సెకి విద్యుత్‌కు ఏపీఈఆర్‌సీ అనుమతి

సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఉత్తర్వులిచ్చింది.

Published : 14 Apr 2024 05:36 IST

ఈనాడు, అమరావతి: సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు సెకితో విక్రయ ఒప్పందంపై (పీఎస్‌ఏ-పవర్‌సేల్‌ అగ్రిమెంట్‌) సంతకాలు చేయడానికి డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది. ఈ విద్యుత్‌ కొనుగోలుపై దాఖలైన పిటిషన్ల తుది విచారణ తర్వాత హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి వ్యవహరించాలని పేర్కొంది. సెకి నుంచి విద్యుత్‌ తీసుకునేందుకు వీలుగా త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి అనుమతించాలని డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు   29న ఏపీఈఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై ఈ నెల 10న ఏపీఈఆర్‌సీ విచారణ నిర్వహించింది. విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని ప్రభుత్వమే భరించేందుకు అంగీకరించినందున వినియోగదారులపై భారం పడబోదని కమిషన్‌ అభిప్రాయపడింది. ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబరునుంచి దశలవారీగా విద్యుత్‌ సరఫరా ప్రారంభమవుతుందని, సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ తీసుకున్నప్పటికీ 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కమిషన్‌ నిర్దేశించిన     ఆర్‌పీవో (రెన్యూవబుల్‌ పవర్‌ ఆబ్లిగేషన్‌) చేరుకోవడం అసాధ్యమని పేర్కొంది. సెకి నుంచి తీసుకునే విద్యుత్‌కు ట్రేడ్‌మార్జిన్‌తో సహా యూనిట్‌కు రూ.2.49 చొప్పున ధరను నిర్దేశిస్తూ కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని, పీఎస్‌ఏ ఒప్పందానికి సంబంధించి అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ విద్యుత్‌ పంపిణీ, సరఫరాకు డిస్కంలతోపాటు కొత్తగా ఏపీ రూరల్‌ అగ్రికల్చర్‌ పవర్‌ సప్లయ్‌ కంపెనీ లిమిటెడ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కమిషన్‌ పేర్కొంది.

ఆ విద్యుత్‌ మొత్తం అదానీదే

తొలుత ప్రతిపాదించిన ప్రకారం అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్‌ పవర్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు సెకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అజూర్‌ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్‌ను కూడా పీఎస్‌ఏ నిబంధనల్లో మార్పులు లేకుండా అదానీ నుంచి తీసుకునేలా సెకి ప్రతిపాదించింది. ఆ విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేసేలా ఏపీ డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వంతో సెకి విక్రయ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని