అద్దె మగ్గంపై నేసే వారిని గుర్తించడం కష్టమట!

అద్దె మగ్గంపై నేత పని చేసేవారిని గుర్తించడం కష్టమని, వారికి నేతన్న నేస్తం ఇవ్వడం సాధ్యపడదని ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పారు. మంగళగిరిలో శనివారం చేనేతలతో నిర్వహించిన ముఖాముఖిలో స్థానికురాలు కొండేటి కుమారి అడిగిన ప్రశ్నకు ఆయనిలా సమాధానమిచ్చారు.

Updated : 14 Apr 2024 08:43 IST

వారికి నేతన్ననేస్తం ఇవ్వడం సాధ్యపడదట
చేనేతల ముఖాముఖిలో తేల్చిచెప్పిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: అద్దె మగ్గంపై నేత పని చేసేవారిని గుర్తించడం కష్టమని, వారికి నేతన్న నేస్తం ఇవ్వడం సాధ్యపడదని ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పారు. మంగళగిరిలో శనివారం చేనేతలతో నిర్వహించిన ముఖాముఖిలో స్థానికురాలు కొండేటి కుమారి అడిగిన ప్రశ్నకు ఆయనిలా సమాధానమిచ్చారు. ‘అద్దె మగ్గంపై నేసే వారికి ఇవ్వాలని నాకూ ఉంది. కానీ ఎవరు అద్దె మగ్గంపై నేసే వారో ఎలా చెప్పగలం? ఇలా చేస్తే అధికార పార్టీకి దగ్గరగా ఉండేవారు ఎక్కువగా దోచేసుకుంటారు’ అని వివరణ ఇచ్చారు. వాస్తవానికి, రాష్ట్రంలో 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయం ఉంది. 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ ఉన్నారు. వారి పరిధిలోని కుటుంబాల సమస్త సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. అలాంటప్పుడు అద్దె మగ్గాలపై నేసే వారిని గుర్తించడం కష్టమని సీఎం చెప్పడం ఆ వర్గాలను దగా చేయడం కాదా? అసలు ఆర్థిక సాయం అందించాల్సిందే అద్దె మగ్గాలపై కూలికి నేసే పేద కార్మికులకు కదా? 100 మగ్గాలుండే మాస్టర్‌ వీవర్‌కు ఏటా రూ.24 వేలు ఇస్తూ, అతని దగ్గర పనిచేసే 100 మంది కార్మికులకు ఇవ్వలేమనడం దారుణం కాదా? తమకు నేతన్ననేస్తమే అందలేదని కార్మికులు వాపోతుంటే, ‘ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇచ్చాం. ఆ మొత్తంతో సొంత మగ్గం కొనుక్కోవచ్చు కదా’ అని ఉచిత సలహా ఇవ్వడం జగన్‌కే చెల్లింది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపేది చేనేత రంగమే. రాష్ట్రంలోని 3.50 లక్షల మంది నేత కార్మికుల్లో నేతన్న నేస్తం అందింది 80 వేల మందికే. ఈ సంఖ్యను కూడా పెంచి చూపించారనే విమర్శలున్నాయి. వీరిలో కూలీ(అద్దె) మగ్గాలపై నేసే కడుపేదలకు పథకం వర్తింపజేయకపోవడమే కాదు, తెదేపా ప్రభుత్వంలో అందిన సాయాన్నీ జగన్‌ అటకెక్కించారు.

వృత్తికి సంబంధించినవైతే ఒక్క పథకమే

మంగళగిరికి చెందిన నందం దుర్గ అనే మహిళ తనకు చేయూత వస్తోందని, నేతన్ననేస్తం రావడం లేదని చెప్పగా జగన్‌ స్పందిస్తూ, ‘చేయూత, నేతన్ననేస్తం పథకాలు వృత్తికి సంబంధించినవి. వీటిలో ఒక్క పథకం మాత్రమే వర్తిస్తుంది’ అని చెప్పారు. దీంతో ఇన్నాళ్లూ సంక్షేమం మాటున జరుగుతున్న కుట్రను స్వయంగా జగనే బయట పెట్టినట్లైంది. చేనేత సంఘాలు, పవర్‌ లూమ్స్‌ వ్యవస్థల మధ్య అంతరాలున్నాయని, దీన్ని సరిచేసేందుకు కమిషన్‌ ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు కోరారు. చేనేత బ్యాంకు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. చేనేత కార్మికులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, షెడ్డు ఏర్పాటు చేయాలని, పద్మశాలీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వాలని, మురికివాడల్లో చాలా సమస్యలున్నాయని పలువురు ప్రస్తావించారు.

కొత్తగా కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలిస్తారట!

మంగళగిరిలోని పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరకపోతే అధికారంలోకి రాగానే 6 నెలలు ఎదురుచూసి, కొత్తగా స్థలాలు కొనుగోలు చేసి ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. 54 వేల మందికి అమరావతిలో ఇళ్ల స్థలాలిస్తానని చెబుతూనే ఈ హామీ కూడా ఇచ్చారు. సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరని, పేదవారు బాగుపడటాన్నీ ఆపలేరని సూక్తులూ వల్లించారు. అయితే, మంగళగిరిలో ఇళ్లు లేని పేదలున్నారన్న సంగతి జగన్‌కు ఎన్నికల వేళ గుర్తొచ్చినట్టుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఐదేళ్ల పాలనా కాలం సరిపోలేదా? మరోసారి అధికారంలోకి వస్తే కొత్తగా కొనుగోలు చేసి ఇస్తామనడం మోసం కాదా? మీ రాజకీయ కుతంత్రంలో పేదల్ని సమిధలు చేయలేదా? రాజధాని అమరావతిలో పేదలకు నిర్దేశించిన భూమిలో కాకుండా ఇతర చోట్ల ఇవ్వడం కుదరదని తెలిసీ, 54 వేల మంది బయటి ప్రాంతాల వారికి స్థలాలు కేటాయించారు. అందులో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు నామమాత్రమే. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. వైకాపా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.

ఐ ప్యాక్‌ స్క్రిప్ట్‌ పండలేదు

‘మాది మురికివాడ. రహదారులు సరిగా లేవు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రతి రోడ్డూ చూశారు, కానీ వేయించలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఇవన్నీ ఎమ్మెల్యేగా గెలిస్తే లావణ్య చేస్తారా?’ అని మంగళగిరికి చెందిన కొండేటి కుమారి ప్రశ్నించారు. దీనిపై అభ్యర్థి లావణ్య స్పందించకపోగా, జగన్‌ కల్పించుకొని పొంతన లేని సమాధానమిచ్చారు. ఐదేళ్లలో రోడ్లు ఎందుకు వేయలేదో మాత్రం చెప్పలేదు. మంగళగిరి నుంచి తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పోటీ చేస్తున్నందున ఇక్కడ ముఖాముఖి కార్యక్రమాన్ని వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కీలక ఓటు బ్యాంకుగా ఉన్న చేనేతలతో మాట్లాడించాలని భావించి, ముందుగానే ఐప్యాక్‌ ప్రతినిధులతో తర్ఫీదునిచ్చారు. అయితే, ఎంపిక చేసుకున్న ఓటర్లతో స్క్రిప్ట్‌ను యథాతథంగా వల్లె వేయించడంలో విఫలమయ్యారు. ఒకరిద్దరు మాత్రమే జగన్‌ భజన చేయగా, మిగతా వారంతా ముక్తసరిగా మాట్లాడారు. సీఎం ప్రసంగం జనాల్లో ఉత్సాహాన్ని నింపకపోగా, ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు ఆయన అసహనం చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని