సీఎం బలప్రదర్శన కోసం వేల మందికి ప్రత్యక్ష నరకం

‘మీరేం ముఖ్యమంత్రి! బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తారా? మీ బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు..  డ్రోన్‌ షాట్లు, ఫొటో, వీడియోషూట్ల చిత్రీకరణ కోసం గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా?

Updated : 14 Apr 2024 07:44 IST

హైవేపై గుంటూరు-విజయవాడ మధ్య 4 గంటలు ట్రాఫిక్‌ నిలిపేసిన పోలీసులు
పెద్ద సంఖ్యలో జనాలను చూపించాలన్న తాపత్రయంలో గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా?

ఈనాడు-అమరావతి: ‘మీరేం ముఖ్యమంత్రి! బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తారా? మీ బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు..  డ్రోన్‌ షాట్లు, ఫొటో, వీడియోషూట్ల చిత్రీకరణ కోసం గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా? మీ ‘ఎలక్షన్‌ షో’ కోసం ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ నిలిపేసి.. వాటిని ఒక్కసారిగా వదిలి వాహనదారుల్ని, సామాన్య ప్రయాణికుల్ని హింసిస్తారా? అసలు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత మీకుందా? మీ ప్రచారం కోసం ఇంత పైశాచికత్వమా?’

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి తాను ప్రయాణించే మార్గాల్లోని జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులను ఎక్కడికక్కడ స్తంభింపజేసి ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్న జగన్‌ శనివారం దాన్ని పరాకాష్ఠకు చేర్చారు. 14వ రోజు యాత్రను శనివారం గుంటూరు జిల్లా నంబూరు బైపాస్‌ వద్ద నుంచి ఆయన మొదలుపెట్టారు. కాజా, మంగళగిరి బైపాస్‌ మీదుగా సీకే కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి కుంచనపల్లి బైపాస్‌ మీదుగా తాడేపల్లి చేరుకుని భోజన విరామం కోసం ఆగారు. కనకదుర్గ వారధి మీదుగా సాయంత్రానికి విజయవాడలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో వారధిపైన డ్రోన్‌ షాట్లతో ఫొటో, వీడియో షూట్‌ పెట్టుకున్నారు. వారధి మొత్తం జనసందోహంతో నిండిపోయినట్లు డ్రోన్‌ వీడియో, ఫొటో షూట్లలో కనిపించేలా చేసేందుకు అంతకు ముందు గుంటూరు- విజయవాడ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిపేశారు. దీంతో ఎండలో ప్రయాణికులకు, వాహనదారులకు నరకమేంటో అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రభావంతో మొత్తంగా నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.

జాతీయ రహదారులపై జగన్‌ యాత్రలకు అనుమతులు రద్దు చేయాల్సిందే

చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి అత్యంత ప్రధానమైనది. అందులో గుంటూరు-విజయవాడ మధ్య ఒక్క గంటలోనే వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సాయంత్రం వేళ ఈ రద్దీ మరింత తీవ్రంగా ఉంటుంది. గుంటూరు నుంచి విజయవాడకు చేరుకోవటానికి బైపాస్‌ కూడా లేదు. వారధి మీదుగా ప్రయాణించాల్సిందే. ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా అలాంటి మార్గంలో వీలైనంత వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదనే ప్రయత్నిస్తారు. జాతీయ రహదారి మొత్తం ఆరు వరుసలుగా ఉంది. తప్పనిసరైతే ఒకటి, రెండు వరుసల్లో యాత్రకు అనుమతించి మిగతా వరుసల్లో సాధారణ ప్రయాణికుల రాకపోకలు కొనసాగేలా చూడొచ్చు. కానీ జగన్‌ కోసం ఏకంగా మొత్తం రహదారినే స్తంభింపజేసేశారు. దీంతో వేల మంది వాహనదారులు మండుటెండలో అల్లాడిపోయారు. అసలు ఇంతటి కీలకమైiన జాతీయ రహదారిపై యాత్రకు ఎన్నికల సంఘం ఎలా అనుమతిచ్చింది? ఇప్పటికైనా జాతీయ రహదారులపై జగన్‌ యాత్రకు అనుమతులు రద్దు చేయకపోతే ప్రజలకు మున్ముందు మరింత నరకం చూపించటం తథ్యం.

పోలీసులకైనా ఇంగితం ఉండొద్దా!

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి నెల రోజులవుతున్నా పోలీసులు ఇంకా వైకాపా సేవలో తరించటమేంటి? ముఖ్యమంత్రి అయితే ఆయనకేమైనా ప్రత్యేక హక్కులుంటాయా? జగన్‌ తన పార్టీ తరఫున రాజకీయ ప్రచారం కోసం తిరుగుతుంటే దాని కోసం జాతీయ రహదారిపై రాకపోకల్ని స్తంభింపజేయటమేంటి? వేలమందికి ఇబ్బందులు సృష్టించిన జగన్‌, పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. తాడేపల్లి వద్ద సర్వీసు రోడ్డులో మార్నింగ్‌స్టార్‌ ట్రావెల్స్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామం కోసం 2 గంటల సమయంలో జగన్‌ ఆగారు. దాదాపు 4.30 వరకూ అక్కడే ఉన్నారు. అప్పుడు కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించి జాతీయ రహదారిపై, సర్వీసు రోడ్డులోకి వచ్చే మార్గంలోనూ ట్రాఫిక్‌ ఆపేశారు.

మండుటెండలో మాడిపోయిన ప్రయాణికులు

గుంటూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం గరిష్ఠంగా 45 నిమిషాలు. కానీ జగన్‌ ప్రచార పిచ్చి వల్ల ట్రాఫిక్‌ను నిలిపేయటంతో శనివారం 4 గంటల సమయం పట్టింది. చెన్నై- కోల్‌కతా లాంటి అత్యంత రద్దీ జాతీయ రహదారిని గుంటూరు-విజయవాడ మధ్య కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడ్డేశ్వరం బైపాస్‌ రోడ్డులో ఎయిమ్స్‌కు వెళ్లే కూడలి వద్ద మూడున్నర గంటల పాటు పోలీసులు వాహనాలను నిలిపివేయించారు. దీంతో పసిపిల్లలతో ప్రయాణిస్తున్న తల్లులు నరకం అనుభవించారు. బస్సుల్లో గాలి ఆడక చిన్నారులు ఏడుస్తుంటే సముదాయించలేక ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో ద్విచక్రవాహనదారులు అల్లాడిపోయారు. కొందరైతే వడదెబ్బకు గురయ్యారు.

చీకటి జీవో తెచ్చారు కదా!

‘రహదారులపై సభలు, సమావేశాలు నిర్వహించటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడినవారు సకాలంలో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణ వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగి లాజిస్టిక్స్‌ సరఫరాపై ప్రభావం పడుతోంది’ అంటూ జగన్‌ గతేడాది జనవరిలో జీవో 1 తెచ్చారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి తెచ్చిన ఈ జీవోను న్యాయస్థానాలు కొట్టేశాయి. ప్రతిపక్షాలను వేధించేందుకు అప్పట్లో ఇలాంటి జీవో తెచ్చిన జగన్‌కు ఇప్పుడు ఆ నిబంధనలు ఎందుకు పాటించరు?


అతలాకుతలమైన విజయవాడ

విజయవాడలో జగన్‌ యాత్ర సందర్భంగా బస్సుల్ని దారి మళ్లించారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను నిలిపేశారు. అంతర్గత రోడ్లనూ బారికేడ్లతో మూసేశారు. దీంతో విజయవాడ అతలాకుతలమైంది. జగన్‌ విజయవాడలోకి ప్రవేశించే ముందే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిపేశారు. ఏలూరు వైపు నగరంలోకి వచ్చే వాటిని బయటే నిలిపేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చేవాటిని తాడేపల్లి వద్ద ఆపేశారు. సీఎం జగన్‌ బందరు రోడ్డులోకి ప్రవేశించిన తర్వాత ఒకేసారి వాహనాలు వదలడంతో వారధి నుంచి ఎనికేపాడు వరకు ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ ప్రభావం విజయవాడ నగరంతోపాటు పరిసర ప్రాంతాల వరకు వ్యాపించి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో పైవంతెనపై సీఎం వెళ్లిన తర్వాత కూడా ట్రాఫిక్‌ కష్టాలు తీరలేదు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు వెళ్తున్న కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని