స్వేచ్ఛ కోసం ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం

‘బ్రిటిష్‌ పాలనలో ఇలాంటి అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో చూస్తున్నాం. మన రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం రావాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి.

Updated : 15 Apr 2024 07:31 IST

బ్రిటిష్‌ పాలన తరహా వైకాపాను ఓడిద్దాం
అప్పటివరకు ప్రజల్లోనే ఉంటా..
చంద్రబాబు అరెస్టు సమయంలో రాజకీయాలు అవసరమా అనిపించింది
స్వాతంత్య్రం కోసం నాడు ఉద్యమించినట్లే నేడు చంద్రబాబు పోరాటం
మీడియా ప్రతినిధులతో నారా భువనేశ్వరి

ఈనాడు, అమరావతి: ‘బ్రిటిష్‌ పాలనలో ఇలాంటి అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో చూస్తున్నాం. మన రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం రావాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. ఈ లక్ష్యంతోనే మే 10 వరకు ప్రజల్లోనే ఉంటా..’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. కూటమి మద్దతుతో ప్రజా ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏర్పాటుచేయగలరని ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాసనసభ నియోజకవర్గాల్లో తొమ్మిది వేల కి.మీ.కుపైగా ప్రయాణించి కార్యకర్తల కుటుంబాలకు ఆమె భరోసానిచ్చారు. యాత్ర ముగిసిన సందర్భంగా ఆదివారం కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘కేసులు, అరెస్టులతో ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడిని ఇబ్బంది పెడుతుంటే.. ఈ రాజకీయాలు అవసరమా? అని బాధ కలిగింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర పరిస్థితులు చూశాక చంద్రబాబు పోరాటం తప్పనిసరని అనిపించింది. ఆయన జీవితం రాష్ట్రానికి, ప్రజలకు అంకితం’ అని భువనేశ్వరి తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..

మరో స్వాతంత్య్ర పోరాటమని స్థిమితపడ్డా

చంద్రబాబును జైలులో తొలిసారి చూసిన సంఘటన జీవితంలో మరిచిపోలేను. ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు పొందిన నాయకుడిని ఖైదీలా చూసి తట్టుకోలేకపోయా. చుట్టూ ఆరేడుగురు పోలీసులున్నారు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరని ఆయన ఈ బాధ తాత్కాలికమేనని ఓదార్చారు. ఆ తర్వాత మనసు సర్దుబాటు చేసుకున్నా. స్వాతంత్య్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకుని అలాంటిదే ఇదొకటని స్థిమితపడ్డా. స్వాతంత్య్రం కోసం ఏ తప్పూ చేయనివారూ జైలుకు వెళ్లారు. రాష్ట్రం కోసం చంద్రబాబు వెళ్లాల్సి వచ్చిందని మనసుకు నచ్చజెప్పుకొన్నా. రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నారని అనుకున్నా. చంద్రబాబును 53 రోజులు నిర్బంధించారు. ఆయనపై నమ్మకంతో ప్రజలే ప్రభుత్వంపై తిరగబడ్డారు. విడుదల కోసం పోరాడారు. లోకేశ్‌ యువగళం స్పందన, చంద్రబాబుకు ప్రజాదరణను గమనించి ప్రభుత్వం కేసుల కుట్ర పన్నింది. తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు. చివరకు రూ.27 కోట్లు అన్నారు. వేటికీ ఆధారాల్లేవు. ఆయన ఏ తప్పూ చేయరు.

బ్రాహ్మణి కోడలు కాదు కుమార్తె

చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు బ్రాహ్మణి కోడలికంటే కుమార్తెలా మా వెంట నిలిచింది. భోజనం సహా అన్ని అవసరాలు చూసుకుంది. ‘నిజం గెలవాలి’ యాత్రకూ భరోసానిచ్చింది. జైలులో ఉన్నప్పుడు ప్రజలందరూ మాకు అండగా నిలిచారు. ఉండేందుకు ఒక దాత రాజమహేంద్రవరంలో ఇల్లు ఇచ్చారు. ఆయన విడుదల రోజును అందరూ పండగలా చేసుకున్నారు. కుటుంబం కోసం సమయమివ్వాలని చంద్రబాబుతో తరచూ గొడవపడిన నేను.. ఆయన్ను ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో ప్రత్యక్షంగా చూశాక ఆలోచన మార్చుకున్నా.

రాజధాని వస్తుందంటే నాలుగెకరాలే కొంటారా?

అమరావతిలో రాజధాని వస్తుందని ముందే తెలిసి హెరిటేజ్‌ సంస్థ నాలుగెకరాలు కొన్నట్టు ఇన్నర్‌ రింగురోడ్డుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. ఏ తప్పూ చేయలేదని హెరిటేజ్‌ ఎండీగా నాకు తెలుసు. అందుకే ధైర్యంగా ఉన్నా. రాజధాని వస్తుందని కొనాలనుకుంటే ఎవరైనా నాలుగెకరాలే కొని ఊరుకుంటారా? నాలుగెకరాల గురించి మాపై కేసు పెడితే అధికారం అండతో వేల ఎకరాలు కొట్టేసిన వైకాపా నేతలను ఏమనాలి?

పవిత్ర సభలో మహిళపై దుర్భాషలా?

పవిత్ర సభలో మహిళలను అవమానపరిచారంటేనే వారి నైతికత స్పష్టమవుతుంది. నాన్న ఎన్టీఆర్‌ నుంచి ధైర్యం, మా అమ్మ నుంచి క్రమశిక్షణ అలవడ్డాయి. గడ్డు పరిస్థితులను ఈ ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కొన్నా. నాపై నమ్మకంతో చంద్రబాబు అప్పగించిన ‘నిజం గెలవాలి’ యాత్రను మనస్ఫూర్తిగా నిర్వహించా. ఆయన్ను అరెస్టు చేసిన బాధతో చనిపోయిన 203 మంది కార్యకర్తల కుటుంబాలను కలిశా. నాయకుడి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు కొందరు, ప్రభుత్వ అరాచకాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు మరికొందరు ఉన్నారు. దాడులనూ కార్యకర్తలు భరించారు. ప్రజలు, పార్టీ కోసమే యాత్ర చేశా. చంద్రబాబు భార్యగా కాకుండా సాధారణ మహిళగానే ఇంటింటికీ వెళ్లి పలకరించి ధైర్యం చెప్పా. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వెంట నడిచారు. మే పదో తేదీ తర్వాత నా హెరిటేజ్‌, సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్‌ ట్రస్టు చాలు. రాజకీయాల జోలికి రాను.


రోడ్ల దుస్థితిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు

రాష్ట్రంలో లోకేశ్‌ పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు 23 వేల కి.మీ. సిమెంటు రోడ్లు వేశారు. వైకాపావారు అధికారంలోకి వచ్చాక కోపంతో కొన్ని తవ్వేశారు. ఇప్పుడు రోడ్లు అధ్వానమయ్యాయి. ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే తొలుత రోడ్లు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు గతంలోనే పేదల కోసం ఎన్నో మంచి పథకాలు తెచ్చారు. అప్పట్లో అవి అంతగా తెలియవు. ప్రజలే స్వయంగా చెప్పారు. అన్న క్యాంటీన్లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. చనిపోయిన పార్టీ కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్‌ సేవా ట్రస్టు ద్వారా చదువులు చెప్పిస్తున్నాం. ఉద్యోగాలు వచ్చేవరకు అండగా నిలుస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని