చిన్న పరిశ్రమలపై.. జగన్‌ మోసపు దెబ్బ!

‘పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు రాకుంటే.. వారు పరిశ్రమలను ఎలా నిర్వహిస్తారు? పరిశ్రమల్ని సరిగా నడపలేకపోతే వాటిపై ఆధారపడ్డ చిన్న ఉద్యోగుల పరిస్థితేంటి? ప్రోత్సాహకాలను మేం ఏటా క్రమం తప్పకుండా చెల్లిస్తాం.’

Published : 14 Apr 2024 04:04 IST

ఎన్‌పీఏలుగా మారుతున్న యాజమాన్యాలు
సర్కారు రాయితీ రాదు.. వడ్డీ భారం తగ్గదు
మూడోసారీ పారిశ్రామికవేత్తలకు నిరాశే

‘పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు రాకుంటే.. వారు పరిశ్రమలను ఎలా నిర్వహిస్తారు? పరిశ్రమల్ని సరిగా నడపలేకపోతే వాటిపై ఆధారపడ్డ చిన్న ఉద్యోగుల పరిస్థితేంటి? ప్రోత్సాహకాలను మేం ఏటా క్రమం తప్పకుండా చెల్లిస్తాం.’

2022లో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాటలివి.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో చిన్న పరిశ్రమల పరిస్థితి ‘గోరు చుట్టుపై.. రోకటి పోటు’ అన్నట్లుగా తయారైంది. ముడి సరకుల ధరలు పెరిగి, కొవిడ్‌తో ఆర్థికంగా నష్టాల పాలైన కర్మాగారాలను జగన్‌ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. వాటికి మూడేళ్లుగా ప్రోత్సాహక బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా ఏటా రూ.300 కోట్ల అదనపు వడ్డీ భారం పడుతోంది. పారిశ్రామికవేత్తలకు ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటామని, పరిశ్రమలకు ‘హ్యాండ్‌ హోల్డింగ్‌’ అందిస్తామంటూ సీఎం తరచూ చెప్పే మాటలేవీ ఆచరణలో కనిపించడం లేదు. ఐదేళ్ల పాలనలో పరిశ్రమల కోసం జగన్‌ బటన్‌ నొక్కింది రెండే సార్లు. కొవిడ్‌ సమయంలో రీస్టార్ట్‌ ప్యాకేజీ అంటూ రూ.903.91 కోట్లు, 2021లో మరోసారి ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.684 కోట్ల ప్రోత్సాహకాలు మాత్రమే చెల్లించారు. చిన్న పరిశ్రమల కష్టాలపై అసెంబ్లీలో 2022లో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన జగన్‌.. వాటికి ఏటా ప్రోత్సాహకాలను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అందుకు రివర్స్‌గా, అదే ఏడాది నుంచి ప్రోత్సాహకాలు చెల్లించడం నిలిపివేశారు. రెండేళ్లలో రూ.2,500 కోట్లు బకాయి పడ్డారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించి ఉంటే.. పారిశ్రామిక రంగానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతైనా ఉపశమనం లభించేది. సాధారణంగా చిన్న ఫ్యాక్టరీల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే, నిబంధన మేరకు చెల్లించే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత పరిశ్రమ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దీంతో ప్రతినెలా వారు బ్యాంకుకు చెల్లించే వాయిదా మొత్తంలో కొంత మేర ఉపశమనం లభించేది. ఆ మేరకు పరిశ్రమలకు ఆర్థికంగా వెసులుబాటు దొరికేది.

రాయితీలో సగం.. వడ్డీకే ఆవిరి!

ప్రభుత్వం ఏటా రాయితీ మొత్తాన్ని విడుదల చేస్తే చిన్న పారిశ్రామికవేత్తలపై వడ్డీ భారం తప్పేది. ప్రభుత్వం రాయితీలు ఇవ్వలేదని బ్యాంకులు పరిశ్రమల నిర్వాహకులపై జాలి చూపవు కదా? పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు 10.5-15 శాతం వరకు వడ్డీ రేటును లెక్కగట్టి వసూలు చేస్తాయి. ప్రభుత్వం మూడేళ్లుగా చెల్లించని పారిశ్రామిక రాయితీలు రూ.2,500 కోట్లపైనే. ఈ మొత్తాన్ని విడుదల చేసి ఉంటే, సగటున 12 శాతం వడ్డీ రేటు చొప్పున లెక్కించినా ఏడాదికి రూ.300 కోట్ల భారం వారికి తగ్గేది. మూడేళ్లకు లెక్కిస్తే.. వడ్డీ రూపేణా రూ.900 కోట్ల భారం చిన్న పారిశ్రామికవేత్తలపై పడింది. ‘2018లో నెలకొల్పిన ఒక చిన్న కర్మాగారానికి ప్రభుత్వం ఆరేళ్లుగా విద్యుత్‌ ఛార్జీల రాయితీ రూ.2 లక్షలు, వడ్డీ రాయితీ సుమారు రూ.31 లక్షలు పెండింగ్‌లో పెట్టింది. అంటే రాయితీ మొత్తం రూ.33 లక్షలు. ఖాతాదారుల నుంచి మరో రూ.35 లక్షలు వసూలు కావాల్సి ఉంది. ఒక చిన్న ఫ్యాక్టరీకి రూ.65 లక్షల బాకీలు వసూలు కావాల్సి ఉంటే.. దానిపై బ్యాంకు వడ్డీ 12 శాతం చొప్పున లెక్కించినా నెలకు రూ.65 వేల అవుతుంది. ఏడాదికి రూ.7.80 లక్షల భారం పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పరిశ్రమ బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాలు రూ.25 లక్షలు పెండింగ్‌లో ఉండటంతో ఎన్‌పీఏ జాబితాలో చేరుస్తామంటూ నోటీసులు వస్తున్నాయి’ అంటూ ఒక చిన్న పరిశ్రమ నిర్వాహకుడు వాపోయారు. రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించి ఉంటే, బ్యాంకు నోటీసులు అందుకోవాల్సిన అగత్యం వచ్చేది కాదని గుర్తుచేశారు.


మూడో‘సారీ’ మాట తప్పారు

పరిశ్రమలకు రాయితీలు 2024 ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పుకొచ్చింది. రెండేళ్లుగా ఇదే మాటలు చెబుతున్నందున ఖాతాల్లో డబ్బులు పడేవరకూ నమ్మలేమని పారిశ్రామికవేత్తలు సందేహించారు. వారు అనుమానించినట్లుగానే జగన్‌ రాయితీలు వేయలేదు. మొదటిసారి 2022లో దసరాకు (అక్టోబరులో) విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారు. తర్వాత 2023 మార్చిలో విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు ముందు ఫిబ్రవరిలో ఇవ్వాలనుకున్నామని, అంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో చెల్లించలేక పోయామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అప్పట్లో చెప్పుకొచ్చారు. కోడ్‌ ముగిశాక ఆ విషయమే మరిచిపోయారు. ఇవే కాదు, కొవిడ్‌ సమయంలో పరిశ్రమలకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ప్రకటించిన గరిష్ఠ డిమాండ్‌ ఛార్జీలు రూ.205 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని