సంక్షిప్తవార్తలు(6)

పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌(ఏటీఓ) పోస్టుల రాత పరీక్షను జూన్‌ 6న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణా శాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు.

Updated : 14 Apr 2024 05:46 IST

జూన్‌ 6న ఏటీఓ రాత పరీక్ష

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌(ఏటీఓ) పోస్టుల రాత పరీక్షను జూన్‌ 6న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణా శాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో ఉచిత శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంగ్లంలో మాట్లాడాలనే ఆసక్తి కలిగిన వారికి తమ సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల మూడో వారం నుంచి ఆన్‌లైన్‌లో ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌పై శిక్షణ ఇస్తున్నట్లు మేధా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను 98660 06662 వాట్సప్‌ నంబర్‌కు పంపాలని సూచించారు.


శాశ్వత ఎడ్యుకేషన్‌ నంబరుతోనే ప్రవేశాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇతర పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు టీసీలు తీసుకోవాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మార్గదర్శకాలనిచ్చారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల విద్యార్థులకు చైల్డ్‌ ఐడీలు, శాశ్వత ఎడ్యుకేషన్‌ నంబరును కేటాయిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘టీసీలు, జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు టీసీలు తప్పనిసరన్న అంశాన్ని పక్కన పెడుతున్నాం. విద్యార్థుల డేటాను వారు ఎంచుకున్న పాఠశాలకు విద్యాశాఖనే బదిలీ చేస్తుంది. విద్యార్థులు పాఠశాలను ఎంచుకున్నాక వారి తల్లిదండ్రులకు మొబైల్‌లో సమాచారం పంపుతాం. దీని ద్వారా ప్రవేశాలు పొందొచ్చు. విద్యార్థుల బదిలీలు సాఫీగా సాగేలా చూడాలి’ అని అన్ని జిల్లాల డీఈవోలకు సురేష్‌కుమార్‌ సూచించారు.


రాప్తాడు ఈఆర్వోపై విచారణకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: నకిలీ ఆధార్‌ కార్డులతో అక్రమంగా ఓట్ల నమోదుకు తెరలేపిన రాప్తాడు నియోజకవర్గ ఈఆర్వో/ఆర్వో వసంతబాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్వో రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ నెల 12న ‘ఈయన మామూలు ఈఆర్వో కాదు!’ అన్న శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురించిన కథనంపై కలెక్టర్‌ స్పందించారు. ఈఆర్వో వ్యవహార తీరుపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నకిలీ ఆధార్‌ కార్డులను సృష్టించి కొత్త ఓట్ల నమోదు, ఏఈఆర్వో, బీఎల్‌వోల ఆమోదం, క్షేత్ర పరిశీలన లేకుండానే నేరుగా ఈఆర్వో ఫాం-6 దరఖాస్తులను ఆమోదిస్తున్న విషయం వెలుగు చూసింది. ఇదంతా వైకాపా నాయకుల ఒత్తిడి, ప్రమేయంతోనే సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం  వ్యవహారంపై విచారణ సాగుతోందని కలెక్టర్‌ ధ్రువీకరించారు. విచారణలో నిజాలు తేలితే తప్పక చర్యలు ఉంటాయన్నారు.


మే 15 నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. రెండు విడతలుగా ప్రవేశాలు నిర్వహించాలని పేర్కొంది. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి, జూన్‌ 1 లోపు వాటిని స్వీకరించాలని సూచించింది. మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపట్టాలని, జూన్‌ 1 లోపు పూర్తి చేయాలని వెల్లడించింది. రెండో విడత ప్రవేశాలను జూన్‌ 10 నుంచి జులై 1 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.


జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ విడుదల
అభ్యంతరాలకు నేటి రాత్రి వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలుంటే ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి సవాల్‌ చేయవచ్చని పేర్కొంది. అందుకు ఈనెల 14వ తేదీ రాత్రి 11 గంటల వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈనెల 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని