలువల్లోని నీటిని చెరువుల్లోకి ఎత్తిపోస్తోందని ఆరోపించింది. నీటి ఎద్దడి కారణంగా రాష్ట్రంలో పంటలకు విరామం ప్రకటించామని, అదే తరుణంలో తాగునీటి అవసరాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏడాది 200 టీఎంసీలను తరలించిందని, ఆ నీటిని సాగుకు వినియోగిస్తోందని వాదించింది. పులిచింతల నుంచి ఈ ఏడాది 57 టీఎంసీల మేర ఏపీ వినియోగించిందని, మళ్లీ ఇప్పుడు నీళ్లు అడుగుతోందని ఆక్షేపించింది.

వినియోగం లెక్కలపై పట్టు..

ప్రస్తుతం ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు అడుగుతున్నందున శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తెలంగాణ తమ కోటా కన్నా ఎక్కువగానే వినియోగించుకుందని ఆయన పేర్కొనగా.. తెలంగాణ అభ్యంతరం తెలిపింది. జూన్‌ నుంచి రెండు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం లెక్కలు తీస్తే ఏ రాష్ట్రం లెక్కకు మించి వినియోగించుకుందో స్పష్టత వస్తుందని సూచించింది. బోర్డు ఆ రాష్ట్రంలో నీటి వినియోగంపై పరిశీలన చేయాలని కోరింది. తెలంగాణకు ప్రత్యేకంగా రిజర్వాయర్లు లేని కారణంగా గతేడాది క్యారీ ఓవర్‌ కింద ఉన్న 18.7 టీఎంసీలు ఉమ్మడి జలాశయాల్లోనే ఉండిపోయాయని, ఏపీ మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించి నిల్వ చేసుకుందని ఆరోపించింది.

500 అడుగుల నుంచి తీసుకునేందుకు నిర్ణయం

తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ఇరు రాష్ట్రాలకు ఈ సందర్భంగా బోర్డు సూచించింది. సాగర్‌ నుంచి గరిష్ఠంగా నీటిని తోడుకునే స్థాయి (ఎండీడీఎల్‌) 510 అడుగులు కాగా, 500 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. ‘ప్రస్తుతం జలాశయంలో 510.53 అడుగుల వద్ద 132.86 టీఎంసీలు ఉన్నాయి. 500 అడుగులకుపైన 17.55 టీఎంసీలు అందుబాటులో ఉండనున్నాయి. మే నెల వరకు రెండు రాష్ట్రాల అవసరాలకు 14 టీఎంసీలను వినియోగించుకోవాలి. మిగులు 3.55 టీఎంసీలను భవిష్యత్‌ అవసరాలకు మినహాయించాలి’ అని నిర్దేశించింది. మొత్తంగా శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదలకూడదని త్రిసభ్య కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. మే నెలలో మరోమారు సమావేశం నిర్వహించి అప్పటి పరిస్థితులను అంచనా వేయాలని నిర్ణయించింది. నల్గొండ సీఈ అజయ్‌కుమార్‌, కృష్ణా బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సల్లా విజయ్‌కుమార్‌, ఈఈ విజయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని