మద్యానికి కాపలా ఉంచి.. మరుగుదొడ్లు కడిగించి

గురువును ప్రత్యక్ష దైవంగా కొలిచే సమాజం మనది. బోధనా వృత్తి గౌరవప్రదమైనదే కాదు.. పవిత్రమైనది కూడా. అందుకే అటువైపు వెళ్లేవారెందరో! కానీ జగన్‌ పాలనలో వారి పరిస్థితి ‘రాజపూజ్యం 0, అవమానం 6’గా మారింది.

Updated : 15 Apr 2024 06:34 IST

రాత్రిపూట తనిఖీల పేరుతో టీచర్ల పరువు తీసిన వైనం
కోడిగుడ్ల సరఫరా లేకపోయినా.. నోటీసులు
సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసి..
రాజకీయ బదిలీలంటూ రూ.50 కోట్లు గుంజుకుని..
జగన్‌ సర్కారులో బడిపంతులు బతుకు నరకం
ఈనాడు - అమరావతి

గురువును ప్రత్యక్ష దైవంగా కొలిచే సమాజం మనది. బోధనా వృత్తి గౌరవప్రదమైనదే కాదు.. పవిత్రమైనది కూడా. అందుకే అటువైపు వెళ్లేవారెందరో! కానీ జగన్‌ పాలనలో వారి పరిస్థితి ‘రాజపూజ్యం 0, అవమానం 6’గా మారింది. గుడి లాంటి బడిలో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురువులను.. మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది.. వారిచేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది.. నాడు- నేడు పనులంటూ నానా వేధింపులకు గురిచేసింది! అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం.. గురువులని పురుగులకంటే హీనంగా చూసి అవమానించింది!


కల్లబొల్లి మాటలు..

ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ సరిగ్గా సమయానికి వచ్చేట్టుగా చేస్తానని హామీ ఇస్తున్నా.

ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన మాటలివి


అన్నీ అవమానాలే..

గన్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆనందం ఆవిరైపోయింది. సంఘాల నాయకులు కనీసం ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను విన్నవించుకునేందుకే సమయం ఇవ్వలేదు. 11వ పీఆర్సీ సాధనకు ఉద్యోగులు నిర్వహించిన ‘చలో విజయవాడ’లో ఉపాధ్యాయులు ఎక్కువగా పాల్గొన్నారనే కక్షతో చివరికి వారికి జీతాలు సకాలంలో ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది.

యిదేళ్ల పాలనలో ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లు వ్యవహరించింది జగన్‌ సర్కారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు నిర్వహించిన విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డు ముట్టడికి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. అది మొదలు వారిపై ఉక్కుపాదం మోపింది. ప్రతి అంశంలోనూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులను జగన్‌ ప్రభుత్వం కరోనా సమయంలో ఏకంగా మద్యం దుకాణాల ముందు కాపలాగా పెట్టింది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులతో బడుల్లో మరుగుదొడ్లను కడిగించింది. విద్యార్థుల నోటు పుస్తకాలు దిద్దలేదని అవమానించింది. జీతాలు ఇవ్వడంలోనూ జాప్యం చేసి, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టింది. పోలింగ్‌ విధులకు టీచర్లను దూరం చేయాలనే ఉద్దేశంతో ఏకంగా విద్యా హక్కు చట్టాన్నే సవరించింది. ‘నాడు-నేడు’ పనుల్లో పేలవమైన పనితీరు కనబరిచారంటూ నోటీసులు ఇచ్చింది. సిఫార్సు బదిలీల పేరుతో రూ.50కోట్లు అక్రమంగా లాగేసింది. ఇవీ.. జగన్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,69,642 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై చూపిన కక్షసాధింపు చర్యలు.

పోలింగ్‌ విధులు తప్పించే ఎత్తుగడ వేసి..

పీఆర్సీ, ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందించకపోవడం సహా అనేక అంశాల్లో జగన్‌ సర్కారుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పోలింగ్‌ విధులు అప్పగిస్తే ఇబ్బందవుతుందనే అపోహతో జగన్‌ సర్కారు వారిని ఎన్నికల విధులకు దూరం చేసేందుకూ ప్రయత్నాలు చేసింది. బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు పాల్గొనరాదంటూ విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. అనివార్య పరిస్థితుల్లో విద్యేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను వినియోగించాల్సి వస్తే మొదట ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందర్నీ వినియోగించిన తర్వాతే తప్పదనుకుంటేనే వారిని తీసుకోవాలని సవరణ చేసి.. ఎన్నికలకు టీచర్ల సేవలు అవసరం లేదని పరోక్షంగా సూత్రీకరించింది. సాధ్యమైనంత మేర ఉపాధ్యాయులు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాల్లోనే పాల్గొనాలని సవరణలో పేర్కొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల విధులను బోధనేతర పనులుగా పేర్కొన్న ప్రభుత్వం.. మరోపక్క వారితో నిత్యం బోధనేతర పనులు చేయిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో చివరికి ఉపాధ్యాయులకు పోలింగ్‌ విధుల్లో భాగస్వామ్యం లభించింది. జగన్‌ సర్కార్‌ ఉపాధ్యాయులపై ఎలాంటి వివక్ష చూపిందో దీన్ని బట్టే తెలుస్తుంది.

అందరి ముందు అవమానించారు..

పాఠశాలల తనిఖీలతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం వ్యవహరించింది. పనివేళల్లో కాకుండా రాత్రి సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ నోటుపుస్తకాలు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు ఆయన వెంట వెళ్లాల్సి వచ్చేది. విద్యార్థులు నోటు పుస్తకాలు సరిగా రాయకపోయినా.. వాటిని దిద్దకపోయినా గ్రామంలో అందరి ముందు ఉపాధ్యాయులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి అవమానించారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చి వివరణ ఇవాలంటూ ఆదేశాలు ఇచ్చారు ప్రవీణ్‌ ప్రకాష్‌. ఆన్‌లైన్‌లోనూ నోటు పుస్తకాలు తనిఖీ చేసి టీచర్లపై ఒత్తిడి చేశారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి.

ఆర్జేడీలు, డీఈవోలు, డిప్యూటీడీఈవోలు, ఎంఈవోలు తనిఖీలు చేయాలంటూ ఆదేశాలిచ్చి, వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. పాఠశాలల్లో 27అంశాలు పరిశీలించాలంటూ వారిని ఆదేశించారు. ప్రభుత్వం ఒత్తిడితో వీరు బడులు తనిఖీలు చేస్తూ ఏ చిన్న తప్పు దొర్లినా నోటీసులు ఇస్తూ టీచర్లను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు.

మరుగుదొడ్ల బాధ్యత వారిదే..

పోలింగ్‌ విధులను బోధనేతర పనులుగా పేర్కొన్న ప్రభుత్వమే ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోంది. రోజూ ఉదయం ఓ ఉపాధ్యాయుడు మరుగుదొడ్ల ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఒకవేళ మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా.. ఫొటోలు సకాలంలో పంపించకపోయినా షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. కొన్నిచోట్ల ఆయాలు లేకపోవడం, ఉన్నా వారు విధులకు రాని సమయంలో ఉపాధ్యాయులే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు.

  • మధ్యాహ్న భోజన పథకం, ‘నాడు-నేడు’ పనుల బాధ్యతలను అప్పగించింది. ప్రతి రోజూ భోజనంలో పెట్టే పదార్థాల ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన పెట్టింది. ఫొటోలు అప్‌లోడ్‌ కాకపోతే షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ‘నాడు-నేడు’ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెట్టింది.
  • కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సరఫరా చేయనిచోట విద్యార్థులకు గుడ్డుపెట్టలేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. కోడిగుడ్లు సరఫరా చేయని గుత్తేదారుపై చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులను బాధ్యులుగా తేల్చింది. ఇది వేధింపులకు పరాకాష్ఠ.

జీతాలకూ ఇబ్బంది పెట్టారు..

ఉపాధ్యాయులను జగన్‌ సర్కారు జీతాలకూ ఇబ్బందులు పెట్టింది. వీరందరికీ చాలా నెలలపాటు ఆలస్యంగా వేసింది. దీనిపై గతంలో విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు నిరసనలు తెలిపితే వెంటనే ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీడీఈవోలు వేధింపులకు దిగారు. జీతాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. కలెక్టరేట్ల ముట్టడి చేశాయి. వీటికి అనుమతులు ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేసి, వారిని ఇబ్బందులకు గురి చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వాయిదాల చెల్లింపులకు వెసులుబాటు ఇవ్వాలంటూ బ్యాంకు మేనేజర్లకు వినతులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి కల్పించింది.

సుద్ద ముక్కకూ దిక్కు లేదు..

పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులనూ ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం మానేసి.. సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లులాంటి వాటిని ఉపాధ్యాయులు సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించింది. పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.122.04కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. అందులో 40శాతం కూడా ఇవ్వడం లేదు.

  • పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులు కేటాయిస్తారు. 30 మంది, అంతకంటే తక్కువ విద్యార్థులు ఉంటే పాఠశాలలకు రూ.10వేల చొప్పున ఇవ్వాలి. 30 నుంచి 100మంది వరకు ఉంటే అన్ని పాఠశాలలకు రూ.25వేల చొప్పున మంజూరు చేయాలి. 100 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 250 నుంచి వెయ్యి మంది వరకు రూ.75వేలు, వెయ్యికిపైన ఉంటే రూ.లక్ష చొప్పున ఇవ్వాలి.
  • వాస్తవంగా ఈ నిధుల్లో 60శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వీటిని ఇతర అవసరాలకు వాడేసుకున్న ప్రభుత్వం రోజువారీ నిర్వహణ బరువును ఉపాధ్యాయులపై వేసింది. 2021-22లో చాలామంది ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంతో ఆ భారం టీచర్లపైనే పడింది. పురపాలక పాఠశాలలకు అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆ బడుల్లో ఉపాధ్యాయులే తలో కొంత వేసుకొని వాటిని కొనాల్సి వచ్చింది.

అక్రమ బదిలీలతో కాసుల వేట..

ఉపాధ్యాయుల అవసరాలతోనూ జగన్‌ ప్రభుత్వం కాసుల వ్యాపారం చేసింది. ప్రభుత్వ సిఫార్సు బదిలీల పేరుతో ఉపాధ్యాయుల నుంచి రూ.50కోట్లు పిండేసింది. ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, ఆయన పేషీలోని పీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులు కలిసి కొంత మంది ఉపాధ్యాయులను దోచుకున్నారు. రాజకీయ పైరవీల పేరుతో 2600మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గురువులను గౌరవించడం, అవినీతి లేకుండా చూడాల్సిన ప్రభుత్వమే వారి ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బ కొట్టడం, తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడం సహా చివరికి బదిలీలతో వారి నుంచి డబ్బులు లాగేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని