రూట్‌ మ్యాప్‌ ఎంపికలోనే వైఫల్యం

జగన్‌ ముందు తమ సత్తా చాటుకునేందుకు వైకాపా నేతలు ఎంపిక చేసిన మార్గమే సీఎంపై దాడికి ఆస్కారం కల్పించిందా..? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.

Published : 15 Apr 2024 04:29 IST

33 కేవీ, 11 కేవీ తీగలు, ఇరుకు ప్రాంతం
తీగలు అడ్డొస్తాయని విద్యుత్తు సరఫరా నిలిపివేత
ఇదే అదనుగా రాయి విసిరిన ఆగంతుకుడు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నేరవార్తలు: జగన్‌ ముందు తమ సత్తా చాటుకునేందుకు వైకాపా నేతలు ఎంపిక చేసిన మార్గమే సీఎంపై దాడికి ఆస్కారం కల్పించిందా..? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. శనివారం సాయంత్రం విజయవాడలో సీఎం జగన్‌ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షోలో ఆయనపై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అసలు ఈ యాత్రకు ఎంచుకున్న మార్గం సరైంది కాదనే అభిప్రాయాన్ని భద్రతా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వీవీఐపీలు వెళ్లే మార్గాన్ని ముందుగా పోలీసులు పరిశీలించిన తర్వాతే రూట్‌ మ్యాప్‌ ఖరారు చేస్తారు. రెండు రోజుల ముందు కూడా ఎడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజాన్‌ (ఏఎస్‌ఎల్‌) నిర్వహిస్తారు. ఆ సమయంలో ఏవైనా భద్రతాపరమైన లోపాలు తలెత్తితే సరిచేసుకుంటారు. ఘటన జరిగిన సింగ్‌నగర్‌ డాబా కొట్ల రోడ్డులో 33 కేవీ లైన్లు ఉన్నాయి. అలాంటి మార్గంలో బస్సుపై నిలబడి వెళ్లడం ప్రమాదకరం కావడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. చిమ్మచీకటి అలముకోవడంతో దీనినే అదనుగా భావించిన దుండగుడు దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం ఘటనా స్థలానికి అత్యంత సమీపంలో ఉంది. ఈ ప్రాంతమంతా ఆయన అడ్డా. దీంతో సీఎం ఎదుట తన సత్తా చాటుకునేందుకే 33 కేవీ లైన్‌ ఉన్నా ఈ మార్గంలో రోడ్‌షోను ఖరారు చేశారనే విమర్శలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.  

విద్యుత్తు నిలిపివేత భద్రతా లోపం కాదా?: జగన్‌ రోడ్‌షో శిఖామణి సెంటర్‌కు చేరుకునే సరికే చీకటి పడింది. అప్పటి నుంచే జగన్‌ ప్రయాణించే మార్గంలో విద్యుత్తు సరఫరా ఆపేశారు. విద్యుత్తు తీగలు ఉన్నాయని పేర్కొంటూ ఇలా సరఫరా నిలిపివేయడం పెద్ద లోపమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇలా పలు భద్రతాపరమైన లోపాలను వదిలేసి నేరాన్ని తమ పార్టీపై నెట్టడమేంటని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని