మెట్ట రైతు చేతిలో.. మొట్టికాయలకు సిద్ధమా?

ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో, సీఎం అయ్యాక అధికారిక హోదాలో జగన్‌ మెట్ట ప్రాంతమైన ఎన్టీఆర్‌ జిల్లా అభివృద్ధికి అనేక హామీలిచ్చారు.

Published : 13 Apr 2024 04:39 IST

పెళ్లిరోజు కానుక వేదాద్రికీ దిక్కు లేదు
కాంట్రాక్టు కార్మికుల బతుకులు మారలేదే!
రాష్ట్ర నడిబొడ్డు బెజవాడపై మీ ముద్రేది?
ఐదేళ్ల నాటి హామీలు గుర్తున్నాయా?
నేడు పశ్చిమ కృష్ణాలో జగన్‌ బస్సు యాత్ర

ఈనాడు, అమరావతి: ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో, సీఎం అయ్యాక అధికారిక హోదాలో జగన్‌ మెట్ట ప్రాంతమైన ఎన్టీఆర్‌ జిల్లా అభివృద్ధికి అనేక హామీలిచ్చారు. మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టు స్థిరీకరిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో శిలాఫలకాలు వేసి ఆశలు రేపారు. ఐదేళ్ల పాలన ముగుస్తున్న వేళ ఆ ఆశలు అడియాసలై అన్నదాతల్లో ఆగ్రహం ఉబికివస్తోంది. ఒక్క రైతులకే కాదు, ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ బాధితులు, వీటీపీఎస్‌లోని ఒప్పంద కార్మికులు, విజయవాడ నగరవాసులు, బెజవాడ దుర్గమ్మ భక్తులకు జగన్‌ ఇవ్వని హామీ లేదు. ఐదేళ్లలో నెరవేర్చిందీ లేదు. జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర, మామిడి పరిశోధన కేంద్రం, ఉద్యాన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం వంటి ప్రకటనలన్నీ వాగ్దానభంగాలే. ‘మేమంతా సిద్ధం’ అంటూ శనివారం పశ్చిమ కృష్ణాకు బస్సుయాత్రగా వస్తున్న జగన్‌కు.. గత హామీల తాజా స్థితిని గుర్తుచేస్తూ..

క్రమబద్ధీకరణకు ఐదేళ్లూ చాలలేదా?

విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎస్‌ (వీటీపీఎస్‌)లో దాదాపు 4వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరిలో కొందరు రోజువారీ వేతనజీవులు కాగా, మరికొందరు ఒప్పంద ఉద్యోగులు. 2018లో పాదయాత్రలో భాగంగా వీటీపీఎస్‌ ప్రాంతానికి వచ్చిన జగన్‌.. తాను సీఎం అయ్యాక అందరినీ క్రమబద్ధీకరిస్తానని ఒప్పంద కార్మికులకు హామీ ఇచ్చారు. నిజమేనని నమ్మిన వారు.. స్థానిక ఎమ్మెల్యేతో కలసి సీఎం జగన్‌ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంటూ ఇవ్వలేదు. ఒక్క కార్మికుడూ పర్మినెంట్‌ కాలేదు. నేటికీ వీటీపీఎస్‌ బూడిదలో అదే తీరున మగ్గుతున్నారు. తెలంగాణ జెన్‌కోలోని కాంట్రాక్టు కార్మికులను అక్కడి ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగులుగా పరిగణిస్తూ, వేతనాలు పెంచింది.

సాగర గోస తీర్చలే

తెలంగాణతో మాట్లాడి సాగర్‌ ఎడమ కాలువకు నీరు తెస్తానని 2019లో తిరువూరులో జగన్‌ హామీ ఇచ్చారు. ఈ కాలువ కింద 300 చెరువులను ఆధునికీకరించి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా మారుస్తామన్నారు. నిజానికి సాగర్‌ ఆయకట్టు ఏటా ఎండిపోతోంది. ఈ ఏడాది పంట విరామం ప్రకటించారు. ఎడమ కాలువ నీరు తెలంగాణ సరిహద్దుల్లోనే ఆగిపోతోంది. 2015లో చంద్రబాబు ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా, జగన్‌ సీఎం అయ్యాక పనులు నిలిపివేయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 210 గ్రామాలకు తాగునీరు అందించే ఈ పథకాన్ని గత ప్రభుత్వం రూ.4,900 కోట్లతో చేపట్టి, రూ.3 వేల కోట్లు వెచ్చించింది. ఆ బిల్లులూ చెల్లించలేదు. సాగు, తాగునీరు లేక తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు నియోజకవర్గాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

కిడ్నీ బాధితులపై కనికరమేది?

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతం. అక్కడ నాలుగేళ్లలో దాదాపు 250 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోయారు. మరో ఉద్దానంగా మారింది. తిరువూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం జగన్‌.. ఇక్కడ శుద్ధజలం సరఫరాకు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులో ఒక మండలానికి రూ.50 కోట్లు అంటే పెద్ద పద్దేమీ కాదు. కానీ పేదలు, గిరిజనులు ఉండే ఆ ప్రాంతంపై జగన్‌కు మనసు రాలేదు. మరణమృదంగం ఆగలేదు.

అభివృద్ధి ఎవరిది? బాకా ఎవరిది?

విజయవాడలో బైపాస్‌ రోడ్డు, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌, కనకదుర్గ పైవంతెన తన కృషి ఫలితమేనని ఇటీవల జగన్‌ ప్రకటించారు. వాస్తవానికి ఇవి 2014-19 మధ్య అప్పటి ఎన్డీయే ప్రభుత్వం మంజూరు చేసి, ప్రారంభించిన ప్రాజెక్టులు. అప్పట్లో చంద్రబాబు అధికారులతో నిత్యం సమీక్షించి, పట్టాలెక్కించిన పనులను జగన్‌ తన ఖాతాలో వేసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్‌ను గెలుచుకున్న సందర్భంగా వైకాపా కార్పొరేటర్లు సీఎంను కలవగా, నగర అభివృద్ధికి రూ.150 కోట్లు ప్రకటించి, నయా పైసా ఇవ్వలేదు.

అమ్మవారిపైనా చిన్నచూపే

విజయవాడ కనకదుర్గమ్మపైనా ఈ ప్రభుత్వానికి చిన్నచూపే. వెలంపల్లి శ్రీనివాస్‌ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ‘సీఎం నిధుల వరద పారిస్తున్నారు. దుర్గగుడి రూపురేఖలు మార్చేస్తున్నాం. రూ.70 కోట్లతో కార్యాచరణ ప్రారంభించామ’న్నారు. వాస్తవానికి ఒక్క రూపాయీ రాలేదు. తర్వాత రూ.220 కోట్లతో ప్రణాళిక సిద్ధమన్నారు. అదీ అంతే! మరో రూ.150 కోట్లతో ఆధునికీకరణ అన్నారు. ఇటీవల రూ.33 కోట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. దుర్గగుడి ఆదాయాన్ని పక్కదారి పట్టించారు.


మళ్లీమళ్లీ మీ పెళ్లి రోజులు.. మరి నీళ్లేవి?

జగ్గయ్యపేట నియోజకవర్గ రైతుల కడగండ్లు తీర్చేందుకు 2019లో నాటి సీఎం చంద్రబాబు కృష్ణా నది నీటిని తోడిపోసేలా ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. జగన్‌ సీఎం అయ్యాక తన పెళ్లిరోజు కానుక అంటూ 2020 ఆగస్టు 28న ఇదే పథకానికి ‘వైఎస్సార్‌ వేదాద్రి’గా పేరు మార్చి వేదాద్రి వద్ద వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మించి తన పెళ్లిరోజు కానుకగా 38,500 ఎకరాలను సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. రూ.312 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థ మేఘా కేవలం రూ.5 కోట్ల విలువైన పనులుచేసి, నిలిపేసింది. నాలుగేళ్లుగా అతీగతీ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని