సలహాదారులు.. జగన్మాయదారి మేతగాళ్లు!

అభివృద్ధికి నిధుల్లేవు... రహదారులకు డబ్బుల్లేవు... ప్రాజెక్టులకు పైసల్లేవు... కానీ... అప్పులు చేసి తెచ్చిన... ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును... కోట్లలో అప్పనంగా... అయినవారికి ‘సలహాల’ పేరుతో ఫలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి? జగజ్జంత్రీ అనాలా... కంత్రీ అనాలా?

Updated : 18 Apr 2024 16:55 IST

అభివృద్ధికి నిధుల్లేవు... రహదారులకు డబ్బుల్లేవు... ప్రాజెక్టులకు పైసల్లేవు... కానీ... అప్పులు చేసి తెచ్చిన... ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును... కోట్లలో అప్పనంగా... అయినవారికి ‘సలహాల’ పేరుతో ఫలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి? జగజ్జంత్రీ అనాలా... కంత్రీ అనాలా?

సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రహాసరెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వీరారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి.. ఇలా ఇంకెందరో! అందరూ మహానుభావులే.. ‘‘సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం’’ అని మహాగర్వంగా టముకేసుకునే జగన్‌ ఏలుబడిలో సలహాదారులైన వారే! అన్ని అర్హతలూ ఉండీ ఉద్యోగాల్లేక చదువుకున్న యువతీ యువకులు ఒకపక్క ఏడుస్తున్నారు. వాళ్ల ఖర్మకు వాళ్లను వదిలేసిన జగన్‌- తన మోచేతి నీళ్లకు లొట్టలేసే ప్రబుద్ధులకు ఏరికోరి సలహాదారు పదవులిచ్చారు. ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు లోగడే స్పష్టం చేసింది. అయినా సలహాదారుల పేరిట జనం సొమ్మును జగన్‌ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ‘‘సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు’’ అని హైకోర్టు తలంటినా జగన్‌ వినలేదు. ప్రజలకు పనికిరాని సలహాదారుల నియామకాలను ఆపలేదు. పొట్ట పగిలేలా ప్రజాధనాన్ని మేయడం, అయిన వారిని మేపడమే పనిగా పెట్టుకున్న ప్రజాకంటక ప్రభుత్వాధినేత జగన్‌. సామాన్యుల సంపదను ఆబగా ఆరగించి ఆనందంగా అరాయించుకోవడంలో ఆయన ముఠాయే నంబర్‌ వన్‌!


మొండి గురువు.. బండ శిష్యుడు!

‘కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు/ మొండివాని హితుడు బండవాడు/ దుండగీడునకును కొండెడు దళవాయి..’ అనే పద్యం తెలుగువారికి బాగా తెలిసిందే. మొండోడికి బండోడే మిత్రుడు, దుష్టుడికి అబద్ధాలకోరే సహాయకుడు అన్నది దాని భావం. జగన్‌- సజ్జల కాంబినేషన్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోయే పద్యమది! ప్రభుత్వ సలహాదారు పనేంటి? ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి సూచనలూ సలహాలు ఇవ్వాలి. జగన్‌ చంకలో దూరి అపరిమిత అధికారాలు చలాయించిన సజ్జల చేసిందేంటి? ‘‘పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ, సీఎం ఆదేశాలను పాటిస్తుంటాం’’ అని ఆయనే ఓసారి ఉన్న నిజం కక్కేశారు. ప్రతిపక్షాలు, వైకాపాకు గిట్టనివాళ్లపై టన్నులకొద్దీ బురదజల్లే సజ్జల- జగన్నాటక సూత్రధారులకు నమ్మినబంటు. ‘‘వివేకా హత్య కేసు విషయంలో ఇకపై ఏం చేయాలనుకున్నా సజ్జలను సంప్రదించి చేయాలని భారతి నాకు చెప్పారు’’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వై.ఎస్‌.సునీత పేర్కొన్నారు. తండ్రి పదవినే పెట్టుబడిగా మార్చుకుని జగన్‌ పోగేసిన అక్రమాస్తులపై చాలా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక దాంతో సంబంధం ఉన్న ఈశ్వర్‌ సిమెంట్స్‌ సంస్థ అప్పటి డైరెక్టర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. ఇదీ జగన్‌కూ సజ్జలకు ఉన్న జోగీ జోగీ సంబంధం! తనకు మద్దెల కొట్టడంలో అందరి కంటే ముందుండే సజ్జలను సలహాదారు రూపంలో ‘రాజ ప్రతినిధి’గా ప్రతిష్ఠించారు జగన్‌. ప్రజా ప్రతినిధులకు మించిన ప్రాధాన్యాన్ని ఆయనకు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేశారు.


నీతీరీతీ లేని జగన్‌ పాలన

నకిలీ బంగారానికి మెరుపులెక్కువ అన్నట్లు జగన్‌మోహన్‌రెడ్డికి మాటలెక్కువ! ‘‘రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి’’ అని సీఎం అయిన కొత్తలో అధికారులకు పాలనాసూక్తులు బోధించారు జగన్‌. అలా శ్రీరంగనీతులు చెప్పిన వారం లోపే తనకు ప్రసంగాలు రాసిచ్చే జీవీడీ కృష్ణమోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా కొలువు తీర్చారు. ఏడాది తిరిగేసరికి ఆయన జీతాన్ని రూ.2 లక్షలకు పెంచేశారు. అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికుల వంటి బడుగు వేతనజీవుల బాధలను కనీసం వినడానికి కూడా జగన్‌ ఇష్టపడలేదు. అలాంటాయన తన వందిమాగధులు చాలామందిని సలహాదారులు, ప్రజాసంబంధాల అధికారులను చేసిపారేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వంద నుంచి నూటపాతిక కోట్ల రూపాయల జనం సొమ్మును సలహాదారులు, వారి సిబ్బంది కోసం ధారపోశారు. అదే జగన్‌.. నిధులు ఇవ్వకుండా రోడ్లను గుంతలమయం చేశారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టారు. అభివృద్ధి పనులకు కాసులు రాల్చకుండా ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేశారు.


తోడుదొంగల రాజ్యం

ఏదో ఒక ముసుగేసుకుని ముష్కర మూకలకు సాయంచేసే ‘స్లీపర్‌సెల్స్‌’ గురించి వినేఉంటారు కదా. 2019 ఎన్నికలకు ముందు జగన్‌కు అలా ఊడిగం చేసినవారిలో అజేయ కల్లం ఒకరు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన ఆయన- మేధావులతో భేటీల పేరిట అప్పట్లో తెదేపా సర్కారును జనంలో పలుచన చేసేందుకు తెగ కష్టపడ్డారు. వైకాపా మ్యానిఫెస్టో తయారీలోనూ అయ్య వారు ఒక చెయ్యివేశారు. ఆ క్రమంలోనే మరికొందరితో కలిసి ఓ రోజు తెల్లవారుజామున జగన్‌తో సమావేశమయ్యారు అజేయ కల్లం. ఆ రోజే వివేకానందరెడ్డి హత్య జరిగింది. ‘‘సమావేశం జరుగుతుండగానే 5.30 గంటల సమయంలో అటెండర్‌ వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారని జగన్‌కు చెప్పారు. బయటికి వెళ్లిన జగన్‌ పది నిమిషాల తరవాత తిరిగి వచ్చి చిన్నాన్న ఈజ్‌ నో మోర్‌ అన్నారు’’ అంటూ అజేయ కల్లం వాంగ్మూలమిచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలియజేసింది. వివేకా మరణవార్త బయటికి రావడానికి గంట ముందే జగన్‌కు ఆ విషయం తెలుసునన్న కీలకాంశం దీంతో వెలుగుచూసింది. తన వాంగ్మూలాన్ని సీబీఐ మార్చేసిందంటూ అజేయ కల్లం ఆపై ఆరోపించారు. ఒత్తిడి వల్లే ఆయన అలా మాట మార్చారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సమాచారమిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తనతో ఇంతటి ‘ప్రత్యేక అనుబంధం’ కలిగిన అజేయ కల్లంకు తాను సీఎం కాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు జగన్‌. తవ్వుకుంటూ పోతే సలహాదారుల నియామకాల వెనక ఇలాంటి చీకటి కథలెన్నో.. తోడుదొంగలై రాష్ట్ర ఖజానాకు కన్నాలేసిన వైకాపా పెద్దలు, వాళ్ల పాదసేవకుల లోగుట్లు అన్నీ ఆ పెరుమాళ్లకే ఎరుక!


వ్యవస్థకు వేరుపురుగు

రోజంతా కష్టపడితే తప్ప సామాన్యులు నాలుగు ముద్దలు తినలేరు. జగన్‌ అనే అవినీతి విష వృక్షం నీడలో సేదతీరిన సలహాదారులేమో జనం సొమ్మును అప్పనంగా జేబుల్లో వేసుకున్నారు. ‘ఇప్పటి వరకూ ఏ బాధ్యతలూ నిర్దేశించని సలహాదారులకు నిర్దిష్టమైన పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వముంది’ అని జగన్‌ సర్కారు 2023 మార్చిలో హైకోర్టుకు తెలియజేసింది. అంటే ఏంటి.. పనీ పాటా లేని సలహాదారులను జగన్‌ సర్కారు అన్నేళ్లూ అడ్డగోలుగా మేపిందనే కదా అర్థం! అదొక దరిద్రమైతే- రాష్ట్రంలో అసలు ఎంతమంది సలహాదారులు తిష్టవేశారో ప్రభుత్వానికే తెలియక పోవడం మరీ అరాచకం! సలహాదారుల వివరాలు చెప్పాలంటూ హైకోర్టు ఆదేశించిన దరిమిలా ఏ శాఖలో ఎవరున్నారో తెలుసుకోవడానికి సర్కారు ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. స్వీయ ప్రయోజనాలకోసం వ్యవస్థను ఇంతగా భ్రష్టుపట్టించిన సీఎం- దేశంలో జగన్‌ తప్ప మరొకరు లేరు.


జనం సొమ్ము.. జగన్‌ ముఠా పాలు!

జుల్ఫీ రవ్‌ద్జీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎవరో ఏంటో ఏపీలో నరమానవుడికి తెలియదు. అలాంటి వ్యక్తికి సలహాదారు పేరిట క్యాబినెట్‌ హోదా ఇచ్చారు జగన్‌. భూఆక్రమణల వివాదాల్లో ఉన్న తన దగ్గరి బంధువు తిరుపాల్‌రెడ్డిని వ్యవసాయ శాఖకు సలహాదారును చేశారు జగన్‌. అలాగే, ఉద్యానశాఖకు సలహాదారుగా వైఎస్‌ఆర్‌ జిల్లాకే చెందిన పుట్టా శివప్రసాద్‌రెడ్డిని కొలువుతీర్చారు. మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్‌రెడ్డికి జలవనరుల శాఖ సలహాదారు పదవిని కట్టబెట్టారు. వీళ్లెవరూ ఆయా రంగాల్లో నిపుణులు కారు. జగన్‌, ఆయన పార్టీతో బొడ్డుపేగు బంధం తప్ప వేరే అర్హతలేమీ లేవు. అయినప్పటికీ ఇలాంటి వాళ్లెందరో సలహాదారులై రాష్ట్రం నెత్తిన తెల్ల ఏనుగులై కూర్చున్నారు.


హైకోర్టు కన్నెర్ర చేసినా..

ప్రజాప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పచ్చి రాజకీయ స్వార్థంతో ఎవరిని పడితే వారిని సలహాదారులను చేసేయడమేంటి? జగన్‌ జమానాలో వెర్రితలలు వేసిన ఈ పెడపోకడపై ఉన్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ‘‘మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటి’’ అని రాష్ట్ర హైకోర్టు నిగ్గదీసింది. ఐఏఎస్‌ల కంటే వాళ్లు గొప్ప సలహాలిస్తారా, ఇలాగే వదిలేస్తే రేపొద్దున కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. చీమూనెత్తురు ఉన్న వారు ఎవరైనా సరే, న్యాయపాలిక ఇన్ని చివాట్లు పెట్టాక కాస్తయినా సర్దుకుంటారు. సిగ్గుమాలినతనంలో సాటిలేని జగన్‌ మాత్రం హైకోర్టు కన్నెర్ర చేసినా సలహాదారు పదవుల పందేరాన్ని ఆపలేదు. ఆఖరికి మొన్న మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు కూడా విపత్తుల నిర్వహణశాఖకు సలహాదారుగా మేడా గురుదత్త ప్రసాద్‌కు పట్టంకట్టారు. జనసేనను వదిలి ఇటీవలే వైకాపా కండువా కప్పుకొన్న ప్రసాద్‌కు జగన్‌ వడ్డించిన తాయిలమిది!


అటు అక్రమాలు.. ఇటు జగన్‌కు చిడతలు

జగన్‌ పుణ్యమా అని సలహాదారులైన వారిలో కొందరు భారీగా అక్రమాలకూ తెగబడ్డారు. శ్రీశైలంలో వివిధ పనుల కోసం రూ.110 కోట్లతో టెండర్లు పిలిచారు. పెద్దసంఖ్యలో బిడ్లు కూడా దాఖలయ్యాయి. ఇంతలో సకల శాఖల సలహాదారుగా మాంఛి పేరుపొందిన పెద్దమనిషి రంగంలోకి వచ్చారు. తన మనుషులకు ఆ పనులు దక్కట్లేదన్న దుగ్ధతో టెండర్లనే రద్దు చేయించారు. రూ.750 కోట్లతో 5 లక్షల ట్యాబుల కొనుగోళ్ల టెండర్లనూ అయినవారి పరం చేసేందుకు ఆయనే చక్రం తిప్పారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల సచివాలయంలోనే విలేకర్ల సమావేశం పెట్టి మరీ జగన్‌కు చిడతలు కొట్టారు. చెత్తపన్నులు.. కరెంట్‌, ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో పేదల రక్తం పిండిన జగన్‌- ఆ డబ్బుతో తన భజనపరుల కడుపులు నింపారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడం నేరం. సలహాదారుల నియామకాలతో ఆ మహాపరాధానికి ఒడిగట్టిన జగన్‌- ప్రజాకోర్టులో కఠిన దండనకు అర్హులు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని