జగన్‌ పర్యటనలో జనం ఎక్కడ?

జగన్‌ బస్సు యాత్రకు జన స్పందన లేకపోవడం చూసి.. వైకాపా నేతలే కలవరపడుతున్నారు. ఆయన పర్యటించే మార్గంలోని కూడలి ప్రాంతాల్లోనూ.. కనీసం యాభైమంది కూడా కనిపించడం లేదు.

Updated : 15 Apr 2024 08:02 IST

సీఎం ఇంటి సమీపంలోనూ పదుల సంఖ్యలోనే
వైకాపా నేతల్లో కలవరం

ఈనాడు, అమరావతి: జగన్‌ బస్సు యాత్రకు జన స్పందన లేకపోవడం చూసి.. వైకాపా నేతలే కలవరపడుతున్నారు. ఆయన పర్యటించే మార్గంలోని కూడలి ప్రాంతాల్లోనూ.. కనీసం యాభైమంది కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా.. ‘మేమంతా సిద్ధం’ కాదు అనే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనను చూసి ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. దీనిపై ఆ పార్టీ ముఖ్యనేతల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర సాగిన మార్గంలో.. కనిపించిన దృశ్యాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

శనివారం ఆయన నంబూరు బస నుంచి  విజయవాడ మధ్యలో.. ముందు భారీ సంఖ్యలో పోలీసులు, రోప్‌ పార్టీలు, రెండు పైలట్‌ వాహనాలతోపాటు సీఎం బస్సు, ఆ వెనుక అంబులెన్స్‌, మరో రెండు బస్సులు, కాన్వాయ్‌ వాహనాలతోనే రోడ్డు నిండిపోయింది. రెయిన్‌ట్రీ పార్కు సమీపంలో అయితే గ్రామస్థాయి నేతల ప్రచారాన్ని తలపించింది. తాడేపల్లి ప్యాలెస్‌ సమీపంలోని డి మార్ట్‌, క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గం దగ్గర పదుల సంఖ్యలోనే కార్యకర్తలు కనిపించారు. సామాజిక మాధ్యమాలు, ఎంపిక చేసిన టీవీ ఛానళ్లను చూస్తే జగన్‌ పర్యటనకు జనం తండోపతండాలుగా వస్తున్నట్లు కనిపిస్తోంది.‘శుక్రవారం సత్తెనపల్లి నుంచి విజయవాడకు కారులో బయలుదేరాం.. గ్రామ కూడలి ప్రాంతాల్లో 10 నుంచి 20 మంది కార్యకర్తలు జెండాలు పట్టుకుని నిలబడ్డారు. మరీ ఇంత తక్కువమంది ఉన్నారేంటి అని అనుకున్నా. తర్వాత వీడియోలో చూస్తే.. జనం భారీగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజంగా వీళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యపోయా. అంతా టెక్నాలజీ మహిమ’ అని సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఒకరు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని