భారతావని గొప్ప పుత్రుడు అంబేడ్కర్‌

‘సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసి.. సామాజిక వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన భారతావని గొప్ప పుత్రుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌’ అని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కొనియాడారు.

Published : 15 Apr 2024 05:35 IST

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ఈనాడు, అమరావతి: ‘సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసి.. సామాజిక వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన భారతావని గొప్ప పుత్రుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌’ అని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కొనియాడారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి గవర్నర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. ‘పౌరులందరికీ చట్టం ద్వారా సమాన రక్షణకు హామీ ఇచ్చే భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అంబేడ్కర్‌’ అని పేర్కొన్నారు.


అంబేడ్కర్‌ ఆశయాల్ని ఆచరణలోకి తీసుకొద్దాం

-చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేడ్కర్‌ కృషి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్‌ ఆదర్శాలు, ఆశయాల్ని ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.


ప్రజల గుండెల్లో నిలిచిపోయారు

-పవన్‌ కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక సంస్కర్త, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానీయుడు అంబేడ్కర్‌ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి’ అని ఓ ప్రకటనలో తెలిపారు.


మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయాలి

-లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దడంలో అంబేడ్కర్‌ కృషి ఎనలేనిదని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కొనియాడారు. ఉండవల్లిలోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


నిమ్నవర్గాల పురోగతికి పోరాడారు

-నాగబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నిమ్నవర్గాల పురోగతి కోసం అంబేడ్కర్‌ చేసిన పోరాటాలు అసామాన్యమని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఓ ప్రకటనలో కొనియాడారు. ‘అణగారిన వర్గాల విద్యార్థుల కోసం అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం పేరును సీఎం జగన్‌ మార్చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి తిరిగి అంబేడ్కర్‌ పేరు పెట్టడంతోపాటు పకడ్బందీగా అమలు చేస్తాం’ అని వెల్లడించారు.


బడుగు బలహీన వర్గాలకు అండగా తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం అండగా నిలుస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని