ఎన్నికల విధులకు 635 మంది దేవాదాయశాఖ ఉద్యోగులు

సార్వత్రిక ఎన్నికల విధులకు 635 మంది దేవాదాయశాఖ ఉద్యోగులను ఎంపిక చేశారు. దేవాదాయశాఖ కార్యాలయాల్లో పనిచేసే వారితోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అక్కడి కలెక్టర్లు ఎంపిక చేశారు.

Published : 14 Apr 2024 05:35 IST

వీరిని మినహాయించాలనిమరోసారి కోరిన కమిషనర్‌

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల విధులకు 635 మంది దేవాదాయశాఖ ఉద్యోగులను ఎంపిక చేశారు. దేవాదాయశాఖ కార్యాలయాల్లో పనిచేసే వారితోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అక్కడి కలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే వరుసగా పండగలు, జాతరలు, ఉత్సవాలు ఉండటంతో దేవాదాయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కోరుతూ ఆశాఖ కమిషనర్‌ ఈనెల ఒకటిన ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ ఉద్యోగులందరికీ ఆయా ఆలయాలు, మఠాలు, ట్రస్ట్‌ల నుంచి వసూలుచేసిన డబ్బుతో జీతాలు ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా దేవాదాయశాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వినియోగించవద్దని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖరాశారు. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాల్లో ఎంత మంది దేవాదాయ ఉద్యోగులను ఎన్నికల విధులకు ఎంపిక చేశారో వివరాలు అందజేయాలని ఎన్నికల సంఘం దేవాదాయశాఖను కోరింది. దీంతో ఇప్పటికే ఎంపిక చేసిన 635 మంది ఉద్యోగుల జాబితాను దేవాదాయశాఖ శనివారం పంపింది. వీరిని మినహాయించాలని మరోసారి దేవాదాయ కమిషనర్‌ కోరారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని ఉద్యోగులు ఎన్నికల విధులకు ఎంపికైనవారిలో ఉన్నారు. వీరందరినీ ఎన్నికల విధుల నుంచి మినహాయించే వీలుందని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని