కోడ్‌ ఉన్నప్పుడే ఇళ్ల పట్టాలివ్వాలా?

అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు ఉన్నతాధికారులు ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు సెంటు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కొనసాగించేందుకు వ్యూహం రూపొందించారు.

Published : 14 Apr 2024 04:04 IST

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడం కాదా?
రెవెన్యూ ప్రతిపాదనకు స్క్రీనింగ్‌ కమిటీలో చుక్కెదురు
అయినా, అధికారుల అడ్డగోలు సమర్థన

ఈనాడు, అమరావతి: అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు ఉన్నతాధికారులు ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు సెంటు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కొనసాగించేందుకు వ్యూహం రూపొందించారు. ఆ ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్‌ కమిటీ ముందు శుక్రవారం ఉంచారు. సుమారు 7.50 లక్షల మంది లబ్ధిదారులకు ఈ సమయంలో రిజిస్ట్రేషన్లు చేయడమంటే.. ఎన్నికల్లో వారిని ప్రభావితం చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కి పత్రికల్లో రావడంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ శనివారం పొంతనలేని వివరణ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేవరకూ జరిగింది. సుమారు 22.80 లక్షల మంది లబ్ధిదారుల్లో 15.33 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మిగతా వారికి కూడా కొనసాగించేందుకు రెవెన్యూ శాఖ తరఫున స్క్రీనింగ్‌ కమిటీకి ప్రతిపాదించాం. ఇందులో పూర్తి వివరాలు లేకపోవడంతో పాటు దానికి సమర్థనీయత (జస్టిఫికేషన్‌) లేదని స్క్రీనింగ్‌ కమిటీ వెనక్కి పంపింది’ అని జైన్‌ పేర్కొన్నారు. ఈ వివరణను బట్టే అది ఎంత అసంబద్ధ ప్రతిపాదననో అర్థమవుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఇన్ని లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరమేంటి? అత్యవసర అంశం అన్నట్టు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ).. రెవెన్యూ శాఖ ద్వారా స్క్రీనింగ్‌ కమిటీకి ప్రతిపాదించడమేంటి? అందులో పూర్తి వివరాల్లేవని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గుర్తించలేదా? ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలోని అధికారులు సారథ్యం వహిస్తున్న సీసీఎల్‌ఏకు, రెవెన్యూ శాఖకు అందులో జస్టిఫికేషన్‌ లేదన్న సంగతి తెలియదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కన్వేయన్స్‌ డీడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల లబ్ధిదారులకు పైసా ప్రయోజనం లేదు. అయినా వారిని ఆకట్టుకోవాలన్న ప్రచార యావతో సీఎం జగన్‌ ఫొటోలు, నవరత్నాల లోగోలతో ఇన్నాళ్లూ పట్టాల పంపిణీ ఓ ప్రహసనంలా సాగింది. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు అదే తంతు కొనసాగించాలి అనుకోవడంలోనే ప్రభుత్వ దురుద్దేశం తేటతెల్లమవుతోంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అధికారులు అర్థం లేని వివరణలు ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని