పోలీసు యాప్‌లకు రాం రాం!

‘దిశ యాప్‌ ఉంటే అన్న మీ వెంట ఉన్నట్లే..’ అని ముఖ్యమంత్రి జగన్‌ తరచూ ప్రచారం చేసుకుంటారు. ఆపదలో ఉన్న మహిళలు, యువతులను ఆదుకునేందుకే దిశ యాప్‌ను తీసుకొచ్చినట్లు తెగ చెబుతుంటారు.

Updated : 13 Apr 2024 05:57 IST

నిలిచిన పోలీసు సేవాయాప్‌
ప్లే స్టోర్‌ నుంచీ తొలగింపు
దిశ యాప్‌నకూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం
ఏజెన్సీలకు నిర్వహణ వ్యయం చెల్లించని ఫలితం

ఈనాడు, అమరావతి: ‘దిశ యాప్‌ ఉంటే అన్న మీ వెంట ఉన్నట్లే..’ అని ముఖ్యమంత్రి జగన్‌ తరచూ ప్రచారం చేసుకుంటారు. ఆపదలో ఉన్న మహిళలు, యువతులను ఆదుకునేందుకే దిశ యాప్‌ను తీసుకొచ్చినట్లు తెగ చెబుతుంటారు. ఈ యాప్‌నకు నాలుగు అవార్డులు వచ్చాయని కూడా చెప్పుకొంటారు. ఇవన్నీ కేవలం ప్రచారం కోసమే అన్నట్లుంది ముఖ్యమంత్రి వైఖరి. ఇంత గొప్పగా చెబుతున్న ఈ యాప్‌ త్వరలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఏడాది దాటినా దీని వార్షిక నిర్వహణ వ్యయాన్ని విడుదల చేయకపోవడమే కారణం. ఇప్పటికే పోలీసు సేవా యాప్‌ నిలిచిపోయింది. పోలీసు డేటా సెంటర్‌లో సర్వర్ల నిర్వహణ, తదితర అంశాల బిల్లులనూ వైకాపా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. తమ పార్టీకి నిధులు ఇచ్చిన కంపెనీలకు బిల్లులు మంజూరు చేయడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజోపయోగ అవసరాలకు సంబంధించిన బిల్లులకు నిధులు మంజూరు చేయడంలో కనిపించడం లేదు.

ప్లేస్టోర్‌ నుంచి పోలీసు సేవా యాప్‌ తొలగింపు

ముఖ్యమంత్రి జగన్‌ పోలీసు సేవా యాప్‌ను సెప్టెంబరు, 2020లో ప్రారంభించారు. పోలీసులు, ప్రజలకూ మధ్య అనుసంధానంగా ఇది ఉపయోగపడుతుందని తెచ్చారు. ఇందులోకి సామాన్యులు కూడా లాగిన్‌ అయి.. ఫిర్యాదును నమోదు చేయడంతో పాటు, ఎఫ్‌ఐఆర్‌ సమాచారం, పోలీసు సేవలు, ఈ-చలాన్లు, తప్పిపోయిన వారి వివరాల కోసం ఉపయోగించుకునే వీలుంది. ఎంతో ఉపయోగకరమైన ఈ-యాప్‌ను రూపొందించిన ఏజెన్సీకి నిర్వహణ వ్యయం ఆరు నెలల నుంచి విడుదల చేయలేదు. ఇటీవల ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను తొలగించారు. ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి ఫోన్లలో యాప్‌ పనిచేయడం లేదు.

తర్వాత వంతు.. ‘దిశ’ యాప్‌దేనా?

ఆపద సమయాల్లో మహిళల భద్రత కోసం ‘దిశ’ యాప్‌ను 2020, ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున పోలీసులకు లక్ష్యాన్ని పెట్టి మరీ మహిళలతో ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్లు చేయించారు. ఇప్పటి వరకు దాదాపు కోటిన్నర డౌన్‌లోడ్లు అయ్యాయి. దీనికి కూడా జగన్‌ ప్రభుత్వం అరకొరగా నిధులను విడుదల చేస్తోంది. వార్షిక నిర్వహణ వ్యయం చెల్లించాల్సిన గడువు దాటి ± 16 నెలలు అయింది. దీంతో త్వరలో దిశ యాప్‌ కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏడాదికి రూ.6 లక్షలు కూడా చెల్లించలేని దుస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యాప్‌ ఆగిపోతే మహిళలకు జగన్‌ ఏం సమాధానం చెబుతారు?

రెండేళ్లైనా ‘దిశ’ వాహనాలకు డబ్బులివ్వలేదు

ఆపద సమయంలో మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన దిశ పెట్రోలింగ్‌ వాహనాలను 2022 మార్చిలో సీఎం  ప్రారంభించారు. రూ. 14 కోట్లు వెచ్చించి 163 వాహనాలను కొనుగోలు చేశారు. వీటిని కొని రెండేళ్లు దాటినా ఇంత వరకు ఆ కంపెనీకి డబ్బులు చెల్లించలేదు.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా  లెక్కలేదు

అన్ని పోలీసుస్టేషన్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్టేషన్లలో పారదర్శకత కోసం వీటిని పెట్టాలని ఆదేశించింది. తీర్పు అమలులో భాగంగా ఒక్కో స్టేషన్‌లో 8 నుంచి 12 కెమెరాలు చొప్పున బిగించారు.  రెండో విడతలో భాగంగా గత ఏడాది రాష్ట్రంలో 372 పోలీసుస్టేషన్లలో బిగించిన సీసీ కెమెరాలకు కూడా డబ్బులు చెల్లించలేదు. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా.. గుత్తేదారు పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 169 స్టేషన్లలో సీసీ కెమెరాలు మొరాయించాయి.


పోలీసు డేటా సర్వర్లదీ ఇదే దారి?

మంగళగిరిలో ఉన్న పోలీసుడేటా సెంటర్‌ చాలా కీలకమైంది. ఇందులో రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలో నమోదు చేసే కేసులు, నేరస్థుల వివరాలు డేటా సెంటర్‌లోని సర్వర్లలో నమోదు అవుతుంది. అయితే ఇక్కడ సర్వర్ల నిర్వహణకు డబ్బు చెల్లించేందుకు గడువు దాటి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఈ డబ్బు కూడా చెల్లించలేదు. ఈ సర్వర్లు ఆగిపోతే.. ఆన్‌లైన్‌ సేవలన్నీ స్తంభించే ప్రమాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని