ఏపీ సీఎంపైకి రాయి.. నుదుటిపై గాయం

ముఖ్యమంత్రి జగన్‌కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు.

Updated : 14 Apr 2024 09:34 IST

ఘోర భద్రతా వైఫల్యం

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్‌ శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి దగ్గర వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగిసిన తర్వాత.. భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. ‘‘జగన్‌ నుదుటికి రెండు కుట్లు పడ్డాయి. గాయం పెద్ద తీవ్రమైనది కాదు. ప్రమాదం ఏమీ లేదు. వాపు ఎక్కువగా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారు’’ అని విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు.

అంత భద్రత ఉన్నా.. ఇలా ఎలా?

ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్‌జీ), క్లోజ్‌ ప్రాక్సిమిటీ గ్రూప్‌, ఎస్కార్ట్‌, ఇన్నర్‌ కార్డన్‌, అవుటర్‌ కార్డన్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతుంది. దాడి జరిగిన ప్రాంతానికి పోలీసుస్టేషన్‌ 2 కిలోమీటర్లు, సీపీ ఆఫీసు 8 కిలోమీటర్లు, డీజీపీ ఆఫీసు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా... ప్రొటోకాల్‌ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగడం ఘోర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. భద్రతా ప్రొటోకాల్స్‌ ప్రకారం... సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంటే ఆ ప్రాంతంలో విద్యుత్తు కోత, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. అదికూడా రాత్రివేళ నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడటానికి సీఎంఎస్‌జీ ఎలా అనుమతిస్తుంది? విద్యుత్‌ సరఫరా లేనప్పుడు ఫోకస్‌ లైట్లు ఆన్‌ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్‌ చేయాలి. కానీ భద్రతా సిబ్బంది అవేవీ చేయలేదు. అత్యంత ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

  • ముఖ్యమంత్రి కదిలే సమయంలో అంతర్గత బందోబస్తు, బయట, చుట్టుపక్కల బందోబస్తు ఉండాలి. కానీ జగన్‌పైకి రాయి రువ్వినప్పుడు వారు ఎందుకు గమనించలేదు? ఎందుకు అడ్డుకోలేదు? ఏం చేస్తున్నారు?
  • స్పెషల్‌ బ్రాంచ్‌, నిఘా విభాగం సిబ్బంది ముఖ్యమంత్రి బస్సును చుట్టుముట్టి నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఎవరైనా దుండగులు రాళ్లు విసురుతుంటే ఎందుకు గమనించలేదు?
  • ముఖ్యమంత్రికి రాయి తగిలినప్పుడు సీఎంఎస్‌జీ (సీఎం సెక్యూరిటీ గ్రూపు) ఎందుకు వంగి మోకాళ్లపై నిలబడింది?
  • విద్యుత్తు కోత సమయంలో సీఎం చుట్టూ రాళ్ల వంటివి పడకుండా స్టోన్‌గార్డులు ఏర్పాటుచేయాలి. కానీ అవేవీ ఎందుకు పెట్టలేదు?
  • అనంతపురంలో ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరారు. ఆ తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. ఎందుకు చేపట్టలేదు?

ఘోర భద్రతా వైఫల్యానికి కారణం నిగ్గు తేలాలంటే సీబీఐ, ఎన్‌ఐఏ వంటి కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


జగన్‌ త్వరగా కోలుకోవాలి

ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల ఆకాంక్ష
నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరిన చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. ‘సీఎం జగన్‌ త్వరగా కోలుకోవాలి. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. ‘జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నా’ అని అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హితవు పలికారు. ‘జగన్‌ త్వరగా కోలుకోవాలి’ అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో ఆకాంక్షించారు. ‘జగన్‌పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఇది ‘కోడికత్తి డ్రామా 2.0’

‘జగన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారు. సీఎం పర్యటన జరుగుతుంటే అదే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? ఘటన జరిగాక కొద్ది నిమిషాల్లోనే పేర్ని నాని, అంబటి రాంబాబు లైవ్‌లోకి వచ్చి.. ఇదంతా చంద్రబాబు చేయించారంటూ వైకాపా అనుకూల మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళిక కాదా? కాలం చెల్లిన ఇలాంటి నాటకాల్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు’

అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు


సానుభూతి కోసమే పాకులాట

‘జరగని దాడిని జరిగినట్లు ప్రచారం చేసుకుని సానుభూతి కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు. ఇది మరో కోడికత్తి 2.0 తప్ప మరొకటి కాదు’

తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌


క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని జగన్‌ అనుకూల మీడియాకు ఎలా తెలిసింది?

‘దాడి జరిగిన నాలుగు నిమిషాల్లోనే క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని సాక్షి సహా జగన్‌ అనుకూల మీడియాకు ఎలా తెలిసింది? ఈ డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్నది వైకాపా కార్యకర్తలు, పోలీసులే. మరి నిందితుణ్ని ఎందుకు పట్టుకోలేదు? విజయవాడలో సీఎం పర్యటన ఉందని తెలిసీ విద్యుత్తు సరఫరా ఎందుకు నిలిపివేశారు? గొడ్డలి దాడి, కోడికత్తి డ్రామా అయిపోయాయి. క్యాట్‌ బాల్‌ డ్రామా మొదలుపెట్టారు’

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు


తాడేపల్లి ప్యాలెస్‌ డైరెక్షన్‌లోనే..

‘తాడేపల్లి ప్యాలెస్‌ డైరెక్షన్‌లో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ సీతారామాంజనేయులు ఆడిన నాటకంలో భాగంగానే ఈ దాడి జరిగింది. గతానుభవాల దృష్ట్యా ఈ ‘కోడికత్తి 2.0’ డ్రామాను జనం నమ్మే పరిస్థితిలో లేరు’..

వర్ల రామయ్య, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు


ఇది గులకరాయి డ్రామానా?

‘దాడి జరిగితే డీజీపీ, నిఘా విభాగాధిపతి ఏం చేస్తున్నారు? గొడ్డలివేటు, కోడికత్తి నాటకాలు అయిపోయాయి. ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్‌ తెరలేపారు. వేలమంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా? నిజంగా దాడి జరిగితే నిందితుల్ని వెంటనే పోలీసులు ఎందుకు పట్టుకోలేదు?  

వంగలపూడి అనిత, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు


ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నా..

‘‘ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌కు ప్రమాదవశాత్తు గాయమైందని భావిస్తున్నాను.. అలాకాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. జగన్‌కు గాయం కావడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది వ్యతిరేకించాల్సిందే’

వై.ఎస్‌. షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు


సిద్ధం బస్సు యాత్రకు విరామం

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌కు గాయం కావడంతో ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. దీంతో సిద్ధం బస్సు యాత్రకు ఆదివారం విరామం ప్రకటిస్తున్నామని.. తదుపరి కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని