బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి

‘బతుకులు మార్చే నాయకుడినే ఎన్నుకోవాలి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

Published : 14 Apr 2024 05:39 IST

మంగళగిరిలో చేనేత కార్మికుల ముఖాముఖిలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘బతుకులు మార్చే నాయకుడినే ఎన్నుకోవాలి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ‘రంగరంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పేదలకు మంచి జరిగితే అడ్డుకునేవాడు రాజకీయ నాయకుడా? చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో బస్సు యాత్రలో భాగంగా శనివారం మంగళగిరిలోని ఓ కన్వెన్షన్‌లో చేనేత కార్మికులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ‘చంద్రబాబుకు ఉన్న నెగెటివిటీ అనుభవం నాకు లేదు. 2014లో చంద్రబాబు చేనేతలకు ఇచ్చిన హామీల్లో నూటికి రెండు మాత్రమే అమలు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ బీసీ సీట్లను లాక్కొని అక్కడ రూ.కోట్లు ఖర్చు పెడుతూ రాజకీయం చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చెప్పి మోసం చేశారు. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మంగళగిరిలో వైకాపా బీసీకి సీటు ఇచ్చింది. ఇక్కడ 1.20 లక్షల ఇళ్లు ఉండగా 1.08 లక్షల మందికి నేరుగా సంక్షేమ పథకాలు అందించాం’ అని జగన్‌ వివరించారు. సీఎం కన్వెన్షన్‌కు చేరుకునేటప్పటికే పాసులు ఉన్న నేత కార్మికులను లోపలికి అనుమతించారు. జగన్‌ వచ్చాక పాసులు ఉన్నవారిని కూడా అనుమతించకుండా వెనక్కి పంపించారు. దీంతో కొందరు ఎండలో రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. మంగళగిరి ఇస్లాంపేట నుంచి కొందరు మహిళలను తరలించి వారి చేతుల్లో పెద్ద జెండాలు పెట్టి కన్వెన్షన్‌ ముందు దారికి ఇరువైపులా నిలబెట్టారు. ఇలా అంతసేపూ నిలబడినందుకు వారికి కొంత మొత్తం చెల్లించారు.

‘మేమంతా సిద్ధం’ పేరుతో సాగిన ఈ బస్సు యాత్రలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. టోల్‌గేట్‌ నుంచి సీఎం కాన్వాయ్‌ బయల్దేరే వరకు జాతీయ రహదారిలో వాహనాలను నిలిపేశారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్‌ కాన్వాయ్‌ వెంట వందల సంఖ్యలో కార్లు, ఆటోలు రావడంతో ఆ సమయంలో చాలాసేపు ఇతర వాహనాలు హైవేలోకి రాలేకపోయాయి. కాన్వాయ్‌లో వాహనాలపైకి ఎక్కిన కార్యకర్తలు జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. గతేడాది పవన్‌ కల్యాణ్‌ వాహనంపైకి ఎక్కి కొంతదూరం ప్రయాణించినందుకు తాడేపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జగన్‌ పర్యటనలో వాహనాలపైకి ఎక్కిన కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేసినా పోలీసులు ఆనాటి నిబంధన అమలు చేయకపోగా, వారిని వారించే ప్రయత్నమూ చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని