సొంతిల్లు.. గుండె గుబిల్లు

ఎవరికైనా సొంతిల్లు ఒక కల... నెరవేర్చుకునేందుకు అహరహం శ్రమిస్తారు... నిర్మాణం చేపట్టి పూర్తి చేసే వరకు... పదుగురికి ఉపాధి చూపుతారు...ఇలాంటి వారికి ప్రభుత్వాలేవైనా చేదోడుగా నిలుస్తాయి... జగన్‌ది రివర్స్‌ పాలన కదా... చేయూత ఇవ్వడం అటుంచి... ఖజానా నింపుకొనేందుకు భారీగా పిండుకున్నారు!!

Published : 14 Apr 2024 05:44 IST

ఐదేళ్లలో పన్నులు, సుంకాలను పెంచేసి బాదుడే బాదుడు
ఉచిత ఇసుకను తీసేసి అడ్డగోలుగా ధర పెంపు
కంకర, గ్రావెల్‌, గ్రానైట్‌ కొనుగోళ్లూ భారమే
ఒక ఇంటి నిర్మాణంపై అయిదేళ్లతో పోలిస్తే 4 లక్షల ఖర్చు అదనం

ఎవరికైనా సొంతిల్లు ఒక కల... నెరవేర్చుకునేందుకు అహరహం శ్రమిస్తారు...
నిర్మాణం చేపట్టి పూర్తి చేసే వరకు... పదుగురికి ఉపాధి చూపుతారు...
ఇలాంటి వారికి ప్రభుత్వాలేవైనా చేదోడుగా నిలుస్తాయి...
జగన్‌ది రివర్స్‌ పాలన కదా...
చేయూత ఇవ్వడం అటుంచి... ఖజానా నింపుకొనేందుకు భారీగా పిండుకున్నారు!!
ఇప్పుడవన్నీ మరిచి మళ్లీ ఓటేయండంటూ... ఊరూరా తిరుగుతున్నారు!!


సాధారణ, మధ్య తరగతి కుటుంబాల వారికి సొంతింటి నిర్మాణమనేది జీవితకాల లక్ష్యం. కష్టపడి సంపాదించిన సొమ్ముతోపాటు అప్పోసప్పో చేసి చిన్న స్థలం కొనుక్కుని, అందులో ఇల్లు
నిర్మించుకుంటారు. ఇలాంటి సామాన్యులను తమ కలను నెరవేర్చుకోకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మైనింగ్‌ ఫీజులన్నీ చరిత్రలో ఎన్నడూ లేనంతలా పెంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కొత్త ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లీజుదారులను అన్నివిధాలా పిండేస్తోంది. ఈ ప్రభావం ఇంటి నిర్మాణంలో వినియోగించే కంకర, గ్రావెల్‌, గ్రానైట్‌ తదితరాలపై పడి, వాటి ధరలన్నీ అమాంతం పెరిగిపోయాయి. దీనికితోడు సామాన్యులెవరూ ఇసుక కొనలేని విధంగా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. గత ప్రభుత్వంలో ఉచితంగా లభించిన ఇసుకను వైకాపా అధికారంలోకి వచ్చాక... టన్నుకు రూ.475 చొప్పున విక్రయిస్తోంది. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇదే ఇసుకను ఆధారంగా చేసుకుని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సామాన్యులకేమో దీని ధరను చూసి గుండె గుభేలుమంటోంది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం సిమెంట్‌ ధరలను నియంత్రించడం లేదు. ఐరన్‌ ధర సైతం పెరుగుతూనే ఉంది. ఇలా అన్నివిధాలా పెరిగిపోయిన ధరలతో ఇల్లు నిర్మించుకోవాలనే వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితిని జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది.


పీసీబీ ఫీజులు పెంచేసి...

కంకర క్వారీలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో) అనుమతులు తీసుకోవాలి. వీటి ఫీజులు గతంలో టర్నోవర్‌పై నామమాత్రంగా ఉండేవి. జగన్‌ ప్రభుత్వం వీటిని భారీగా పెంచేసింది. లీజు విస్తీర్ణం, ఉత్పత్తి, ప్రతి టన్నుకు చొప్పున ఫీజులను వసూలు చేసే విధానాన్ని తెచ్చారు. ఇవన్నీ అంతిమంగా సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే వారిపై ప్రభావం చూపిస్తున్నాయి.


లీజుదారులపై ఎడాపెడా వాతలు

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనింగ్‌ లీజులపై పన్నులను ఎడాపెడా పెంచింది. పొరుగున్న ఉన్న రాష్ట్రాలు లీజుదారులను ప్రోత్సహించి, మైనింగ్‌ రంగం వృద్ధి చెందేలా చేస్తే... వైకాపా ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా లీజుదారులను పూర్తిగా పిండేయడమే లక్ష్యంగా చేసుకుంది. లీజుదారులు తమపై పడిన భారాన్ని నిర్మాణదారులపై వేస్తున్నారు.

గత ప్రభుత్వంలో కంకరకు సీనరేజ్‌ ఫీజు టన్నుకు రూ.50 ఉండేది. దీనికి జిల్లా ఖనిజ నిధి(డీఎంఎఫ్‌) సుంకం 30%, ఖనిజాన్వేషణ ట్రస్టు నిధి (మెరిట్‌) సుంకం 2% కలిపి... లీజుదారుడు టన్నుకు రూ.66 చొప్పున గనుల శాఖకు చెల్లించేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత కంకరకు సీనరేజ్‌ ఫీజు టన్నుకు రూ.60 చేశారు. దీనికి అనుగుణంగానే డీఎంఎఫ్‌, మెరిట్‌ కూడా పెరగడంతో టన్ను ధర రూ.79.20కి చేరింది.

గ్రావెల్‌కు టన్ను సీనరేజ్‌ ఫీజు రూ.20, ఉండగా దానికి డీఎంఎఫ్‌, మెరిట్‌ కలిపి రూ.27 ఉండేది. దీని సీనరేజ్‌ రూ.30 చేయడంతో అంతిమంగా రూ.40 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.


కొవిడ్‌ తగ్గినా ఆగని వసూళ్లు

కొవిడ్‌ మొదటి, రెండు దశల ప్రభావం కారణంగా... ప్రభుత్వ ఖర్చుల కోసం కొత్తగా కన్సిడరేషన్‌ అమౌంట్‌ అనే సుంకాన్ని 2021 జూన్‌లో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం గ్రానైట్‌ మినహా, ఇతర ఖనిజాలకు సీనరేజ్‌ ఫీజు విలువకు అదనంగా ప్రీమియం అమౌంట్‌గా వసూలు చేయడం ఆరంభించారు. టన్ను కంకరకు రూ.60 సీనరేజ్‌ ఫీజు ఉంటే, దానికి ప్రీమియం   అమౌంట్‌గా మరో రూ.60 చెల్లించాలనే నిబంధన తెచ్చారు. దీంతో డీఎంఎఫ్‌, మెరిట్‌తో కలిపి టన్నుకు రూ.133.20 చొప్పున గనుల శాఖకు చెల్లించాల్సి వస్తోంది. గ్రావెల్‌, గ్రానైట్‌తోపాటు అన్నింటా ఇలాగే కన్సిడరేషన్‌ అమౌంట్‌ పేరిట చేస్తున్న వసూళ్లను ఇప్పటికీ ఆపలేదు. కొవిడ్‌ పరిస్థితులు పూర్తిగా తొలగిపోయాయని, ఈ భారం తగ్గించాలని లీజుదారులు ఎంతగా విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.


బాదుడే బాదుడు...

  • గత ప్రభుత్వంలో కంకర క్వారీలకు ఏడాదికి డెడ్‌రెంట్‌ హెక్టారుకు రూ.50 వేలు ఉండేది జగన్‌ వచ్చాక దాన్ని రూ.65 వేలు చేశారు.
  • కొత్తగా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద మూడురెట్ల వార్షిక డెడ్‌రెంట్‌ చెల్లించాలనే నిబంధన తెచ్చారు. ఫలితంగా లీజుదారుడు ప్రతి హెక్టారుకు రూ.1.95 లక్షలను చెల్లించాల్సి వస్తోంది.
  • కొత్త లీజుదారులు, పాత లీజును రెన్యువల్‌ చేసుకోవాలనుకునే వారూ... పది రెట్ల వార్షిక డెడ్‌రెంట్‌ను చెల్లించాలనే మరో నిబంధనను తీసుకొచ్చారు. అంటే ఒక హెక్టారులో కొత్త కంకర లీజు పొందాలన్నా, పాత లీజు రెన్యువల్‌ చేసుకోవాలన్నా తప్పనిసరిగా రూ.6.50 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఈ సొమ్మును వెనక్కి ఇవ్వరు.

అటు బాదుడు.. ఇటు పెరుగుడు

చిన్న ఇల్లు నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చు ఐదేళ్లతో పోలిస్తే రూ.4-5 లక్షలు పెరగడం గమనార్హం. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణానికి అప్పుడు రూ.13-15 లక్షలు అయ్యేది. ఇప్పుడది రూ.18-20 లక్షలకు చేరింది. నిర్మాణంలో వినియోగించే ఇసుక, కంకర, గ్రావెల్‌, ఇటుక, సిమెంట్‌, ఐరన్‌, టైల్స్‌... తదితరాల కోసం చేసే ఖర్చు అదనంగా రూ.4 లక్షలపైనే పెరిగిపోయింది. ఇందుకు జగన్‌ ప్రభుత్వం మైనింగ్‌ రంగంపై వేసిన అదనపు భారాలే ప్రధాన కారణం.

  • వెయ్యి చదరపు అడుగుల్లో నిర్మించే ఇంటికి పిల్లర్లు, స్లాబ్‌ కోసం సగటున 70 టన్నుల వరకు కంకర అవసరమవుతుంది. అయిదేళ్ల కిందట టన్నుకు రూ.300 వెచ్చిస్తే కంకర ఇంటి వద్దకు చేరేది. ఇప్పుడు టన్నుకు రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది.
  • గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉండేది. కేవలం రీచ్‌లో లోడింగ్‌కు అయ్యే ఖర్చుతోపాటు రవాణా ఛార్జీలు కలిపితే టన్నుకి రూ.300 వెచ్చిస్తే ఇంటికి ఇసుక వచ్చేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ప్రతి టన్నుకు రీచ్‌లోనే రూ.475 తీసుకుంటున్నారు. దీనికి రవాణా ఛార్జీలు కలిపి మొత్తంగా రూ.వెయ్యి భరించాల్సి వస్తోంది.
  • పునాది నిర్మించాక, అందులో నింపేందుకు ఉపయోగించే గ్రావెల్‌ గతంలో టన్నుకు రూ.100 ఖర్చయ్యేది. ఇప్పుడు టన్నుకు రూ.400 ఇవ్వాల్సి వస్తోంది.
  • ఇంటి నిర్మాణానికి 20 వేల ఇటుకల వరకు అవసరం అవుతాయి. అయిదేళ్ల కిందట ఒక ఇటుక ధర సగటున రూ.5 ఉండగా, ఇప్పుడది రూ.10కి పెరిగింది.
  • గతంలో 50 కిలోల బస్తా సిమెంట్‌ ధర రూ.200-220 ఉండేది. ఇప్పుడది ఏకంగా రూ.350కి చేరింది.
  • ఐరన్‌ కూడా టన్ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఎగబాకింది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని