ఏపీలో అర్ధరాత్రి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసింది. సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్న మెయిన్స్‌ పరీక్షలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.

Updated : 14 Apr 2024 16:41 IST

మెయిన్స్‌కు 4,496 మంది ఎంపిక

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసింది. సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్న మెయిన్స్‌ పరీక్షలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. గతేడాది డిసెంబరులో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా 81 గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ట్యాంపరింగ్‌, ఓఎంఆర్‌ షీట్‌పై బుక్‌లెట్‌ సీరియల్‌ నంబర్లు లేకపోవడం, మల్టిపుల్‌ బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్లు నమోదు చేయడం వంటి కారణాలతో 567 మంది జవాబుపత్రాలను మూల్యాంకనం చేయకుండా తిరస్కరించినట్లు వెల్లడించింది. ఫలితాలతో పాటు ఫైనల్‌ ‘కీ’ సైతం విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఏపీపీఎస్సీ ఈ ఫలితాలను ప్రకటించడం గమనార్హం. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను రాత్రి 1.40 గంటలకు జారీ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.

1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి: నిరుద్యోగ జేఏసీ

గ్రూప్‌-2 మాదిరిగానే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో కూడా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ డిమాండ్‌ చేశారు. ‘గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు ఏపీపీఎస్సీ ఇచ్చిన సమయం తక్కువగా ఉంది. తొలుత చెప్పినట్లు కొత్త సిలబస్‌ కాకుండా చివర్లో పాత సిలబస్‌తో ప్రిలిమ్స్‌ నిర్వహించడం వల్ల అభ్యర్థులు వెనకబడ్డారు. ముఖ్యంగా తెలుగు మాధ్యమం వారు నష్టపోయారు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని