ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు.

Updated : 15 Apr 2024 07:17 IST

ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు

ఈనాడు, అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే నమోదు చేసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే. సాధారణంగా నామినేషన్ల గడువు చివరి రోజు వరకూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటి పరిశీలన, నోటీసుల జారీ, దరఖాస్తుదారుల సమాధానం కోసం వారం రోజులు గడువు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకే ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. వీటిని పరిశీలించి అర్హులైన వారందరికీ ఓటరు జాబితాలో చోటు ఇవ్వనుంది. తుది   జాబితాకు అనుబంధంగా ఈ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. అందులో పేర్లు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు మార్గాలివి:

ఆన్‌లైన్‌ ద్వారా

విధానం-1: www.nvsp.in వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ కావాలి. ‘రిజిస్టర్‌ యాజ్‌ ఏ న్యూ ఓటర్‌’ అనే విభాగంపై క్లిక్‌ చేస్తే ‘ఫాం-6: అప్లికేషన్‌ ఫాం ఫర్‌ న్యూ ఓటర్స్‌’ అనే ఉప విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ నింపి సబ్మిట్‌ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌ నంబర్‌కు రిఫరెన్స్‌ ఐడీ నంబరు వస్తుంది. దాని ఆధారంగా ఇదే వెబ్‌సైట్‌లో ఆ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌ స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు.

విధానం-2: https://voterportal.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తొలుత మీ ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలి. లాగిన్‌ అయ్యి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసుకుంటూ వెళ్లి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపి సబ్మిట్‌ చేయొచ్చు.

విధానం-3: ప్లే స్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline మొబైల్‌ యాప్‌ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత మీ ఫోన్‌ నంబర్‌, వివరాలు పొందుపరిచి రిజిస్టర్‌ చేసుకోవాలి. వాటి ఆధారంగా లాగిన్‌ కావాలి. ‘ఓటరు రిజిస్ట్రేషన్‌’ విభాగంలోకి వెళితే ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే విభాగం వస్తుంది. దానిపై క్లిక్‌ చేసుకుంటూ వెళ్లి.. అందులో అడిగిన వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్‌ చేయాలి.

విధానం-4: https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా ఎన్‌వీఎస్‌పీ, ఓటర్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ లింకుల్లోకి వెళ్లొచ్చు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌ ద్వారా

విధానం-1: బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్వోలకు) నేరుగా ఫాం-6 దరఖాస్తులు సమర్పించవచ్చు.

విధానం-2: ప్రతి నియోజకవర్గానికి డివిజన్‌ స్థాయి అధికారిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించొచ్చు. ప్రతి మండలంలోనూ స్థానిక తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఏఈఆర్వోలు)గా నియమించింది. ఆ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. వాటిపై విచారించి ఓటు హక్కు కల్పిస్తారు.  

ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏవైనా సందేహాలుంటే: 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య కాల్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని