బలిపీఠంపై బందరు పోర్టు

‘తెలుగుదేశం ప్రభుత్వం బందరు పోర్టు నిర్మించడం లేదు. అది నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయి. నేను అధికారంలోకి రాగానే పోర్టు పనులు ప్రారంభిస్తా. చంద్రబాబు పాలనలో అభివృద్ధి లేదు.

Published : 15 Apr 2024 05:51 IST

కృష్ణా రైతన్నపైనా జగన్‌ పగ
హామీలు బోలెడు.. ఆచరణ మరిచారు

‘తెలుగుదేశం ప్రభుత్వం బందరు పోర్టు నిర్మించడం లేదు. అది నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయి. నేను అధికారంలోకి రాగానే పోర్టు పనులు ప్రారంభిస్తా. చంద్రబాబు పాలనలో అభివృద్ధి లేదు.. అంతా అవినీతే. మట్టినీ తినేస్తున్నారు. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. వారికి గిట్టుబాటు ధర కల్పిస్తాం.

2018లో కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ వ్యాఖ్యలు.

ఈనాడు, అమరావతి: గత ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లావాసులకు అరచేతిలో స్వర్గం చూపించిన జగన్‌.. ఆ తరువాత యథావిధిగా హామీలన్నింటినీ విస్మరించారు. బందరు పోర్టు నిర్మాణంపై అప్పటి అధికార తెలుగుదేశం పార్టీని నిలదీసిన ఆయన తన పాలనలో మాత్రం పురోగతి సాధించలేదు. ప్రస్తుత ఎన్నికల ముందు సీఎం హోదాలో మరోసారి సోమవారం కృష్ణా జిల్లాలో బస్సు యాత్రకు వస్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు. జగన్‌ సీఎం అయ్యాక గత ప్రభుత్వం నవయుగకు అప్పగించిన బందరు పోర్టు పనుల కాంట్రాక్టును రద్దు చేశారు. మళ్లీ టెండర్లంటూ నాటకాలాడి అనుకూల మేఘా సంస్థకు కట్టబెట్టారు. గతేడాది మే నెలలో మరోసారి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో రూ.5,156 కోట్లతో నాలుగు బెర్తులుగా 35 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మిస్తున్నామని ప్రకటించారు. భవిష్యత్తులో బెర్తుల సంఖ్యను పెంచుతూ 116 మి.టన్నుల వరకూ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. పోర్టును ఆరున్నర కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారితో అనుసంధానిస్తామని, గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైనును ఇక్కడివరకూ తీసుకొస్తామని హామీల వర్షం కురిపించారు. ప్రస్తుతం రైల్‌రోడ్‌ కనెక్టివిటీ పనులు నిలిచాయి. రూ.420 కోట్లతో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ పనులు మధ్యలోనే ఆగాయి. కీలకమైన డ్రెడ్జింగ్‌ పనులనూ ఆపేశారు. మార్కెటింగ్‌ వసతులపైనా దృష్టి పెట్టలేదు. హార్బర్‌ విస్తరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.


రూ.వందల కోట్ల మట్టి దందా

‘సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని బ్రహ్మయ్యలింగం చెరువును విచ్చలవిడిగా తవ్వేస్తూ మట్టి దోపిడీ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటా..’ విపక్షనేతగా పాదయాత్ర చేస్తూ గన్నవరం వచ్చినప్పుడు జగన్‌ ఇచ్చిన హామీ ఇది. ఆయన అధికారంలోకి వచ్చి అయిదేళ్లవుతున్నా తవ్వకాలపై విచారణ చేయించలేదు. బ్రహ్మయ్యలింగం చెరువును జలాశయంగా మార్చే ప్రణాళికలూ బుట్టదాఖలయ్యాయి. మరోవైపు పోలవరం కాలువ, గుట్టలు, కొండపోరంబోకులో వేల ఎకరాల్లో మంత్రులు, ఎమ్మెల్యే అనుచరులు తవ్వకాలు చేపట్టి రూ.వందల కోట్ల విలువైన మట్టి కొల్లగొట్టారు. ఇది చాలదన్నట్టు జగనన్న లేఅవుట్ల చదును పేరుతో నిధులు స్వాహా చేశారు. వీటికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం సహకరించిందన్న ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని